20, మార్చి 2024, బుధవారం

తిరుపతిలో జంగాలపల్లికి సహాయ నిరాకరణ !



తిరుపతి జనసేన, తెదేపా, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు సహాయనిరకరణను ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పూర్తిస్థాయిలో జంగలపల్లికి సహకరించడం లేదు. బీజేపీలో అగ్రనాయకులు జంగాలపల్లిని పట్టించుకోవడం లేదు. టీడీపీ నియోజకవర్గ నేతలు కూడా సహకరించడం లేదు. జంగాలపల్లి స్థానికుడు కాకపోవడంతో పలువురు వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ నాయకులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కూటమిలో స్థానికులకు టిక్కెట్టు ఇస్తే కలిసి పనిచేస్తామని లేకుంటే, ఎన్నికలకు దూరంగా ఉంటామని తెలిపారు. టీడీపీ అధిష్టానం జోక్యం చేసున్నా, ఫలితం కనిపించడం లేదు. ఇదివరకే JMC Go back అంటూ పోస్టర్లు కూడా వేశారు. తాను స్థానికుడినని జంగాలపల్లి చెపుతున్న మాటలను ఎవరు నమ్మడం లేదు. ఇప్పటికే కొందరు కూటమి నేతలు ప్రత్యర్ధులతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది.
 
తిరుపతి టిడిపి, బిజెపి, జనసేన కూటమిలో గందరగోళం నెలకొన్నది.  జనసేనకు కేటాయించిన ఈ స్థానం  చిత్తూరు వైసిపి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు ఇస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే టికెట్టు ఆశిస్తున్న టిడిపి నేతలు స్థానికులకే టికెట్టు ఇవ్వాలని పట్టు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే తమకు అభ్యంతరం లేదని, ఇతరులైతే స్థానికులకు ఇవ్వాలని అంటున్నారు. వైసిపి నుంచి వచ్చిన వ్యక్తికి ఇవ్వడం కంటే టిడిపి ఇంచార్జి సుగుణమ్మకు  ఇవ్వడం ధర్మమని ఒక వర్గం అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒక సారి మాట చెప్పిన తరువాత తప్పడం జరగదని జనసేన నేతలు అంటున్నారు. 

మంగళవారం స్థానిక అన్నా రావు కూడలి సమీపంలో శ్రీనివాసులు ప్రచార కార్యాలయం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన తదితరులు హాజరయ్యారు. అయితే నియోజక వర్గం ఇంచార్జి కిరణ్ రాయల్ రాకపోవడం గమనార్హం. బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నప్పటికీ భాను ప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్, శాంతా రెడ్డి లాంటి పెద్దలు రాకపోవడం గమనించ దగ్గ విషయం. టిడిపికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి, సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్ ముని చంద్రా రెడ్డి, జిల్లా నాయకుడు పి చిన్న స్వామి  హాజరయ్యారు. 

అయితే అదే సమయంలో ఇంచార్జి సుగుణమ్మ ఒక ప్రైవేట్ హోటల్లో కీలక నేతల సమావేశం ఏర్పాటు చేశారు. స్థానికులకే టికెట్టు ఇవ్వాలన్న అజెండాతో సమావేశం జరిగింది. పరోక్షంగా శ్రీనివాసులుకు టికెట్టు ఇస్తే పని చేయము అన్న సంకేతాలు పంపారు. సమావేశంలో ఊకా విజయకుమార్, జె బి శ్రీనివాస్, మబ్బు దేవ నారాయణ రెడ్డి, పులిగోరు మురళీ కృష్ణా రెడ్డి, రవి నాయుడు తదితరులు పాల్గొన్నారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలు కొందరి తీరు ఆసక్తిగా మారింది. టిడిపి అసమ్మతి నేతల వెనక వైసిపి పెద్దల హస్తం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *