పోరాట యోదుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
రాజంపేట పార్లమెంట్ బిజెపి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్వతహాగా పోరాటయోధుడు. క్రికెట్ ప్లేయర్ అయిన కిరణ్ క్రికెట్ నే కాకుండా రాజకీయాలను కూడా ఛాలెంజ్ గా తీసుకున్న ధీరుడు. ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లాకు ఎనలేని సేవ చేయడానికి భాగీరధ ప్రయత్నాలు చేశారు. ఇందుకు కిరణ్ కుమార్ రెడ్డి నాంది పలికినా, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆయన ఆశయాలకు గండి కొట్టింది. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్య శాశ్వతంగా మిగిలిపోయింది.
కిరణ్ కుమార్ రెడ్డి నిజాం కళాశాలలో బీకాం చేసి, ఉస్మానియా విద్యాలయంలో ఎల్ఎల్ బి పూర్తి చేశారు. నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశారు. రాష్ట్రం తరఫున రంజి ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ కు ప్రాతినిధ్యం వహించారు. ఆయన కెప్టెన్ గా ఉన్నప్పుడు జట్టులో అజారుద్దీన్ కూడా ఉన్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథరెడ్డి వాయల్పాడు నియోజకవర్గం నుండి గెలుపొంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన 1987లో మృతి చెందిన తర్వాత 1988లో జరిగిన వాయల్పాడు ఉప ఎన్నికల్లో ఆయన తల్లి సరోజమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే టిడిపి అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతుల్లో ఓటమి చవిచూశారు. 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే 1994 ఎన్నికలలో ఓడిపోయారు. తిరిగి 1999, 2004, 2009 ఎన్నికలలో వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్ గా, 2009లో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన ప్రభుత్వ విప్ గా వైయస్ రాజశేఖర్ రెడ్డికి అనుంగు అనుచరుడిగా మెలిగారు. రాజకీయంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డితో కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. తొలుత వైయస్ రాజశేఖర్ రెడ్డితో విభేదించినా, తర్వాత ఆయన ఆంతరంగిక సన్నిహితుడయ్యారు.
రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత 2010 నవంబర్ 25న ఆంధ్రప్రదేశ్ 25వ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం ఆశీస్సులతో పదవి బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి 2014 ఫిబ్రవరి 19 వరకు ఆ పదవిలో కొనసాగారు. ముఖ్యమంత్రిగా ఆయన పలు విప్లవత్మకమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కిరణ్ కాలంలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగింది. తుది దశకు చేరుకుంది. అయితే రాష్ట్ర విభజనను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అధిష్టానం అవైఖరికి వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు అనుకూలంగా శాసనసభలో తీర్మాణాన్ని ఆమోదించారు. కేంద్రం ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో ముఖ్యమంత్రి పదవిని కూడా త్రుణప్రాయంగా త్యజించారు. అధిష్టాన వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేసినా, దానికి ఆదరణ లభించలేదు. సుదీర్ఘ విరామం తరువాత కాంగ్రెస్ పార్టీలో చేసినా, కిరణ్ క్రియాశీలకంగా వ్యవహరించలేదు. అనంతరం బిజేపిలో చేరి, క్రియాశీలకం అయ్యారు. రాజంపేట ఎంపి అభ్యర్థిగా పోటి చేస్తున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒకవైపు ఎదుర్కొంటానే, మరోవైపు చిత్తూరు జిల్లాలో రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని అమలు చేయడానికి 7,400 కోట్ల రూపాయలతో ఒక బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు 4,300 కోట్ల రూపాయలను హట్కో రుణంగా మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 2,100 కోట్ల రూపాయలు. కండలేరు నుంచి శ్రీకాళహస్తి మీదుగా పుత్తూరు, నగరి, చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, మదనపల్లి, తిరుపతి తదితర జిల్లా మొత్తానికి రక్షిత నీటి సరఫరా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం అమలులో కిరణ్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మంత్రివర్గ సహచరులు మీ జిల్లాకు మాత్రమే 7,400 కోట్ల రూపాయలతో రక్షిత నీటి పథకాన్ని మంజూరు చేస్తే మా జిల్లాల పరిస్థితి ఏమిటని ప్రశించారు. వారికి సమాధానం చెప్పి, అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ నేత హరీష్ రావుకు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి వాదోపవాదాలు జరిగింది. అసెంబ్లీలో బిల్లు పాసైనా, కొందరు కోర్టుకెళ్లారు. కోర్టులో కూడా ఈ ల్లుకు ఆమోదం లభించింది. 6.000 కోట్ల రూపాయలతో టెండర్లను కూడా పిలిచి ఆమోదించారు. 6.61 టిఎంసిల నీటితో రూపొందించిన ఈ పథకాన్ని తర్వాత ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు రద్దు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలకు అందవలసిన రక్షిత మంచినీటి పథకం అమలు ఆగిపోయింది.
అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని పాదాల చెంత 120 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడానికి భారీ ప్రణాళికను రూపొందించారు. ఇందుకు బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ బోర్డులు నిధులను సమకుర్చుతాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏమి లేకుండానే ఈ గ్రౌండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులు లభించాయి. నిర్మాణానికి భూమిని కూడా కేటాయించారు. అయితే భూమి విషయంలో స్వల్ప వివాదం రావడంతో చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ క్రికెట్ మైదాన నిర్మాణాన్ని కూడా రద్దు చేశారు. ఈ విధంగా జిల్లాలో 7,400 కోట్ల రూపాయలతో టెండర్ల వరకు వచ్చిన రక్షిత మంచినీటి సరఫరా పథకం, 120 కోట్ల రూపాయలతో తిరుపతిలో నిర్మాణం నిర్మించగలబెట్టిన అంతర్జాతీయ క్రికెట్ మైదానం కూడా జిల్లా వాసులకు కలగానే మిగిలిపోయాయి.