15, మార్చి 2024, శుక్రవారం

కూటమిలో బీసి నేతలకు మొండి చేయి


రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి పార్టీలు బీసీ నాయకులకు మొండి చేయి చూపాయి. టికెట్ల కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన బీసీ నేతలకు నిరాశే మిగిలింది. తొలినుండి టిక్కెట్ల ఆశతో బీసీ నాయకుల చేత ఊడిగం చేయించుకున్న పార్టీలు చివరకు చేతులెత్తేశాయి. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక్క నియోజకవర్గంలో కూడా బీసీలకు టికెట్ కేటాయించలేదు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీకి ఎక్కడ బీసీ నాయకులు కనిపించలేదు. సామాజిక న్యాయమే అజెండాగా ఆవిర్భవించిన జనసేన పార్టీ జిల్లాలో బలిజ సేనగా మారింది. బీసీ అభ్యర్థిని ప్రధానమంత్రి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ జిల్లాలో బీసీ నాయకులకు న్యాయం చేయడంలో విఫలమయ్యింది.


చిత్తూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా తనను తాను ప్రచారం చేసుకున్న తిరుచానూరు మాజీ సర్పంచ్ సీఆర్ రాజన్ కు తీవ్ర   నిరాశే మిగిలింది. వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఆయన మూడు నెలల కిందట తెలుగుదేశం పార్టీలో చేరారు. చిత్తూరు అసెంబ్లీ టికెట్టును తనకు కేటాయించారని ఆయన ప్రచారం చేసుకున్నారు. ఈ మేరకు చిత్తూరులో ఇంటిని కూడా కొనుగోలు చేసి, నివాసాన్ని మార్చారు. చిత్తూరులో భారీ ఎత్తున బీసీ సదస్సును నిర్వహించారు. కుప్పంలో కూడా బీసీ సదస్సును ఏర్పాటు చేశారు. చివరకు  చిత్తూరు టికెట్లను కమ్మ సామాజిక వర్గానికి చెందిన గురుజాల జగన్మోహన్ నాయుడుకు కేటాయించారు.

తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు, తుడా మాజీ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ తిరుపతి అసెంబ్లీ టికెట్టును ఆశించారు. ఆయన పార్లమెంటు నియోజకవర్గం అంతా విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేశారు. తిరుపతిలో ప్రతిరోజు ఏదో రకంగా మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు. అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ పటిష్టతకు చేస్తున్నారు. ఆయనను కాదని జనసేనకు తిరుపతి పార్లమెంట్ అసెంబ్లీ టికెట్ ను కేటాయించారు. జనసేన బలిజ సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులకు తిరుపతి టికెట్ ని కేటాయించింది.


నగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అశోక్ రాజు టికెట్ ని ఆశించారు. ఆయన టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు చేశారు. చివరకు పార్టీ టికెట్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన గాలి భాను ప్రకాష్ కేటాయించడంతో ఆయన అసంతృప్తితో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బిజెపిలో చేరి నగిరి టికెట్టు కోసం ప్రయత్నం చేసినా, ఫలితం లేకపోయింది.



శ్రీకాళహస్తికి చెందిన తెలుగుదేశం పార్టీ బీసీ నేత గురువారెడ్డి కూడా ఈ పర్యాయం టికెట్టు నశించారు ఆయన 30 సంవత్సరాల కి పైగా తెలుగుదేశం పార్టీలో అంకిత భావం కలిగిన నాయకుడిగా పని చేస్తున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీనీ పటిష్టం చేశారు. వన్నెకుల సామాజిక కులానికి చెందిన ఆయన సేవలను దృష్టిలో పెట్టుకొని తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డికి తిరిగి పార్టీ టికెట్ ని కేటాయించింది.



చంద్రగిరి నియోజకవర్గం నుంచి యాదవ కులానికి చెందిన బడి సుధాయాదవ్ టిక్కెట్ ను ఆశించారు. ఆయన నియోజకవర్గంలో  పర్యటిస్తూ మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి ఆశీస్సులతో టిక్కెట్టు కోసం ప్రయత్నించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ బీసీలు నందున బీసీలకు టికెట్లు కేటాయించాలని కోరినా, గత ఎన్నికల్లో పోటీ చేసిన పులివర్తి నానికి టికెట్ కేటాయించారు.



తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు కూడా ఈ పర్యాయం మదనపల్లి టికెట్ నాశించారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి విస్తృతంగా పర్యటించారు. మదనపల్లి నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని కూడగట్టుకున్నారు. పద్మశాలి తొగట కులానికి చెందిన శ్రీరామ్ చిన్నబాబు టికెట్ ని ఆశించినా, నిరాశే మిగిలింది. సాధారణంగా ప్రతి పార్టీలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు ఆనవాయితీని కూడా తంగలో తోక్కారు.


తంబళ్ళపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మరో మారు టికెట్టును ఆశించారు. ఆయన 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందా.రు తిరిగి 2019 ఎన్నికలలో ద్వారకనాథరెడ్డి చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉంటూ తరచుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర విజయవంతనికి రెండు కోట్ల రూపాయలకు పైగావ్యయంచేశారు. అయితే అంగళ్లలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద జరిగిన రాళ్ల దాడి సంఘటనలో శంకర యాదవ్ వ్యవహార శైలి పట్ల అసంతృప్తి చెందిన చంద్రబాబు నాయుడు ఆయనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జయచంద్రారెడ్డికి టిక్కెట్లు ఇచ్చారు.


భారతీయ జనతా పార్టీ తరపున మదనపల్లి నుండి బిసి నేత సేతు నల్లు స్వామి టికెట్ ఆశించారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బాజాపాలో చేరిన నగిరి నియోజకవర్గ బీసీ నేత అశోక్ రాజు కూడా టికెట్ బరిలో నిలిచారు. అయితే ఊహించని విధంగా జిల్లాలో బిజెపికి తెలుగుదేశం పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కేటాయించలేదు. దీంతో బిజెపికి చెందిన బీసీ నాయకులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *