24, జనవరి 2026, శనివారం

వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద 9 మండలాల ఎంపిక

చిత్తూరు జిల్లాకు రూ.59 లక్షల కేంద్ర నిధులు

10 క్లస్టర్లలో 193 మంది రైతులకు లబ్ధి

ఒక్కొక్కరికి రూ.30 వేలు అందజేసిన కేంద్ర ప్రభుత్వం 

 (ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

వర్షాధార ప్రాంతాల్లో రైతుల ఆదాయాన్ని పెంచడం, సహజ వనరులను సంరక్షించడం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెయిన్‌ఫెడ్ ఏరియా డెవలప్‌మెంట్ (రాడ్) పథకం కింద చిత్తూరు జిల్లాలో 9 మండలాలను ఎంపిక చేశారు. ఈ మండలాల్లో 10 క్లస్టర్లను ఏర్పాటు చేసి సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ పథకం కింద జిల్లాలోని 193 మంది రైతులను ఎంపిక చేసి, వారికి కేంద్ర ప్రభుత్వం రూ.59 లక్షలు నిధులుగా విడుదల చేసింది. ఒక్కో రైతుకు రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులకు ఇది పెద్ద ఊరటనిచ్చే చర్యగా మారింది.

వర్షాలు సకాలంలో పడకపోవడం, సాగునీటి వసతుల కొరత, పెరుగుతున్న సాగు ఖర్చులు వంటి సమస్యల మధ్య రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం ద్వారా సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టి రైతుల జీవనోపాధిని బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పంటల సాగుతో పాటు పశుపోషణ, తోటపని, మత్స్యసాగు, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటోంది. ఎంపికైన 9 మండలాల్లో కలిపి 10 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్‌లో సుమారు 100 హెక్టార్లకు పైగా విస్తీర్ణాన్ని అభివృద్ధి చేస్తూ, రైతుల భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నారు. వర్షపు నీటి సంరక్షణ, భూసార సంరక్షణ, సాగునీటి సమర్థ వినియోగం, పంటల వైవిధ్యం, విలువ జోడింపు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే ఉన్న వాటర్‌షెడ్ పనులను ఆధారంగా చేసుకుని వాటర్‌షెడ్ ప్లస్ విధానంలో ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని వివిధ డివిజన్ల పరిధిలో మొత్తం 193 మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. చిత్తూరు డివిజన్ పరిధిలో చిత్తూరు మండలం దిగువమాంసపల్లి క్లస్టర్‌లో 30 మంది, వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి క్లస్టర్‌లో 13 మంది, పూతలపట్టు మండలంలోని ఎర్రచెరువుపల్లి క్లస్టర్‌లో 10 మంది, వావిలతోట క్లస్టర్‌లో 10 మంది రైతులు ఎంపికయ్యారు. పుంగనూరు డివిజన్ పరిధిలో సదం మండలం ఖంభంవారిపల్లి క్లస్టర్‌లో 25 మంది లబ్ధిదారులు ఉన్నారు. పలమనేరు డివిజన్ పరిధిలో కుప్పం మండలం చందం క్లస్టర్‌లో 20 మంది, బైరెడ్డిపల్లి మండలం పాతూరునత్తం క్లస్టర్‌లో 20 మంది, గుడుపల్లె మండలం సంగనపల్లి క్లస్టర్‌లో 20 మంది, రామకుప్పం మండలం సింగసముద్రం క్లస్టర్‌లో 25 మంది, శాంతిపురం మండలం రాళ్ళబడుగూరు క్లస్టర్‌లో 20 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.

ఎంపికైన 193 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ నిధులతో పశువుల కొనుగోలు, మేత ఏర్పాట్లు, తోటల అభివృద్ధి, నీటి నిల్వ గుంతలు, డ్రిప్ సాగు, చిన్న మత్స్యకుంటలు వంటి పనులు చేపట్టే అవకాశం కలిగింది. రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, వ్యవసాయాన్ని వాతావరణ మార్పులకు తట్టుకునేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం  అమలులో భాగంగా భూసార పరీక్షలు లేదా భూసార హెల్త్ కార్డులు తప్పనిసరిగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక వాతావరణానికి అనువైన పంటలను ఎంపిక చేసి సాగు చేయడం, ఎరువుల వినియోగాన్ని నియంత్రించడం ద్వారా నేల ఉత్పాదకతను పెంచుతున్నారు. మొత్తం సాగు విస్తీర్ణంలో కనీసం 25 శాతం భూమిని క్షేత్ర స్థాయి నీటి యాజమాన్యం కిందకు తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఎంపికైన క్లస్టర్లలో రైతులకు అవసరమైన శిక్షణ కోసం ప్రత్యేక గ్రాంట్లు కూడా మంజూరు చేశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, విలువ జోడింపు, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ధాన్యం బ్యాంకులు, పశుగ్రాస బ్యాంకులు, బయోమాస్ ష్రెడర్లు, సామూహిక మార్కెటింగ్ వ్యవస్థలు వంటి ఉమ్మడి వనరుల ఏర్పాటుకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నారు. చిత్తూరు జిల్లా ఎక్కువగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతం కావడంతో,  వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం రైతులకు కొత్త ఆశలు నింపుతోంది. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు అనుసంధానంగా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ, రైతుల జీవనోపాధిని బలోపేతం చేసే దిశగా ఈ పథకం కీలకంగా మారింది. 

గంగ 1 వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద సాగు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *