తిరుపతి ఉమ్మడి అభ్యర్థిగా జంగాలపల్లి ?
టిడిపి, జనసేన తిరుపతి ఉమ్మడి అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర తెదేపా కార్యాలయం నుండి తిరుపతిలోని కొందరు టిడిపి నేతలకు ఫోన్ చేసి, ఉమ్మడి అభ్యర్థిగా జంగాలపల్లి అయితే ఎలా ఉంటుంది అని అరా తీశారు. టిడిపి నాయకులు తిరుపతి నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుందని సూచించినట్లు సమాచారం. లేకుంటే, టిడిపి అభ్యర్థి సుగుణమ్మకు టిక్కెట్టు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. వేరే వాళ్ళకు ఇస్తే, సీటు పోగొట్టుకోవాల్చివస్తుందని వివరించినట్లు తెలిసింది.
చిత్తూరు వైసిపి టికెట్టు జంగాలపల్లి శ్రీనివాసులుకు కాదని విజయానంద రెడ్డికి ఇచ్చారు. దీనితో మనస్తాపం చెందిన ఆయన ఆదివారం హైదరాబాదులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిశారు.దీంతో ఆయనకు తిరుపతి టికెట్టు ఇవ్వడానికి పవన్ సుముఖత వ్యక్తం చేశారని అంటున్నారు. తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ కూడా ఆయనకు మద్దతు తెలిపారు. అలాగే భారీ మొత్తంలో పార్టీ నిధులు సమకూర్చడానికి శ్రీనివాసులు సుముఖత వ్యక్తం చేశారని తెలిసింది. తొలుత చిత్తూరు ఎమ్మెల్యే బదులు రాజ్య సభ టికెట్టు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఆ పదవి దక్కలేదు. అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటు వైసిపి లో కొనసాగడం మంచిది కాదని భావించారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది. దీంతో జంగాలపల్లి శ్రీనివాసులు జనసేనలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. వెంటనే హైదరాబాద్ వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయన కూడా సాధారంగా పార్టీలోకి ఆహ్వానించడంతో, రెండు మూడు రోజుల్లో జంగాలపల్లి శ్రీనివాసులు జనసేన కండువాను కప్పుకోనున్నారు. కాగా శ్రీనివాసులు వైసిపి పార్టీ నుంచి జగన్ బహిష్కరించారు.
పవన్ కళ్యాణ్ పోటీపై ఐవిఆర్ఎస్ సర్వే
తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే. ఓటు వేస్తారా అంటూ సోమవారం పలువురికి ఐ వి ఆర్ ఎస్ సర్వే వచ్చింది. ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నచ్చితే ఒకటి వైసిపి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి నచ్చితే రెండు నొక్కండి అంటూ మెసేజ్ వచ్చింది. దీనితో నగరంలో పవన్ పోటీ చేస్తారన్న చర్చ సాగుతోంది. 2019 లో ఆయన భీమవరం, గాజువాక రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి కూడా ఆ రెండింటిలో ఒక చోట పోటీ చేయాలని అనుకున్నారు. అందులో భీమవరం అయితే మంచిదని భావించారు. అయితే అక్కడ ఎస్సీలు, శెట్టి బలిజ సామాజికవర్గం ( బిసి) ఓటర్లు ఎక్కువగా ఉన్నందున గెలుపు కష్టం అని అనుమానిస్తున్నారు. తిరుపతి అయితే తప్పకుండా విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
రెడ్డి సామాజికవర్గం ఆశాభావం !
తిరుపతి టిడిపి టికెట్టు కోసం రెడ్డి నేతల పేర్లు పరిశీలనలోకి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి టికెట్టు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా అనంద్ కు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ఆనంద్ పేరు సూచించారని అంటున్నారు. అక్కడ బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆనంద్ కు టికెట్టు ఇస్తే తిరుపతి స్థానం రెడ్డికి కేటాయిస్తే మంచిదని చంద్రబాబు భావిస్తున్నారు. రెడ్డి అయితేనే ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, నగర డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డిని ఎదుర్కోవడం సాధ్యమని కొందరు అంటున్నారు.
ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందున ఆ వర్గానికే టికెట్టు కేటాయిస్తున్నారు. అయితే శ్రీకాళహస్తితో పాటు తిరుపతి ఆ వర్గానికి ఇవ్వడం కుదరదని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న నలుగురు రెడ్ల పేర్లు పరిశీలనలోకి వచ్చినట్టు తెలిసింది. ఇందులో రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆయనకు విద్యార్థి దశ నుంచి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. తిరుపతి నాయకునిగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి, ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర గ్రంధాలయ సంస్థ సభ్యులుగా ఉన్నారు. పలు నియోజక వర్గాల పరిశీలకులుగా పనిచేశారు. అయనకు బలమైన బంధువర్గం, కుటుంబ నేపథ్యం, ఆర్థిక సామర్థ్యం ఉంది. ఆయనకు పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మద్దతు ఇస్తున్నారు. అలాగే రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మబ్బు దేవ నారాయణ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. ఆయన తండ్రి మబ్బు రామిరెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయనకు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. ఆయనకు కూడా బలమైన బంధువర్గం ఉంది.
తిరుపతి టౌన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు పులిగోరు మురళీ కృష్ణా రెడ్డి కూడా టికెట్టు ఆశిస్తున్నారు. ఆయన గతంలో యూత్ కాంగ్రెస్ తిరుపతి పట్టణ, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఆయనకు తిరుపతిలో బలమైన అనుచర గణం ఉంది. కాగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పేరును కొందరు సూచించినట్టు తెలిసింది. ఆయనకు సైకాలజిస్టు, శిక్షకునిగా మంచి పేరుంది. ఆయన 20 ఏళ్ళు టిటిడి ఉద్యోగులు, రాస్ పొదుపు సంఘాల సభ్యులు, పోలీసులకు శిక్షణ ఇచ్చారు. అయితే ఆయన తన కుమారుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డికి చంద్రగిరి టికెట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాళహస్తి టికెట్టు కేటాయింపును బట్టి తిరుపతి టికెట్టు ఆధారపడి వుంటుందని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు.