28, జనవరి 2026, బుధవారం

శరవేగంగా చిత్తూరు తాగునీటి ప్రాజెక్టు పనులు

అమృత్ 2.0 కింద రూ.380 కోట్లతో బృహత్తర పథకం
అడవిపల్లి జలాలతో దశాబ్దాల దాహార్తికి ముగింపు
2027 నాటికి స్వచ్ఛమైన జలాల నగరంగా చిత్తూరు
కృష్ణా జలాలతో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు
నెరవేరనున్న చిత్తూరు వాసుల చిరకాల స్వప్నం 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

రాయలసీమ గుండెల్లోని చిత్తూరు నగరం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు కల ఇప్పుడు నెరవేరే దశకు చేరుకుంది. వేసవికాలంలో ట్యాంకర్ల మీద ఆధారపడుతూ, వారానికి ఒక్కసారి వచ్చే నీటితో సరిపెట్టుకుంటూ జీవించిన చిత్తూరువాసుల దాహార్తికి శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) ఆర్థిక సహకారంతో బృహత్తర మంచినీటి పథకం అమలులో ఉంది. అడవిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా జలాలను చిత్తూరు నగరానికి తరలించి, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. 380 కోట్ల రూపాయల అంచనాతో తాగునీటి పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అడవి పల్లి నుంచి చిత్తూరుకు ప్రధాన పైపులైన్ పనులు 80 శాతం పూర్తయ్యాయి. చిత్తూరు పట్టణంలో పైపులైన్లు విస్తరణ పునరుద్ధరణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. కె.వి పల్లి మండలంలోని అడవిపల్లి రిజర్వాయర్ నుంచి 45 కిలోమీటర్లు ప్రయాణం చేసి కృష్ణమ్మ చిత్తూరు దాహార్తిని మరో సంవత్సర కాలంలో తీర్చనుంది. స్వచ్ఛ జలాల నగరంగా చిత్తూరు పట్టణం ఆవిర్భవించనుంది.

ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ పట్టణ నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ అభివృద్ధి ప్రాజెక్ట్ పేరుతో అమలు చేస్తున్నారు. అమృత్ 2.0 మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.380 కోట్ల అంచనా వ్యయం ఉంది. ఇందులో 70 శాతం నిధులు ఏఐఐబీ రుణంగా, మిగిలిన 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ వాటాగా అందిస్తోంది. నగరంలో నీటి కొరతను నివారించడం, రోజుకు తలసరి 135 లీటర్ల నీటిని అందించడం, ప్రతిరోజూ లేదా రోజు విడిచి రోజు నీటి సరఫరా చేయడం ఈ పథక ప్రధాన ఉద్దేశాలు. ఈ ప్రాజెక్టుకు ప్రధాన నీటి వనరు హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగమైన అడవిపల్లి రిజర్వాయర్. అక్కడి నుంచి చిత్తూరు నగరంలోని నీటి శుద్ధి కేంద్రం వరకు సుమారు 45 కిలోమీటర్ల మేర భారీ ప్రధాన పైపులైన్ వేశారు. అక్కడ శుద్ధి చేసిన నీటిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఎత్తైన నీటి నిల్వ ట్యాంకుల ద్వారా ప్రజలకు సరఫరా చేయనున్నారు. అడవిపల్లి నుంచి వచ్చే ముడి నీటిని అత్యాధునిక శుద్ధి పద్ధతులతో శుభ్రపరిచి, ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ఈ వ్యవస్థ పూర్తయితే నగరానికి శాశ్వత నీటి వనరు ఏర్పడినట్లే అవుతుంది. ఇప్పటివరకు బోర్లు, ట్యాంకర్లు, చిన్న రిజర్వాయర్ల మీద ఆధారపడిన చిత్తూరుకు ఇది పెద్ద ఊరట.

కొత్త ట్యాంకులు, కొత్త పైపులైన్లు, కొత్త కనెక్షన్లు

ఈ ప్రాజెక్టులో ప్రధానంగా మూడు రకాల పనులు జరుగుతున్నాయి. మొదటిగా, నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా ఎత్తైన నీటి నిల్వ ట్యాంకులు నిర్మిస్తున్నారు. పాతబడ్డ, లీకేజీలు ఉన్న ట్యాంకులను తొలగించి ఆధునిక సాంకేతికతతో కొత్తవి నిర్మిస్తున్నారు. ఇవి నీటి పీడనాన్ని పెంచి అన్ని కాలనీలకు సమానంగా నీరు అందించేందుకు ఉపయోగపడతాయి. రెండవది, పైపులైన్ విస్తరణ. దశాబ్దాల క్రితం వేసిన తుప్పు పట్టిన పైపులను తొలగించి, వాటి స్థానంలో అధిక సాంద్రత గల ప్లాస్టిక్ పైపులు, ఇనుప మిశ్రమ పైపులు వేస్తున్నారు. ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉండి, లీకేజీలను తగ్గిస్తాయి. ప్రధాన రహదారులతో పాటు చిన్న సందుల్లోకి కూడా పైపులైన్లు వేస్తున్నారు. సుమారు 300 నుంచి 400 కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్ వ్యవస్థ ఏర్పడుతోంది. మూడవది, ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు. ఇప్పటివరకు కనెక్షన్ లేని ప్రతి ఇంటికీ కొత్త కనెక్షన్ ఇవ్వనున్నారు. నీటి వృధాను అరికట్టేందుకు ప్రతి కనెక్షన్‌కు నీటి కొలత మీటర్ కూడా అమర్చనున్నారు. దీని వల్ల నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన పెరుగుతుంది.

 80 శాతం పనులు పూర్తి 

ఈ ప్రాజెక్టుకు 2018లో పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. 2019లో పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు ఉన్న అరకొర నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా మార్చి, రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని రూపొందించారు. అయితే, గత ఐదేళ్లలో నిధుల కొరత, కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, జాతీయ రహదారి, రైల్వే లైన్ క్రాసింగ్‌ల వద్ద అనుమతుల ఆలస్యం, భూసేకరణ సమస్యలు వంటి కారణాలతో పనులు మందకొడిగా సాగాయి. అడవిపల్లి నుంచి చిత్తూరుకు వచ్చే ప్రధాన పైపులైన్ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. నగరంలోని అంతర్గత పైపులైన్ పనులు సుమారు 50 శాతం పూర్తయ్యాయి. కొన్ని ట్యాంకుల నిర్మాణం పూర్తవ్వగా, మరికొన్ని చోట్ల ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చాక పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తూ, పనులను వేగవంతం చేస్తోంది. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు తరచూ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ పనుల నాణ్యతను పరిశీలిస్తున్నారు.

 2027 నాటికి స్వచ్ఛమైన జలాల నగరంగా చిత్తూరు

తాజా సమీక్షల ప్రకారం, 2026 డిసెంబర్ లేదా 2027 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రజలకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం పూర్తయితే చిత్తూరు నగరంలో నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వస్తున్న నీరు, ప్రతిరోజూ లేదా రోజు విడిచి రోజు అందే అవకాశం ఉంటుంది. అత్యాధునిక శుద్ధి కేంద్రాల ద్వారా స్వచ్ఛమైన నీరు అందడం వల్ల ప్రజారోగ్యం మెరుగుపడుతుంది. వేసవిలో ట్యాంకర్ల కోసం తిరగాల్సిన అవసరం ఉండదు. చిత్తూరు నగర ప్రజలకు ఇది కేవలం ఒక పథకం కాదు, జీవన ప్రమాణాలను మార్చే విప్లవం. నీరు ఉంటేనే ఊరు అన్న పాత మాటకు అర్థం చెప్పేలా, అడవిపల్లి జలాలు చిత్తూరుకు చేరితే నగరం నిజంగా స్వచ్ఛమైన జలాల నగరంగా మారనుంది. నగర వాసుల తాగునీటి కష్టాలకు తెర పడనుంది.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *