12, మార్చి 2024, మంగళవారం

టిక్కెట్లపై పుకార్ల షికార్లు !



చిత్తూరు ఉమ్మడి జిల్లాలో పార్టీ అభ్యర్ధుల విషయంలో పలు రకాల పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఉదయం ఒకాయన పలానా టికెట్టు తనకే అంటూ చెప్పితే, సాయంత్రానికి కాదు, కాదు నాకే టిక్కెట్టు అని మరొకరు  అంటున్నారు. కొందరు అధినాయకుడు తమకు ఇప్పుడే ఫోన్ చేశారని అనుచరులకు చెపుతున్నారు. వారు క్షణంలో ఆవిషయం అందరి చెవిన వేస్తున్నారు. కొందరు ఏకంగా వాట్స్ అప్ గ్రూపుల్లో సైతం పెట్టేస్తున్నారు.  వైసిపి దాదాపుగా అన్ని స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. అయితే నగరిలో రోజాకు టికెట్టు రాదని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యం మధుసూధన్ రెడ్డిని కాదని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం కు ఇస్తారన్న ప్రచారం చక్కర్లు కొడుతున్నది. ఇక టిడిపి, జనసేన, బిజెపి పొత్తుల వల్ల రోజుకు ఒక పేరు వినిపిస్తోంది. తిరుపతి స్థానం జనసేనకు కేటాయించారు. అయితే ఇంతవరకు అభ్యర్థి తేలలేదు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేరు ప్రముఖంగా వినిపించింది .అలాగే గంటా నరహరి పేరు తెరపైకి వచ్చింది. ఊకా విజయకుమార్ తనకే టికెట్టు అంటూ ప్రచారం చేశారు. టిడిపి ఇంచార్జి సుగుణమ్మ కూడా జనసేన టికెట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 


అయితే మంగళవారం తిరుపతి స్థానం బిజెపికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. మొదట శ్రీకాళహస్తి స్థానం బిజెపి అభ్యర్థి కోలా ఆనంద్ కు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు, బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మకు ఫోన్ చేసి ఆమె కొడుకుకే టికెట్టు ఇస్తామని చెప్పారని కొందరు ప్రచారం మొదలు పెట్టారు. దీనితో బిజెపికి  తిరుపతి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. పుంగనూరు స్థానం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా రామచంద్ర యాదవ్ పొట్టి చేస్తారని తొలి నుంచి అంటున్నారు. లేదు, లేదు తనకే టికెట్టు ఖాయం అయ్యిందని టిడిపి ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి చెప్పుకుంటున్నారు. కాగా అనీషా రెడ్డికి చాన్సు ఉందని ఒక వర్గం చెపుతోంది. మదనపల్లి టికెట్టు టిడిపి ఇంచార్జి దొమ్మల పాటి రమేష్ కే అని ఒక వర్గం చెపుతుండగా మరొక వర్గం మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషాకే అంటున్నారు. బిజెపి అభ్యర్థిగా చల్లపల్లి నరసింహా రెడ్డికి అవకాశం ఉంటుందని కొందరు అంటున్నారు. 


చంద్రగిరి టిడిపి టికెట్టు పారిశ్రామిక వేత్త డాలర్ దివాకర్ రెడ్డికి ఖాయం అయ్యిందని మొన్నటి వరకు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన తాను పోటీ చేయడం లేదని చేతులు ఎత్తేశారు. గల్లా అరుణ కుమారి బిసి నేత బడి సుధా యాదవ్ కు టికెట్టు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. పులివర్తి నాని తనకే టికెట్టు ఇస్తారని, తనకు కాదంటే తన భార్య సుధారెడ్డికి ఇస్తారని బల్లగుద్ది చెపుతున్నారు. ఈ స్థానం కోసం ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందని కొందరు అంటున్నారు. రాజంపేట ఎంపి స్థానం బిజెపికి ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇక్కడి నుంచి మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని బలంగా వినిపించింది. మంగళవారం ఉదయం నుంచి బిజెపికి తిరుపతి లోక్ సభ స్థానం ఇస్తున్నందున రాజంపేట నుంచి టిడిపి అభ్యర్ధి బాలసుబ్రమణ్యం పోటీ చేస్తారని టిడిపి కీలక నేత ఒకరు తెలిపారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *