బాబు మీద రగిలిపోతున్న దళితులు !
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి దళిత నాయకులు పార్టీ అధిష్టానం నిర్ణయంపై రగిలిపోతున్నారు. చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో ఎన్టీయార్ విధానాలకు తిలోదకాలు వదిలారని ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ పార్టీని నమ్ముకున్న వారికి టికెట్లు ఇచ్చారని, చంద్రబాబు డబ్బున్న వారికి టిక్కెట్టు అమ్ముకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విడుదల చేసిన మూడవ జాబితాలో చిత్తూరు లోక్ సభ అభ్యర్థిగా దుగ్గుమళ్ళ ప్రసాద రావు పేరు చూసి మరింత రెచ్చిపోతున్నారు. ఇక్కడ ఎవరూ దళిత నేతలు లేనట్టు ప్రకాశం జిల్లా నుంచి అభ్యర్థిని దిగుమతి చేసుకోవడం దురదృష్టకరం అంటున్నారు. దళితులలో ఉన్నత చదువులు చదినవారు, పి.హెచ్.డి.లు చేసిన వారు ఉన్నారు. చేస్తున్న ఉద్యోగాలను వదలి పార్టీ సేవకు అంకితం అయిన వ్యక్తులు ఉన్నారు. డబ్బు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. కరెక్టు అభ్యర్థి అయితే పార్టీ తరపున కూడా ఖర్చు పెట్టవచ్చుకదా అని అడుగుతున్నారు. ఆరుగాలం పార్టీని నమ్ముకొని, పార్టీ జండాలు మోసిన వారిని పక్కన పెట్టి, పార్టీకి సంబంధం లేని వారికీ టిక్కెట్లు ఇవ్వడంతో క్యాడర్ కు ఎం సందేశం ఇస్తున్నారని ప్రశ్నింస్తున్నారు. డబ్బు ఉంటేనే, పార్టీలోకి రావాలా? లేకుంటే అవసరం లేదని ఆవేదన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో మూడు అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఈ ఐదు స్థానాలలో అభ్యర్థుల ఎంపిక నిజమైన కార్యకర్తలను అవమాన పరిచేలా ఉన్నాయని అంటున్నారు. జి డి నెల్లూరు నియోజక వర్గంలో అన్ని విధాలా సమర్థులైన నాయకులు ఉన్నప్పటికీ చెన్నైలో ఉన్న క్రైస్తవ సంపన్నుడు డాక్టర్ వి ఎం థామస్ కు టికెట్టు ఇవ్వడం దారుణం అంటున్నారు. పుత్తూరులో నివాసం ఉంటున్న డాక్టర్ పచ్చికాపలం రవి కుమార్ గత ఏడాది పార్టీ కోసం ఒకటిన్నర కోటి రూపాయలు ఖర్చు చేశారు. ఆయనకు టికెట్టు ఇప్పిస్తామని అప్పటి సమన్వయకర్త భీమినేని చిట్టిబాబు నాయుడు నమ్మించి ఖర్చు పెట్టించారు. అలాగే పాలసముద్రం మండల కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర కూడా టికెట్టు ఆశించారు. మాజీ ఎస్పీ పి మునస్వామి టికెట్టు ఆశించి ఏడాది క్రితం పార్టీలో చేరారు. ఈ ముగ్గురిలో ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి ఎంపి టికెట్టు ఇచ్చి ఉంటే న్యాయం చేసినట్టు ఉండేదని అంటున్నారు.
పూతలపట్టు నియోజక వర్గంలో తొలినుంచి పార్టీకి పనిచేస్తున్న ఆనగంటి మునిరత్నం, సప్తగిరి ప్రసాద్ ను కాదని తిరుపతిలో ఉన్న మురళీ మోహన్ కు టికెట్టు ఇచ్చారు. సత్యవేడు నియోజక వర్గం ఇంచార్జిగా ఉన్న జేడీ రాజశేఖర్ ను తొలగించి, మాజీ ఎమ్మెల్యే హేమలత కూతురు హెలెన్ కు బాధ్యతలు ఇచ్చారు. ఆమె వద్ద భారీగా పార్టీకి నిధులు తీసుకున్నారు. ఆఖరికి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి టికెట్టు ఇచ్చారు. దీనితో జేడి రాజశేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారు.
తిరుపతి లోక్ సభ బిజెపికి కేటాయించారు. వారు కూడా బయటి ప్రాంతానికి చెందిన వ్యక్తికి టికెట్టు ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ ఐదు నియోజక వర్గాలలో మాదిగ సామాజిక వర్గానికి ఒక స్థానం కూడా ఇవ్వక పోవడం పట్ల ఆ వర్గంలో అసమ్మతికి దారితీస్తోంది. తెలుగుదేశం పార్టీలో దళితులు జెండాలు మోయడానికి, జేజేలు కొట్టడానికి, బిర్యానీ పొట్లాలు తీసుకోవడానికి తప్పించి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి పనికిరారా అని అడుగుతున్నారు. అంతా, పక్క జిల్లాల నుండి దిగుమతి చేస్తే, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ దళిత నేతలు ఎంకావలి అని ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధిక జనాభా ఉన్న దళితల్లో ఎంపీగా పోటీ చేయడానికి అభ్యర్థులు లేరా అని నిలతీస్తున్నారు.
పోరుగు జిల్లా నుండి అభ్యర్థులు తీసుకొచ్చి, కేవలం డబ్బులు ఉన్నాయని ఒక కారణంతో టికెట్లు ఇవ్వడంతో పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు దళిత కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీని ప్రభావం 14 నియోజకవర్గాల్లోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పైన పడుతుందనీ, ఇన్ని రోజులు పార్టీలో కష్టపడి పనిచేస్తున్న దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంటే, కనీసం ఒక్క ఓపెన్ కకేటగిరీలోని ఒక్కరంటే ఒకరు కూడా అధినాయకత్వానికి ప్రశ్నించుకపోవడం చాలా విచిత్రంగా ఉందని బాధ పడుతున్నారు. మునిగిపోతున్నది దళితులే కదా! మనకేమి అనేటువంటి ఒక ధీమాలో ఓ సిలు ఉన్నారని, ఇది కరెక్టు కాదని అంటున్నారు.