పెనుమూరు బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగేనా?
నాలుగు దశాబ్దాల నిరీక్షణకు ఫలితం దక్కేనా?
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
మండల కేంద్రమైన పెనుమూరులో బైపాస్ రోడ్డు నిర్మాణం కూటమి ప్రభుత్వ పాలనలో అయినా చేపడతారా అన్న ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది. గత నలభై ఏళ్లుగా ఈ రోడ్డు కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తుల్లో ఆశతో పాటు అనుమానమూ కలిసివున్నాయి. ప్రభుత్వాలు మారాయి, నాయకత్వాలు మారాయి. కానీ పెనుమూరు బైపాస్ రోడ్డు మాత్రం ఇప్పటికీ కాగితాలకే పరిమితమైందన్న వాపు స్థానికుల్లో వినిపిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టే నాయకుడిగా పేరున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్పై పెనుమూరు ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఆయన చొరవతోనే పెనుమూరులో బస్టాండ్ వాణిజ్య సముదాయం గదుల వేలం జరిగిందని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అయితే ఆ వేలంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే రావడం, అభివృద్ధి ప్రక్రియకు అడ్డంకిగా మారిందన్న విమర్శలూ ఉన్నాయి. ఇదే సమయంలో చార్వాకని పల్లె పంచాయతీని పెనుమూరు పంచాయతీలో విలీనం చేయడంపై హైకోర్టులో స్టే రావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. ఎన్నికలు జరగకపోవడంతో ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శి పరిపాలనా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రత్యేక అధికారిగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల లేమి కారణంగా కేంద్ర ప్రభుత్వ నిధులు నిలిచిపోయాయని, దాంతో గ్రామంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పెనుమూరు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. పెనుమూరులో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మాస్టర్ ప్లాన్ సరిగా అమలు కాకపోవడంతో గ్రామంలోని ప్రధాన రోడ్లు ఇరుకుగా మారాయి. బస్టాండ్ నుంచి కార్వేటినగరం వైపు వెళ్లే మార్గంలో సంత గేటు, ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, బజారు వీధి ఉండటంతో తరచూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. బుధవారం సంత జరిగే రోజున పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని వాహనదారులు వాపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం బైపాస్ రోడ్డు మాత్రమేనని స్థానికుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు బైపాస్ రోడ్డు నిర్మాణంపై విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. 1985లో గ్రామాభివృద్ధి కోసం అప్పటి సర్పంచ్ పి. భక్తవత్సల నాయుడు మాస్టర్ ప్లాన్‌లో రెండు బైపాస్ రోడ్లను పొందుపరిచేలా కృషి చేసిన విషయాన్ని గ్రామ పెద్దలు గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో కార్వేటినగరం రోడ్డు నుంచి ప్రస్తుత మండల కార్యాలయాల సముదాయం వరకు ఒక బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగింది. అయితే చిత్తూరు–పాకాల రోడ్డు నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ముత్యాలమ్మ గుడి, బస్టాండ్, బజారు తూర్పు వీధి మీదుగా కార్వేటినగరం రోడ్డు వరకు ప్రతిపాదించిన 40 అడుగుల బైపాస్ రోడ్డు మాత్రం అర్థాంతరంగా నిలిచిపోయింది. ఈ ప్రతిపాదిత మార్గంలో సుమారు 1.2 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరిగితే బస్టాండ్, సంతగేటు, పాఠశాలలు, బజారు వీధిలో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మాస్టర్ ప్లాన్‌లో రోడ్డు ఉన్నందున కొత్తగా ఇళ్లు నిర్మించేవారు, లేఅవుట్లు వేసేవారు రోడ్డు స్థలాన్ని వదిలిపెడుతున్నప్పటికీ, ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక బైపాస్‌తో పాటు ఇతర రోడ్ల దుస్థితి కూడా పెనుమూరులో పెద్ద సమస్యగానే ఉంది. పెనుమూరు నుంచి కామచిన్నయ్య పల్లె మీదుగా జక్కిదొన వరకు ఉన్న 7.5 కిలోమీటర్ల తారు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. ఈ మార్గం దాదాపు పది గ్రామాలకు ప్రధాన రహదారి కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే విడిది పల్లె మీదుగా ఎర్రమిట్ట పల్లె వరకు ఉన్న నాలుగు కిలోమీటర్ల రోడ్డు కూడా అధ్వాన్న స్థితిలో ఉంది. ఈ రెండు రోడ్ల మరమ్మతుల కోసం టీడీపీ నాయకుడు తులసి నాయుడు ఇటీవల తిరుపతిలో పవన్ కల్యాణ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలుస్తోంది. మొత్తానికి, పెనుమూరు ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బైపాస్ రోడ్డు కల ఇప్పటికైనా నెరవేరుతుందా? కూటమి ప్రభుత్వంలో అయినా నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభిస్తారా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం గ్రామస్తులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అభివృద్ధి మాటలకే పరిమితం కాకుండా, కార్యరూపం దాల్చాలని పెనుమూరు ప్రజల ఆకాంక్ష.

