జిల్లాలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ !
• చంద్రబాబు, పెద్దిరెడ్డి రాజకీయంగానే ప్రత్యర్ధులు
• ఇద్దరి మధ్య రూ. 500 కోట్ల చీకటి ఒప్పందాలు
• బీసీ యువజన పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు పైకి చిరకాల రాజకీయ ప్రత్యర్ధులుగా కనిపిస్తారని, అయితే, ఇద్దరి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని బీసీ యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచ్సంద్ర యాదవ్ ఆరోపించారు. పుంగనూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇద్దరూ జిల్లాలో రాజకీయంగా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారని ఆరోపించారు. పైకి మాత్రం ఒకరిని ఒకరు తీవ్ర పదజాలంతో దూషించుకుంటారని, ఇది అంతా నటన అని వివరించారు. వీళ్లు ప్రజల ముందు వచ్చి మాట్లాడే మాటలు, ఆరోపణలు అలానే ఉంటాయి కాబట్టి నిజంగా వీరు రాజకీయ ప్రత్యర్ధులే అని నమ్మే పరిస్థితి ఉంటుందని అన్నారు. కానీ, చంద్రబాబు నాయుడు మొదటి సారి 1995 ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ రోజు వరకూ రామచంద్రారెడ్డికి ఆర్ధికంగా, రాజకీయంగా లోపాయికారీగా చంద్రబాబు సహకరిస్తున్నారని ఆరోపించారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అయిదేళ్ల కాలంలో కూడా రాయలసీమలో నీటి ప్రాజెక్టులు, రోడ్డు పనులు చివరకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రోడ్డు పనులు కూడా రామచంద్రారెడ్జికి సంబంధించిన పీఎల్ఆర్ కంపెనీ చేసిందని వివరించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న అయిదేళ్లు రాయలసీమలో పనులను టీడీపీ వాళ్లు కాకుండా రామచంద్రారెడ్డి కంపెనీకి వేల కోట్ల రూపాయల పనులు అప్పగించారంటే వీళ్లద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు.
2019లో వైఎస్ జగన్ అధికారంలోకి రాగా, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న రామచంద్రారెడ్డిపై టీడీపీ వాళ్లు అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇందులో ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి ఎలక్ట్రికల్ కాంట్రాక్ కంపెనీ శ్రీ షిరిది సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ పై టీడీపీ నేతలు అనేక ఆరోపణలు చేయడంతో పాటు ఈనాడు తదితర పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీషిరిది సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి వేల కోట్ల రూపాయలు అప్పగించారన్న ఆరోపణలు చేశారన్నారు. సదరు కంపెనీకి చెందిన విశ్వేశ్వరరెడ్డి జగన్మోనరెడ్డి కుటుంబానికి బినామీ అని టీడీపీ చాలా సార్లు ఆరోపించిందన్నారు. 2012 పులివెందుల ఉప ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డి జగన్మోహనరెడ్డికి డమ్మీగా నామినేషన్ వేసిన విషయం అందరికీ తెలుసునని అన్నారు. అలాంటి కంపెనీ ఎలక్టోరల్ బాండ్ ల రూపంలో టీడీపీకి రూ.40 కోట్లు ఇచ్చింది అంటే ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో, కుమ్మక్కు రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు. అవినీతికి పోరాటం చేస్తామంటారు. అవినీతి పై ఆరోపణలు చేస్తుంటారు కానీ అవినీతిలో వీళ్లందరికీ భాగస్వామ్యం ఉంటుందని రాష్ట్ర ప్రజలు గుర్తించాలన్నారు.
షిరిది సాయి ఎలక్టికల్ కంపెనీ రాష్ట్ర విద్యుత్ శాఖ నుండి వేల కోట్ల రూపాయలు లబ్దిపొందిందన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా, ఈ ఎలక్ట్రికల్ కంపెనీ ప్రత్యక్షంగా ఎలక్టోరల్ బాండ్ ల రూపంలో రూ.40 కోట్ల టీడీపీ అకౌంట్ లోకి అందాయి అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అయినా ప్రతి పక్షంలో ఉన్న పార్టీకి అయినా భాగస్వామ్యం ఉంది అని అర్ధం అవుతుందన్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా రాష్ట్ర సంపదను, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి సొమ్ములో ఆ రెండు పార్టీలకు భాగస్వామ్యం ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారన్నారు. అంతే కాకుండా షిరిది సాయి ఎలక్ట్రికల్ సంస్థ నుండి అనధికారికంగా రూ.500 కోట్లు తెలుగుదేశం పార్టీకి అందాయన్న మాట కూడా వినబడుతోందని అన్నారు. ఈ డీల్ లో భాగంగా కుప్పం, తంబళ్లపల్లి, పుంగనూరు తదితర నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో చంద్రబాబు, పెద్దిరెడ్డికి చీకటి ఒప్పందం జరిగిందని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారన్నారు.
ఈ రెండు పార్టీల నేతలు చిత్తూరు జిల్లాలో అభ్యర్ధుల ఎంపికలోనూ మాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నాయని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారన్నారు. ఈ పార్టీల వికృత రాజకీయ క్రీడల్లో సామాన్య ప్రజలు నష్టపోతున్నారన్నారు. ఆయా పార్టీల్లోని అమాయక కార్యకర్తలు కేసులు పెట్టించుకుని జైళ్లకు వెళుతూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిత్తూరు జిల్లాలో మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ రెండు పార్టీలు పదేళ్లలో పది లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డాయని రామచంద్ర యాదవ్ ఆరోపించారు.