జనసేనానిని కలిసిన జంగాలపల్లి
అధికార పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ఆదివారం హైదరాబాదులో జనసేన ని పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ జంగాలపల్లి శ్రీనివాసులు సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంచి ముహూర్తం చూసుకొని రెండు, మూడు రోజుల్లో జనసేన పార్టీలో చేరనున్నట్లు జంగాలపల్లి శ్రీనివాసులు తెలిపారు.
అధికార వైసీపీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులు జిల్లాలో చేజారినట్లు అయింది. సత్య వేడు శాసనసభ్యుడు ఆదిమూలం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. పూతలపట్టు శాసనసభ్యుడు ఎమ్మెస్ బాబు అధిష్టానం మీద తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. వైసిపి పార్టీ దళితుల వ్యతిరేక పార్టీ అంటూ ఆరోపణలు చేశారు. జిల్లాలో రెడ్లు చెప్పినట్టుగానే నడుచుకున్నానని, అయినా వ్యతిరేకత ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు జంగాలపల్లి శ్రీనివాసులు జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు.
శ్రీనివాసులను తొలుత చిత్తూరు శాసనసభ అభ్యర్థిగా మంత్రుల బృందం ప్రకటించింది. చిత్తూరు టికెట్ తనకే ఖరారు అని అనుకున్న దశలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విజయానంద రెడ్డికి టికెట్టు ఖరారు చేశారు. రాజ్యసభ టికెట్ ఇస్తానని జంగాలపల్లిని మభ్యపెట్టి, ఆ సీటును వేరే వారికి ఇచ్చారు. దీంతో అలక చెందిన జంగాలపల్లి శ్రీనివాసులు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటు వైసిపి లో కొనసాగడం మంచిది కాదని భావించారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది. దీంతో జంగాలపల్లి శ్రీనివాసులు జనసేనలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. వెంటనే హైదరాబాద్ వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయన కూడా సాధారంగా పార్టీలోకి ఆహ్వానించడంతో, రెండు మూడు రోజుల్లో జంగాలపల్లి శ్రీనివాసులు జనసేన కండువాను కప్పుకోనున్నారు.