చంద్రగిరి టిడిపి టికెట్టుకై బిసిల పట్టు
చంద్రగిరి టిడిపి టికెట్టు వ్యవహారం చిక్కుముడిని తలపిస్తోంది. మూడు కులాల మధ్య వర్గ పోరుకు దారితీసింది. కమ్మ, రెడ్డి, బిసి నేతలు మాకంటే మాకు టికెట్టు అంటూ పట్టు పడుతున్నారు. 25 యేళ్ళుగా నియోజక వర్గంలో ఓడిపోతున్న పార్టీని గెలిపించడం బీసీలకు మాత్రమే సాధ్యం అంటున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ బడి సుధాయాదవ్ టికెట్టు రేసులో ఉన్నారు. ఆయనకు మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి ఆశీస్సులు ఉన్నాయి. సోమవారం బిసి నాయకుడు రుద్రగోపి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ చంద్రగిరి బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు జిల్లాలో ఒక స్థానం కూడా తమ వర్గానికి ఇవ్వనందున చంద్రగిరి అయినా కేటాయించాలని కోరారు. ఇక్కడ లక్షా 37 వేల మంది బిసి ఓటర్లు ఉన్నారని తెలిపారు. బడి సుధాయాదవ్ అయితే సులభంగా విజయం సాధించవచ్చని చెప్పారు. ఆయన సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. గతంలో అరుణ కుమారి వెంట తిరగడం వల్ల నియోజక వర్గం అంతా పరిచయాలు వున్నాయన్నారు.
నియోజక వర్గం ఇంచార్జి పులివర్తి నానిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాగా పులి వర్తి నాని తానే అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేసి వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి చిత్తూరు అధ్యక్షుడు, నియోజక వర్గం ఇంచార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ రెడ్డికి టికెట్టు ఇవ్వాలంటే తన భార్య సుధా రెడ్డికి ఇవ్వాలని కోరుతున్నారు. ఆమె పేరుతో పోస్టర్లు అంటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం వెంకట్రామా నాయుడు మనవడు ఇందుశేఖర్ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు నియోజక వర్గంలో మంచి బంధువర్గం ఉంది.
ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఆ వర్గానికి టికెట్టు ఇస్తే వైసిపి అభ్యర్ధి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఓడించడం సులభం అవుతుందని అంటున్నారు. పైగా చిత్తూరు పార్లమెంటు పరిధిలో ముగ్గురు కమ్మ వారికి టికెట్టు ఇచ్చినందున ఇది రెడ్డికి ఇస్తే మంచిదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి డాలర్ దివాకర్ రెడ్డి టికెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. మార్పు తథ్యం అంటూ నియోజక వర్గం అంతా పోస్టర్లు అంటించారు. అయితే తాను టికెట్టు ప్రయత్నం విరమించుకున్నారు. అయితే దీనికి కారణాలు తెలియలేదు.
కాగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి కుమారుడు ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డి పోటీకి సిద్దంగా ఉన్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ జాతీయ ఉపాధ్యక్షుడు అయిన ఆయన ఇటీవల ఐఐటి ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ఆయన తొలుత నగరి టికెట్టు కోసం ప్రయత్నం చేశారు. ఆ స్థానం గాలి భాను ప్రకాష్ కు కేటాయించడంతో చంద్రగిరిపై దృష్టి పెట్టారు. ఆయనకు మంచి పేరు, బంధువర్గం ఉంది. ఈ నేపథ్యంలో పులివర్తి నాని, బడి సుధా యాదవ్, ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నది. నాని కాదని తమలో ఎవరికి ఇచ్చిన కలసి పనిచేస్తామని మిగిలిన ఇద్దరు అంటున్నారు.