30, డిసెంబర్ 2025, మంగళవారం

కదిలిన చిత్తూరు డివిజన్ జిఎస్టి యంత్రాంగం…

ఆంధ్రప్రభ కథనాలకు స్పందన: 
జిల్లా కలెక్టర్ కు జిఎస్టి కుంభకోణం వివరాలను వివరించిన అధికారులు 
8న ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ 
చిత్తూరులో సిజిఎస్టి ఇంటెలిజెన్స అధికారుల విచారణ
ఫిర్యాదు చేయడానికి చిత్తూర్ వన్ టౌన్ కి వచ్చిన అధికారులు
నకిలీ జీఎస్టీ బిల్లుల కుంభకోణంలో కీలక మలుపు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)

నకిలీ బిల్లులతో చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన వేయి కోట్లకు పైగా జీఎస్టీ కుంభకోణంపై ఆంధ్రప్రభ వరుస కథనాలు ప్రభావం చూపడం ప్రారంభమైంది. ఇప్పటివరకు మౌనంగా ఉన్న అధికార యంత్రాంగం ఒక్కసారిగా కదిలి, విచారణలు,ఫిర్యాదుల దశకు చేరుకుంది. ఒకవైపు కేంద్ర స్థాయి సంస్థలు రంగంలోకి దిగగా, మరోవైపు బాధితులు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తమ గోడును వినిపిస్తున్నారు.

గత రెండు రోజులుగా సెంట్రల్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ (సీజీఎస్టీ ఇంటెలిజెన్స్) బృందానికి చెందిన అధికారులు చిత్తూరు జిల్లాలో రహస్యంగా పర్యటిస్తున్నారు. నకిలీ జీఎస్టీ బిల్లుల ద్వారా జరిగిన భారీ లావాదేవీల వెనుక ఉన్న వ్యక్తులు, వారికి సహకరించిన నెట్‌వర్క్, ఈ కుంభకోణంలో భాగమైన వారి ఆస్తులు వంటి అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. కొందరిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని వారి వద్దకు వెళ్లి, నిందితుల పాత్ర, డబ్బు మార్గాలు, లావాదేవీల పద్ధతులపై లోతైన వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఇదే సమయంలో బాధితులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. చిత్తూరు పెద్ద హరిజనవాడకు చెందిన విజయ చక్రవర్తి అనే వ్యక్తి సోమవారం జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తన ఆధార్, పాన్, రేషన్ కార్డులను దుర్వినియోగం చేసి తన పేరుతో షెల్ కంపెనీలు సృష్టించి కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు, ఇప్పుడు తనపై జీఎస్టీ బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు జారీ అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి వ్యాపార సంస్థను స్థాపించలేదని, అయినా రూ.43 లక్షల జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసులు రావడం తనను షాక్‌కు గురి చేసిందన్నారు. నకిలీ పత్రాలతో వ్యాపారం చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. మంగళవారం జీఎస్టీ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. నిందితులను పట్టుకోవడానికి, వారి ఆస్తులను జప్తు చేయడానికి అవసరమైన సహకారం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన అన్ని విభాగాలతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించాలని కలెక్టర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇదే క్రమంలో జీఎస్టీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, అక్కడ సీఐ లేకపోవడంతో కొంతసేపు వేచి ఉండి తిరిగి వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఈ కుంభకోణంలో మరో కోణం ప్రజలను మరింత కలవరపెడుతోంది. చిత్తూరు నగరంలో తోపుడు బండిపై చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక చిరు వ్యాపారికి ఏకంగా రూ.12.30 కోట్ల జీఎస్టీ పెనాల్టీ నోటీసు జారీ కావడం సంచలనంగా మారింది. అతడు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఇంత చిన్న వ్యాపారం చేసే వ్యక్తిపై ఇంత భారీ నోటీసు ఎలా వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది నిజంగా అతని వ్యాపార పరిమాణమా, లేక అతని పేరు, పత్రాలను దుర్వినియోగం చేసి వెనుకనుండి పెద్ద ముఠా వ్యవహారం నడిపిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో జిలానీ అనే వ్యక్తి కోసం సీజీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. నకిలీ జీఎస్టీ బిల్లుల కుంభకోణంలో అమాయకుల పేర్లతో సంస్థలు స్థాపించి కోట్ల లావాదేవీలు జరిపిన తీరు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తూ, మా పేర్లతో వ్యాపారాలు చేసి మేమే నేరస్తులమన్నట్లు నోటీసులు పంపడం అన్యాయం అని వాపోతున్నారు. సామాన్య కూలీలు, చిరు వ్యాపారులు లక్షల,కోట్ల బకాయిలు ఎలా చెల్లిస్తారన్న ప్రశ్న ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రభ కథనాల ప్రభావంతో నిద్రలో ఉన్న వ్యవస్థ మేల్కొన్నట్టుగా కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర అధికారులు కదలికలు ప్రారంభించడంతో పాటు, పోలీసు,రెవెన్యూ, జీఎస్టీ శాఖల సమన్వయంతో కుంభకోణాన్ని చేధించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే నిజమైన నిందితులు ఎవరూ, అమాయకులపై నుంచి భారం ఎప్పుడు తొలగుతుంది, వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన ముఠాలు ఎప్పుడు పట్టుబడతాయన్న ప్రశ్నలకు సమాధానాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో, ఎంతమంది అమాయకులు బలవుతారో అన్న ఉత్కంఠతో జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

గంగ 11 చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జిఎస్టి అధికారులు 
గంగ 12 జిల్లా ఎస్పీని గెలిచిన జీఎస్టీ బాధితుడు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *