13, జనవరి 2026, మంగళవారం

పండగ పూట మండిపోతున్న మాంసం ధరలు

చికెన్‌కు రెక్కలు… మటన్‌కు కొమ్ములు…
కొండెక్కిన కోటి గుడ్డు ధరలు 
సామాన్యునికి మాంసాహారమే మహాభారం!


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

సంక్రాంతి అంటే తెలుగింటి ఆనందం. పిండివంటలు, కొత్త బట్టలు, బంధుమిత్రుల కలయిక, పల్లె పండుగల సందడి  ఇవన్నీ కలిసిన మహోత్సవం. అయితే ఈ పండుగలో చిత్తూరు జిల్లా ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నది మాత్రం మాంసాహార ధరల మంట. చికెన్, మటన్, నాటుకోడి, గుడ్డు ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్య కుటుంబాల పండుగ బడ్జెట్ పూర్తిగా తారుమారైంది. మాంసం కొనాలంటే జేబుకు చుక్కలు కనిపించే పరిస్థితి నెలకొంది. సాధారణ రోజుల్లో రూ.180 నుంచి రూ.220 మధ్య ఉండే బ్రాయిలర్ చికెన్ ధర, పండుగ సీజన్‌లో రూ.300 దాటింది. లింగాపురం కోడి రూ.270 నుండి 300, నాటు కోడి రూ.480 నుంచి రూ.550 వరకు పలుకుతోంది. ఇక మటన్ ధర రూ.800 నుంచి రూ.900 మధ్యలో ఉండటం గమనార్హం. గుడ్ల ధర కూడా డజను రూ.90కి చేరడంతో మాంసాహార కుటుంబాలకు అదనపు భారంగా మారింది. ఈ ధరలు చూసి చాలా మంది వినియోగదారులు దుకాణాల ముందు వాపోతున్నా, పండుగ కావడంతో కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది.

చిత్తూరు జిల్లాలో బోగి, కనుమ పండుగకు ఉన్న ప్రత్యేక ప్రాధాన్యతే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. బోగి, కనుమ నాడు ముక్క లేనిదే ముద్ద దిగదు అన్న మాట ఇక్కడి జనజీవనంలో బలంగా నాటుకుపోయింది. పశువుల పండుగ అయిన కనుమ తర్వాత కుటుంబమంతా కలిసి మాంసాహార విందు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలనే భావనతో ప్రతి కుటుంబం మాంసం కొనుగోలుకు ముందుకు రావడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగితే ధరలు పెరగడం సహజం అనే వాదనను వ్యాపారులు ముందుకు తెస్తున్నారు. ఇంకో ముఖ్యమైన అంశం అల్లుళ్లు, చుట్టాల రాక. ఉద్యోగాలు, చదువుల రీత్యా పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు సంక్రాంతికి స్వగ్రామాలకు చేరుకుంటారు. ముఖ్యంగా కొత్త అల్లుళ్లకు, బంధువులకు విందు భోజనాలు ఏర్పాటు చేయడం సంప్రదాయం. మర్యాదలో రాజీ వద్దు అనే భావనతో ధర ఎంత ఉన్నా సరే మాంసం కొనడానికి చాలా కుటుంబాలు సిద్ధపడుతున్నాయి. ఈ మానసికతను వ్యాపారులు పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫీడ్, రవాణా ఖర్చులు పెరిగాయి

పౌల్ట్రీ రైతులు మాత్రం తమ పరిస్థితిని మరో కోణంలో వివరిస్తున్నారు. గత కొన్ని వారాలుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కోళ్ల పెరుగుదల మందగించిందని, కొన్ని ఫామ్‌లలో వైరస్ భయంతో ముందుగానే కోళ్లను అమ్మేశారని చెబుతున్నారు. దీంతో మార్కెట్‌కు వచ్చే కోళ్ల సంఖ్య తగ్గింది. సరఫరా తగ్గి, డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ధరలు పెరగడం తప్పలేదని వారు అంటున్నారు. ఫీడ్ ధరలు, రవాణా ఖర్చులు కూడా పెరిగాయని చెబుతూ, తమ లాభం అంత ఎక్కువగా లేదని కొందరు రైతులు స్పష్టం చేస్తున్నారు. బ్రాయిలర్ చికెన్ కంటే లింగాపురం, నాటు కోడికి జిల్లాలో ఉన్న ప్రత్యేక క్రేజ్ కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. ఆరోగ్యానికి మంచిదని, రుచిగా ఉంటుందని భావిస్తూ చాలా మంది నాటు కోడి పులుసునే ఇష్టపడతారు. సాధారణ రోజుల్లో రూ.350 వరకు ఉండే నాటు కోడి ధర పండుగ సమయంలో రూ.500 దాటడంతో సామాన్య కుటుంబాలకు అది పెద్ద భారం అయింది. అయినా ఏడాదికి ఒక్కసారి వచ్చే పండుగ అనే భావనతో కొందరు ఖర్చుకు వెనుకాడటం లేదు. 

ధరల నియంత్రణ వ్యవస్థ ఏది?

ధరల నియంత్రణ విషయంలో అధికారుల నిఘా కొరవడిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని మాంసం దుకాణాల్లో బోర్డుపై ఒక రేటు ఉండగా, వాస్తవంగా వసూలు చేసేది మరింత ఎక్కువగా ఉంటుందని వినియోగదారులు చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు పండుగ సీజన్‌లో ప్రత్యేక తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ధరలపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్నారని విమర్శలు వస్తున్నాయి. సామాన్య ప్రజల ఆవేదన ఈ పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది. పండుగకు చుట్టాలు వచ్చారు. పిల్లలు చికెన్ అడుగుతున్నారు. కిలో రూ.300 అంటే ఎలా కొనాలి? మటన్ వైపు చూడటమే కష్టం. గుడ్లు కూడా రూ.90 అయ్యాయి. మొత్తం పండుగ ఖర్చు పెరిగిపోయిందని చిత్తూరుకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి వాపోయారు. మరో గృహిణి మాట్లాడుతూ పండుగ అంటే ఆనందంగా ఉండాలి. కానీ ధరలు చూసి టెన్షన్ పడాల్సి వస్తోంది. సంప్రదాయం కోసం ఖర్చు చేయక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ధరలను ఖాతరు చేయని యువత

ఇక కొందరు యువకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నాయన్నా, పండుగ కాబట్టి కుటుంబంతో కలిసి భోజనం చేయడం ముఖ్యం. ఏడాదికి ఒక్కసారే కదా అంటూ ఖర్చును సమర్థించుకుంటున్నారు. అయితే ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో పండుగలంటేనే ఖర్చుల భయం పెరుగుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి బోగి, సంక్రాంతి, కనుమ పండుగలు చిత్తూరు జిల్లాలో సంప్రదాయాల పండుగలు. ఆ సంప్రదాయాలకు మాంసాహారం విడదీయరాని భాగంగా మారింది. కానీ ధరలు ఈ స్థాయిలో పెరుగుతుంటే సామాన్యుడికి పండుగ ఆనందం కాస్త భారంగా మారుతోంది. డిమాండ్  సరఫరా సమతుల్యత, అధికారుల పర్యవేక్షణ, వ్యాపారుల బాధ్యతాయుతమైన వ్యవహారం. ఇవన్నీ కలిసినప్పుడే పండుగ పూట ధరల మంట కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది సంక్రాంతి వస్తుందంటే సంతోషం కంటే ముందు ఖర్చు గురించే సామాన్య ప్రజలు మదనపడుతున్నారు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *