తిరుపతి జనసేనకు, శ్రీకాళహస్తి బీజేపీకి ?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బిజెపి ఒక స్థానం నుంచి, జనసేన మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉంది. బిజెపితో పొత్తు కోసం జనసేనాని పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గురువారం హస్తినకు వెళ్ళనున్నారు. బిజెపితో పొత్తు దాదాపుగా ఖరారు అయిందన్న ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను రెండు రోజుల పాటు అక్కడే ఉండి పొత్తు ఖరారు, సీట్ల కేటాయింపు తదితర విషయాలను ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. పొత్తు కుదిరితే అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా 12 స్థానాలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏడు స్థానాలలో తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇక జనసేన తిరుపతి సీటు కోసం పట్టబడుతోంది. దాదాపుగా తిరుపతి సీటును జనసేన కేటాయించినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇందుకనుగుణంగా ఐ వి ఆర్ ఎస్ సర్వే జరుగుతోంది. తొలుత పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని సర్వే జరిగింది. అనంతరం చిత్తూరు శాసనసభ్యుడు జంగాలపల్లి శ్రీనివాసులు అక్కడి నుండి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న విషయం మీద కూడా స్థానిక టిడిపి నాయకుల అభిప్రాయం తెలుసుకున్నారు. వీరు కాకుండా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరి ప్రసాద్, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ కూడా తిరుపతి టికెట్ ని ఆశిస్తున్నారు. అయితే తిరుపతి సీటును వదులుకోవడానికి తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు సిద్ధంగా లేరు. స్థానిక నాయకులు మాత్రం తమకే ఉండాలని గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం జనసేనకు ఇవ్వడానికి మొగ్గుచూపారని సమాచారం.
భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి, రాజంపేట పార్లమెంటు స్థానాలను, తిరుపతి, శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానాలను అడుగుతోందనీ సమాచారం. ఈ కారణంగానే తిరుపతి, రాజంపేట పార్లమెంటు స్థానాలకు ఇప్పటివరకు టిడిపి అభ్యర్థులను ఖరారు చేయలేదు. అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. తిరుపతి స్థానాన్ని జనసేన కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. శ్రీకాళహస్తి అసెంబ్లీ సీట్లు బిజెపికి కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ మీడియా ఇంచార్జ్ కోలా ఆనంద్ శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఆయన అధిష్టానాన్ని కలిసి తన మనసులోని మాటని చెప్పారు. దరఖాస్తు కూడా చేసుకున్నారు. బిజెపి తొలుత ఇచ్చిన జాబితాలో శ్రీకాళహస్తి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజుల కిందట నగరికి చెందిన బీసీ నేత కొండూరు అశోక్ రాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఆయన నగరి అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే టిడిపి నగిరి అభ్యర్థిగా గాలి భాను ప్రకాష్ ను ప్రకటించింది. కావున ఇందులో మార్పు ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. బిజెపికి శ్రీకాళహస్తి సీటును కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.