జిల్లా విజేత చంద్రుడా ? రామచంద్రుడా ?
చిత్తూరు పార్లమెంటు పరిధిలో మరో మారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ముఖాముఖి తలపడనున్నారు. చంద్రబాబుకు కళాశాల నుండి రాజకీయ వైరి అయిన రామచంద్రా రెడ్డిని వైసీపీ చిత్తూరు పార్లమెంటు ఇంచార్జిగా నియమించారు. అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ రెడ్డెప్ప పోటీచేయనున్నారు. పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలలో వైవీపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత పెద్దిరెడ్డిదే. అలాగే నియోజకవర్గంతో పాటు జిల్లాలో అభ్యర్థులను గెలిపించుకొనే బాధ్యత చంద్రబాబుదే.అందుకే చిత్తూరు లోక్ సభ పరిధిలోని ఎమ్మెల్యే స్థానాల గెలుపు ఓటమి ప్రాధాన్యత సంతరించుకున్నది. అక్కడ ఉన్న ఏడు స్థానాలలో పట్టు ఎవరికి, గట్టు ఎక్కేది ఎవరు అన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ఈ పరిధిలో ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తాజాగా చిత్తూరు, తిరుపతి, అనంతపురం, హిందూపూర్ పార్ల మెంటు నియోజక వర్గాల రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు స్వీకరించారు. దీనితో చిరకాల ప్రత్యర్ధులు అయిన ఇద్దరు నేతలు నువ్వా, నేనా అన్నట్టు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఏడు స్థానాలు కైవసం చేసుకోవాలని చంద్రబాబు ఎత్తు వేస్తున్నారు.
చంద్రబాబును కూడా ఓడించాలని పెద్దిరెడ్డి పై ఎత్తు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు, మిగిలిన ఆరు చోట్ల వైసిపి అభ్యర్థులు గెలిచారు. నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ తరువాత జరిగిన మూడు ఎన్నికల్లో కుప్పంలో టిడిపి అభ్యర్ధి చంద్రబాబు గెలిచారు. చంద్రగిరి, పూతలపట్టు, జి డి నెల్లూరులో టిడిపి అంభ్యర్ధులు హ్యాట్రిక్ ఓటమి నమోదు చేసుకున్నారు. పలమనేరు, చిత్తూరు, నగరిలో ఒకసారి టిడిపి, రెండు సార్లు వైసిపి అభ్యర్థులు గెలిచారు. ఈ నేపథ్యంలో ఆరు చోట్ల వైసిపి అభ్యర్థులు సులభంగా గెలుస్తారని, కొంత కష్టపడితే కుప్పంలో చంద్రబాబును కూడా ఓడించవచ్చని పెద్దిరెడ్డి ధీమాతో ఉన్నారు.
అయితే వైసిపికి వ్యతిరేక పవనాలు వీస్తున్నందున ఏడు స్థానాలలో గెలుపు సాధ్యమని చంద్రబాబు నమ్మకంతో ఉన్నారు. కుప్పంలో వరుసగా చంద్రబాబు గెలుచినప్పటికి 2019 ఎన్నికల్లో గతం కంటే తక్కువ మెజారిటీ వచ్చింది. ఈ సారి ఆయనపై అధిక శాతం ఓట్లు ఉన్న వన్నెకుల క్షత్రియ వర్గానికి చెందిన భరత్ పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఎమ్మెల్సీగా, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. అదే వర్గానికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. దొంగ ఓట్లు తొలగించడం, కులసమీకరణాల వల్ల చంద్రబాబును ఓడించవచ్చని వైసిపి గట్టి నమ్మకంతో ఉంది. అయితే లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తామని టిడిపి నేతలు సవాలు విసురుతున్నారు.
పలమనేరు నియోజక వర్గంలో 2009లో టిడిపి అభ్యర్థి అమరనాద రెడ్డి గెలిచారు. ఆయన 2014 ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే తరువాత టిడిపిలో చేరి మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి వెంకటే గౌడ్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఇద్దరూ పోటీలో ఉన్నారు. పూతలపట్టు నియోజక వర్గంలో వైసిపి అభ్యర్ధిగా సునీల్ పోటీ చేస్తున్నారు. టిడిపి అభ్యర్ధి ఎవరన్నది ఇంకా తేలలేదు. చిత్తూరులో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సి కె బాబు, 2014 లో టిడిపి అభ్యర్ధి డి ఎ సత్య ప్రభ, 2019 లో వైసిపి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలిచారు. ఇప్పుడు వైసిపి అభ్యర్థిగా ఎం సి విజయానంద రెడ్డి, టిడిపి అభ్యర్ధిగా గురజాల జగన్ మోహన్ నాయుడు తలపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సి కె బాబు టిడిపి అభ్యర్థికి అండగా ఉండగా, వైసిపి అభ్యర్థికి పెద్దిరెడ్డి రక్షణగా నిలిచారు. కొత్తగా చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఏ ఎస్ మనోహర్ జత కావడంతో టీడీపీలో జోష్ పెరిగింది.
జి డి నెల్లూరు లో 2009లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ, 2014, 2019 లో వైసిపి అభ్యర్ధి కె నారాయణస్వామి గెలిచారు. ఆయన ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి వైసిపి అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. టిడిపి అభ్యర్థిగా డాక్టర్ వి ఎం థామస్ పోటీలో ఉన్నారు. నగరిలో 2009 లో టిడిపి అభ్యర్ధి గాలి ముద్దు కృష్ణమ నాయుడు, 2014, 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి ఆర్ కె రోజా గెలిచి మంత్రిగా ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో కూడా ఆమే పోటీ చేస్తారని కొందరు అంటుండగా, ఆఖరి నిమిషంలో అభ్యర్ధి మారే అవకాశం ఉందని కొందరి భావన. టిడిపి అభ్యర్ధిగా గత ఎన్నికల్లో ఓడిపోయిన గాలి భానుప్రకాష్ పోటీ చేస్తారు.
చంద్రగిరి నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణ కుమారి, 2014, 2019 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధించారు. ఈ సారి ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసిపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. టిడిపి అభ్యర్ధి ఎవరన్నది ఇంకా తేలలేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన పులివర్తి నాని తనకు లేదా తన భార్య సుధారెడ్డికి టికెట్టు ఇమ్మని పట్టు పడుతున్నారు. కష్ట కాలంలో వైసిపి నేతలపై పోరాటం చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి తన కుమారుడు ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించమని కోరుతున్నారు. పారిశ్రామిక వేత్త డాలర్ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకట్రామా నాయుడు మనవడు ఇందుశేఖర్ కూడా టికెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబు గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పూతలపట్టు, జి డి నెల్లూరు, చంద్రగిరి నియోజకవర్గాలలో వైసిపి విజయం తప్పదని భావిస్తున్నారు. పలమనేరు,చిత్తూరు, నగరిలో పోటీ నువ్వా, నేనా అన్నట్టు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.