8, మార్చి 2024, శుక్రవారం

రాజకీయం మాయ! టిక్కెట్టు మిధ్య !!


ఎన్నికల్లో పార్టీ టికెట్ వస్తుందని పార్టీ నాయకుల అడుగులకు మడుగులోత్తారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నేత నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు, పార్లమెంట్ పరిశీలకులు రాంగోపాల్ రెడ్డి తదితరులకు ఊడిగం చేశారు. వారు నియోజకవర్గానికి వస్తే కటౌట్లు, బ్యానర్లు, స్వాగత తోరణాలు కట్టారు.సభలు, సమావేశాలు అంటే, డబ్బులు ఇచ్చి జనాలను తోలారు .వారికి బిరియాని పొట్లాలు ఇచ్చారు. తమ బలం నిరూపించుకోవడానికి బల ప్రదర్శన చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టయి జైల్లో ఉంటే ఆయన అరెస్ట్ అన్యాయమని 53 రోజులపాటు దీక్షలు చేశారు. నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. అధినేత బాదుడే బాదుడు అంటే నియోజకవర్గంలో కూడా గల్లీలో కూడా కార్యక్రమాన్ని చేశారు. అధినేత ఇదేం కర్మ అంటే పల్లె పల్లె తిరిగారు. అధినేత రా కదలిరా అంటే లారీలు, బస్సులతో జనాలని తరలించారు. యువ నేత యువగళం అంటే, జనాన్ని పోగు చేసుకుని పాదయాత్ర చేశారు. వారికి ఉండడానికి వసతి కల్పించారు. భోజనం ఏర్పాటు చేశారు. భువనేశ్వరి న్యాయం గెలవాలి అంటే తమకే అన్యాయం జరిగినట్టు పరుగులు తీశారు. నియోజకవర్గంలో  ఏ నాయకునికి కష్టమొచ్చిన ఓదార్చారు. ఆర్థిక సహాయం చేశారు. పెళ్లిళ్లు, చావులు, తద్దినాలకు జనాన్ని వెంటేసుకుని తిరిగారు. పండుగలు, ఉత్సవాలకు చందాలు ఇచ్చారు. అనుచరుల ఆలనాపాలనా చూశారు. ఇంటిని పట్టించుకోకపోయినా ప్రజాసేవలో తరించారు. నియోజకవర్గమే దేవాలయం అన్నారు. ఓటరే దేవుడన్నారు. ఎవరికీ అన్యాయం జరిగినా పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పొలిసు స్టేషన్ల చుట్టూ తిరిగారు. ప్రత్యర్థులను అమ్మనా భూతులు తిట్టారు. వారు తిడితే పడ్డారు. పొలీసు కేసులు పెట్టించుకున్నారు. జైళ్లకు వెళ్లారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 

కనీసం అనుకున్న,, ఒక్కొక్క నియోజకవర్గ ఇన్చార్జి నెలకు పది లక్షల రూపాయలను వ్యయం చేశారు. ఇక సభలు, సమావేశాలు అయితే అయితే ఖర్చు ఎక్కడికో పోతుంది. దీనికి తోడు సర్వే బృందాలను తృప్తి పరచడం, విలేకరులు వార్తలు బాగా రావాలని వారికీ నజరానాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు ఎన్నో కష్టాలు. ఎన్నో ప్రయాసలు. డబ్బు లేకుండా అప్పోచాప్పో చేసి ఆడంబరాలు. టిక్కెట్ తనకే వస్తుందని ధీమా. ఎమ్మెల్యేగా చక్రం తిప్పవచ్చాన్న  భరోసా. నియోజకవర్గంలో తిరుగులేని రాజుగా చలామణి అవుతాం అన్న ఆశ. కాలం కలిసి వస్తే మంత్రి అవుతామన్న ఆకాంక్ష. ఇలా ఊహల ఊయలలో ఊరేగిన నియోజకవర్గ ఇన్చార్జిలకు, నాయకులకు క్రమంగా రాజకీయం అంటే ఏమిటో బోధపడుతోంది. పొత్తులో  భాగంగా కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. పనితీరు బాగాలేదని అందరికీ ఉద్వాసన చెప్పారు. ఇంకొందరిని సర్వేలో బాగా రాలేదంటూ పక్కన పెట్టారు. కుల సమీకరణాలు అంటూ కొందరిని, డబ్బులేదని ఇంకొందరిని, గెలిసే సత్తా లేదని కొందరిని పక్కకు నెట్టారు. 


ఇలా అధినేత ఇష్టానుసారంగా టిక్కెట్లు కేటాయింపు జరుగుతుంటే గుండె చదిరిపోతోంది. పడిన కష్టం, చేసిన అప్పులు గుర్తుకు వస్తున్నాయి. రాజకీయమంటే వ్యసనమని, ఇది ఒక మాయా ప్రపంచమని, వైకుంటపాళీ అని అక్రమంగా అర్థమవుతుంది. అధినేత రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పిలిచి సింపుల్ గా నో చెబుతుంటే అదఃపాతాళంలోకి కృంగిపోతున్న అనుభూతి. అంతా చేజారాక ఏమీ చేయలేనని నిస్సహాయత. కనీసం పార్టీ వస్తే ఏం చేస్తారో కూడా లభించని భరోసా. వెరసి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా అన్న నిరాశ నిస్సృహాలు. జిల్లాలో తెలుగుదేశం పార్టీలోనే కాదు, వైసీపీలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అవకాశం ఉన్నవాళ్లు పార్టీలు మారుతున్నారు. అవకాశము లేని వాళ్ళు అన్ని వదిలి సర్వ సంఘపరిత్యాగి వలె ఇంటికే పరిమితమవుతున్నారు.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు టిడిపి నేతలు ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతు ఉన్నారు. అంతా భ్రాంతి యేనా.. జీవితాన వెలుగింతీనా .. మిగిలేది చింతేనా.. అన్న దేవదాసు గీతం పాడుకుంటున్నారు. పగవారికి కూడా ఈ పరిస్తితి రాకూడదని కొందరు అవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఇల్లు వాకిలి వదిలి, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పార్టీకి సేవలు చేసినా నేతలకు టికెట్లు రాలేదు. డబ్బున్న మారాజులకు టికెట్లు ఇస్తున్నారు. తిరుపతి ఇంచార్జి సుగుణమ్మ తన భర్త చనిపోయిన తరువాత 2015 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లో కేవలం 708 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 72 సంవత్సరాల వయసులో కూడా పార్టీ కోసం కష్ట పడి పనిచేస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా ఆమెకు టికెట్టు ఇవ్వలేనని చంద్రబాబు చేతులు ఎత్తేశారు. దీనితో ఆమె తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. 


అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు చేస్తున్న పార్లమెంటు అధ్యక్షుడు జి నరసింహ యాదవ్ కు మొండి చేయి  ఎదురైంది. టికెట్లు ఆశించి భంగపడిన వారిలో ఊకా విజయ కుమార్, కోడూరు బాలసుబ్రమణ్యం, జె బి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సత్యవేడు నియోజక వర్గంలో పరిస్తితి అలాగే ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జె డి రాజశేఖర్ ను తొలగించి హెలెన్ ను ఇంచార్జిగా నియమించారు. ఇప్పుడు ఆ యిద్దరిని కాదని ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆదిమూలం పేరు పరిశీలిస్తున్నారు. శ్రీకాళహస్తి ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి, ఆయన  తల్లి బృందమ్మ, భార్య రిషితా రెడ్డి ఇల్లిల్లూ తిరుగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇటీవల పార్టీలో చేరి టికెట్టు ఆశిస్తున్నారు. అయితే వీరిని కాదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్ టికెట్టు తన్నుకు పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జి డి నెల్లూరు నియోజక వర్గంలో సంవత్సరాల తరబడి పార్టీకి సేవలు సేసిన రాజేంద్ర, గ్యాస్ రవి, రెడ్డప్ప తదితరులను కాదని కొత్తగా వచ్చిన డాక్టర్ థామస్ కు డబ్బు ఉందని టికెట్టు ఇచ్చారు. దీనితో పార్టీని నమ్ముకుని ఉన్న వారికి నిరాశ ఎదురైంది. చిత్తూరులో కాజూరు బాలాజీ, కటారి హేమలత, సికే బాబు, సి ఆర్ రాజన్, చంద్రప్రకాష్ లను కాదని గురజాల జగన్ మోహన్ నాయుడు డబ్బు చూసి టికెట్టు ఇచ్చారు. పుంగనూరు ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి టికెట్టు ఇంకా తేల్చలేదు. ఆయనకు ముందు ఇంచార్జిగా ఉన్న అనీషా రెడ్డినీ ఎన్నికలలో పోటి చేపించి, అయ్యాక మూలకు నెట్టారు. కొత్త ఇంచార్జిని పెట్టారు. అ ఇంచార్జి పోలీసులతో గొడవపడి కేసులు పెట్టించుకొని, అజ్ఞాతంలో ఉండి, జైలుకు వెళ్ళివచ్చినా, టిక్కెట్టు బరోసా లేదు.


తంబళ్లపల్లె ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ను పక్కన పెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన జయచంద్రా రెడ్డికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు కోట్లు ఖర్చు పెట్టిన యాదవ్ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. మదనపల్లె ఇంచార్జి దొమ్మ లపాటి రమేష్ పూర్తి నిరాశలో ఉన్నారు. ఇక్కడ కొత్తగా పార్టీలో చేసిన షాజహాన్ బాషా కు టికెట్టు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి ఇంచార్జి పులివర్తి నానీకి టికెట్టు వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితులు తలెత్తాయి. నాని, నాని భార్య సుధారెడ్డి, కుమారుడు కూడా రాత్రి, పగలు పార్టీకి సేవలు చేస్తున్నారు. అందరూ భయపడే సమయంలో వైసిపి అగ్ర నాయకులపై నిప్పులు చెరిగిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పరిస్తితి అగమ్య గోచరంగా ఉంది. ఆయన తన కుమారుడు ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డికి టికెట్టు వస్తుందన్న నమ్మకంతో ఐఐటి ఉద్యోగానికి రాజీనామా చేయించారు. ఆయన చంద్రగిరి టికెట్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా జిల్లాలో ఎన్నో వేదనలు, మరెన్నో ఆవేదనలు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *