పొత్తుకు పీఠముడిగా అన్నదమ్ముల విభేదాలు ?
బీజేపీ అభ్యర్థిగా మాజీ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంటుకు పోటీ కొత్త సమస్యను తెచ్చి పెట్టింది. ఆయనను రాజంపేట లోక్ సభకు పోటీ పెట్టాలని బిజెపి నేతలు నిర్ణయించుకున్నారు. పొత్తులో భాగంగా ఆ స్థానం అడుగుతున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఎటువంటి పరిస్థితిలోనూ రాజంపేట బీజేపీకి ఇవ్వకూడదని గట్టిగా పట్టుపడుతున్నట్లు తెలిసింది. చంద్రబాబు కూడా కిషోర్ కుమార్ మాటకే విలువ ఇస్తున్నట్లు సమాచారం. రాయలసీమ జిల్లాల్లో ముస్లింలు ఎక్కువ. పీలేరు నియోజకవర్గంలో కూడా గణనీయంగా ఉన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ముస్లింలు టీడీపీకి వ్యతిరేకం అవుతారని కిషోర్ ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. రాజంపేట పార్లమెంట్ పరిధిలో టీడీపీ గెలవాలంటే, పార్లమెంటు స్థానాన్ని, అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించవద్దని కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబును కోరినట్లు సమాచారం. అయితే, రాజంపేట ఇవ్వకుంటే, పొత్తు ఎందుకు అని బీజేపీ నేతలు ప్రశ్నింస్తున్నారు. అన్నదమ్ముల విభేదాలు టీడీపీ, బీజేపీ పొత్తుకే ఇబ్బందిగా మారింది.
కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి అమరనాథ రెడ్డి 1987లో మృతి చెందారు. 1988లో వాయల్పాడు ఉప ఎన్నికల్లో తల్లి నల్లారి సరోజమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు.1989 సాధారణ ఎన్నికల్లో కిరణ్ పోటీ చేసి గెలిచాడు. 1994 లో భారీ తేడాతో ఓటమి చవిచూశారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశాడు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. గత ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎన్నికై వైఎస్ఆర్‌కు నోట్లో నాలుకలా మెలిగారు. ప్రధానంగా అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య కుడి భుజమైతే కిరణ్ కుమార్ రెడ్డి ఎడం భుజంగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి మృతి తరువాత రోశయ్య ఆయన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో పీలేరు నియోజక వర్గాలన్ని చాలా అభివృద్ది చేశారు.
గత ఏడాది బిజెపిలో చేరి ఆ పార్టీ జాతీయ కార్య వర్గ సభ్యునిగా ఉన్నారు. రాజంపేట లోక్ సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలలో మంచి పేరు, పట్టు ఉంది. ఆయన తొలినుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యతిరేకి. ఈ నేపథ్యంలో ఆయన అయితే వైసిపి అభ్యర్ధి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎదుర్కుంటారని అధిష్టానం భావించింది. అయితే వ్యూహ నిపుణుడు అయిన కిరణ్ తాను పోటీ చేయాలి అంటే కొన్ని నియోజక వర్గాలలో టిడిపి అభ్యర్థులను మార్చాలని కండీషన్ పెట్టినట్టు తెలిసింది. ముఖ్యంగా తంబళ్లపల్లె టిడిపి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రా రెడ్డి బదులు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్టు ఇవ్వాలని సూచించారని తెలిసింది. అలాగే మదనపల్లి టికెట్టు రాటకొండ బాబు రెడ్డి (కమ్మ) కి ఇవ్వాలని కోరుతున్నారని సమాచారం. బాబు రెడ్డి మాజీ ఎమ్మెల్యే రతకొండ శోభ భర్త. అలాగే మరో మాజీ ఎమ్మెల్యే సాగర్ రెడ్డి సోదరుడు. పీలేరులో ఆయన తమ్ముడు, టిడిపి జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అందరూ కలసి గట్టిగా పనిచేస్తేనే గెలుపు సాధ్యం అంటున్నారు. తన సూచనలు పాటిస్తేనే తాను పోటీ చేశానని చెప్పడంతో టిడిపి ఆలోచనలో పడింది.
కిరణ్ కుమార్ రెడ్డి మాట కాదంటే పొత్తుకు బ్రేక్ పడే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా రాజంపేట బిజెపికి ఇస్తే ముస్లింలు అధికంగా ఉన్న పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లె, రాయచోటిలో నష్టపోతామని కొందరు అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పేరు ఉన్నందున ముస్లింలు కూడా ఓట్లు ఓట్లు వేస్తారని ఒక వర్గం భావిస్తోంది. ఏది ఏమైనా కిరణ్ పోటీ వ్యవహారం సంక్లిష్టంగా మారింది. ఇది అన్నా తమ్ముళ్ల మధ్య చిచ్చురేపుతోంది. ఇద్దరి మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్నాయని తెలిసింది.
టీడీపీ, బీజేపీ పొత్తు కారణంగా ఈ విభేదాలు మరింత ఎక్కువ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజంపేట బీజేపీకి ఇస్తే, గెలుపు కష్టమని కిషోర్ అభిప్రాయం. రాజంపేట పార్లమెంటు ఇవ్వకుంటే, పొత్తు అవసరం లేదని బీజేపీ భావన. అన్నదమ్ములు వ్యవహార శైలి పట్ల టీడీపీ, బీజేపీ నాయకలు సతమతం అవుతున్నారు. అన్నదమ్ములలో ఎవరి పంతం నెగ్గుతుందో వేచి చూడాలి.

