10, మార్చి 2024, ఆదివారం

తిరుపతి టీడీపీలో అసమ్మతి జ్వాలలు !


తిరుపతి అసెంబ్లీ టిక్కెట్టును తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఆగ్రహ, ఆవేశాలతో ఊగిపోతున్నారు. పార్టీ నాయకత్వం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో అన్న నందమూరి తారకరామారావు పోటీ చేసి విజయకేతనం ఎగురవేసిన తిరుపతిని జనసేనకు కేటాయించడం పట్ల బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాత సైకిల్ గుర్తులేకుండా ఎన్నికలు జరగడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. జనసేనలో స్థానికంగా సమర్ధుడైన నేత లేక చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లిని తిరుపతి జనసేన అభ్యర్థిగా నిర్ణయించడం స్థానిక జనసేన నేతలకు సైతం మింగుడుపడటం లేదు. ఇప్పటికే సుగుణమ్మ భవిష్యత్తు వ్యూహం గురించి ఆలోచనలో పడ్డారు. నరసింహ యాదవ్ అలకపాన్పు ఎక్కారు. మిగిలిన ఆశావహులు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడంలో నిమగ్నమయ్యారు. జనసేనకు సహకరించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు సహాయ నిరాకరణకు సిద్ధం అయ్యారు.


తిరుపతి టిడిపిలో తిరుగుబాటు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పార్టీని నమ్ముకున్న వారిని కాదని జనసేనకు టికెట్టు కేటాయించడం జీర్నించుకోలేక పోతున్నారు. స్థానిక బలిజ, యాదవ, బిసి, రెడ్డి సామాజిక వర్గం టిడిపి నేతల్లో అధిక శాతం చంద్రబాబు నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. 2009 లో చిరంజీవి గెలిచారని, బలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయన్న  కారణంతో జనసేనకు కేటాయించడం తప్పంతున్నారు. కేవలం బలిజ ఓట్లు నమ్ముకుని రాజకీయం చేస్తే మేము ఎందుకు ఓట్లు వేయాలని యాదవ, ఇతర బిసి నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తూ రెడ్లకు ద్రోహం చేస్తున్నారని ఒక నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆ రెడ్డి నేత చెప్పారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలిసింది. 

1983 ఎన్టీఆర్ తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తిరుపతికి ఈశాన్య దిశలో ఉన్న తిమ్మి నాయుడు పాల్యం దళితవాడలో సహ బంక్తి భోజనం చేశారు. అప్పటి నుంచి ప్రతిసారి తిరుపతి నుంచే ఎన్నికల సమర శంఖం పూరిస్తున్నారు. గుడివాడ నియోజక వర్గంతో పాటు తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచారు. తిరుపతి స్థానానికి రాజీనామా చేశారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కత్తుల శ్యామల గెలిచారు.1985, 1989 లో కాంగ్రెస్ అభ్యర్ధి మబ్బు రామిరెడ్డి విజయం సాధించారు. 1994లో టిడిపి అభ్యర్థి ఎ మోహన్ 1999 లో అదే పార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి విజయం సాధించారు. 2004 లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం వెంకటరమణ గెలిచారు. 2009 లో జరిగిన ముక్కోణపు పోటీలో ప్రజా రాజ్యం అధినేత చిరంజీవి గెలిచారు. ఆయన రాజీనామా చేయడంతో 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి గెలుపు సాధించారు. 

2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఎం వెంకటరమణ విజేతగా నిలిచారు. ఆయన మరణంతో 2015 లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య ఎం సుగుణమ్మ ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో వైసిపి పోటీ చేయలేదు.  2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి వైసిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయన నగరంలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయమని ప్రజలను కోరుతున్నారు. 

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మీనమేశాలు లెక్క పెట్టి ఆఖరికి జనసేన పార్టీకి కేటాయించారు. దీనితో టిడిపి కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. భర్తను పోగొట్టుకున్న సుగుణమ్మ 72 ఏళ్ళ వయసులో కూడా పార్టీ కోసం కష్ట పడుతున్నారని అంటున్నారు. అలాంటి వ్యక్తికి ద్రోహం చేసి పక్కన పెట్టడం తప్పని అధిక శాతం మంది విమర్శిస్తున్నారు. 2009లో చిరంజీవి గెలిచారు అన్న కారణంతో జన సేనకు టికెట్టు ఇవ్వడం తప్పని అంటున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి, టిడిపి అభ్యర్థిగా కె శంకర్ రెడ్డి పోటీ పడటం వల్ల రెడ్ల ఓట్లు చీలిపోయి చిరంజీవి 15,930 మెజారిటీతో
గెలిచారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి చదలవాడ కృష్ణమూర్తికి కేవలం 12,315 ఓట్లు వచ్చాయి. తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు చైర్మన్ గా చేసిన చదలవాడ లాంటి వ్యక్తికే డిపాజిట్లు కూడా రాలేదని అంటున్నారు. పైగా చిరంజీవి రాజీనామా చేసి తనను గెలిపించిన తిరుపతి ప్రజలకు ద్రోహం చేసారని అంటున్నారు. 

ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానంతో తాము సైకిల్ గుర్తుకు ఓట్లు వేశామని, ఇప్పుడు గ్లాస్ గుర్తుకు ఓట్లు వేయడానికి సిద్దంగా లేమని పలువురు యాదవ సామాజిక వర్గం నేతలు అంటున్నారు. ఇతర బిసి సామాజిక వర్గం ఓటర్లు కూడా జనసేనకు ఓట్లు వేయడానికి విముఖత చూపు తున్నారు. జనసేన పార్టీ కులతత్వంతో టికెట్టు ఇస్తే తాము ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నిస్తున్నారు. టిడిపి ఆవిర్భావం తరువాత తొమ్మిది సార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో టిడిపి నాలుగు సార్లు, కాంగ్రెస్ మూడు సార్లు పిఆర్పీ, వైసిపి ఒక్కో సారి గెలిచారు. మూడు సార్లు జరిగిన ఊప ఎన్నికల్లో టిడిపి రెండు సార్లు వైసిపి ఒక సారి విజయం సాధించాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *