సత్యవేడులో టీడీపీ రెబల్ అభ్యర్థి తప్పదా ?
గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత జేడి రాజశేఖర్ రెండేళ్ల పాటు ఇంచార్జిగా ఉన్నారు. తరువాత ఆయన స్థానంలో మాజీ ఎమ్మేల్యే హేమలత కుమార్తె హెలెన్ ను ఇంచార్జిగా నియమించారు. అప్పట్లో ఈ అంశం చాలా వివాదం అయ్యింది. హెలెన్ వద్ద భారీగా నిధులు తీసుకుని రాజశేఖర్ కు అన్యాయం చేశారని ఆరోపణలు వినిపించాయి. ఆమె చాలా ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ ఇద్దరు నేతలను కాదని వైసిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు టికెట్టు ఇచ్చారు.దీనితో నియోజక వర్గంలో పలువురు కార్యకర్తలు నిరసనలు తెలియజేశారు. వైసిపి ఎమ్మెల్యేగా తమ మీద తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు తమను వేధించిన వ్యక్తికి ఇప్పుడు ఓట్లు వేయడం అంటే కొట్టిన వాడి కాళ్ళు పట్టుకున్నట్టు ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిని పోటీ పెట్టి టిడిపి అధిష్టాన వర్గానికి బుద్ది చెప్పాలని భావిస్తున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి సత్యవేడు టిడిపికి పెట్టని కోట మాదిరిగా ఉంది.
నియోజక వర్గాల పునర్నిర్మాణం తరువాత 2009 లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి హేమలత కాంగ్రెస్ అభ్యర్థి కె నారాయణ స్వామిపై 9,691 ఓట్ల మెజారిటీ సాధించారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి తలారి ఆదిత్య వైసిపి అభ్యర్థి కోనేటి ఆదిమూలంపై 4,227 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి ఆదిమూలం టిడిపి అభ్యర్ధి జేడీ రాజశేఖర్ పై 44,744 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో జగన్ మోహన్ రెడ్డి ఆయనను తిరుపతి ఎంపిగా పోటీ చేయమన్నారు. దీనికి ససేమిరా అన్న ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పై విమర్శలు చేశారు. దీనితో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. తమ పార్టీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్ ను ప్రకటించారు.ఈ దశలో చంద్రబాబు ఆయనను చేరదీసి టికెట్టు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో వ్యతిరేకత తలెత్తింది.