చంద్రగిరి టీడీపీ టిక్కెట్టు నాదంటే నాదే !
చంద్రగిరి టిడిపి టికెట్టు నాది అంటే నాది అంటూ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో సహ ఆశావహుల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకరు వైసిపి కోవర్టు అంటే మరొకరు చెవిరెడ్డి వదిలిన బాణం అంటున్నారు. ఒకరు ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టాను కాబట్టి నాకే టికెట్టు అంటున్నారు. మరొక నాయకుడు ఎన్నికల్లో వంద కోట్లు ఖర్చు పెడతానని, ఇప్పటికే 50 కోట్లు అధిష్టానం వద్ద డిపాజిట్ చేశానని అంటున్నారు. 30 ఏళ్ళ తరువాత చంద్రగిరి కోటపై టిడిపి జండా ఎగుర వేస్తామని సవాళ్లు చేస్తున్నారు.
అయితే ఒకరు కూడా వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై విమర్శలు చేయడం లేదు. ఈ పరిస్థితులు చూసి కార్యకర్తలు నవ్వు కొంటున్నారు. విసుగు చెందుతున్నారు. చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గంలో చంద్రగిరి ప్రత్యేకత ఉంది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు 1978 లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్టుపై ఎమ్మెల్యే అయ్యారు. ఆయన స్వంత గ్రామం అయిన నారావారి పల్లె చంద్రగిరి మండలంలో ఉంది. ఆయన 1983లో టిడిపి అభ్యర్థి వెంకట్రామ నాయుడు చేతిలో ఓడిపోయారు. తరువాత 1989 నుంచి వరుసగా కుప్పం నుంచి గెలుస్తున్నారు. ఇక్కడ 1985, 1994 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు గెలిచారు. నాలుగు సార్లు గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. ఆమె 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పులివర్తి నాని కూడా చెవిరెడ్డి చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు.
టిడిపి ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు తొమ్మిది సార్లు జరిగిన ఎన్నికల్లో టిడిపి మూడు సార్లు, కాంగ్రెస్ నాలుగు సార్లు, వైసిపి అభ్యర్థులు రెండు సార్లు గెలిచారు. నియోజక వర్గంలో చంద్రగిరి, తిరుపతి రూరల్, రామచంద్రాపురం, పాకాల, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాల్యం మండలాలు ఉన్నాయి. మొత్తం 2,9,734 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో రెడ్లు 80 వేలు, బిసిలు 65 వేలు, ఎస్సీలు 55 వేలు, కమ్మ 45 వేలు, బలిజ 35 వేలు, ఇతరులు 11 వేలకు పైగా ఉన్నారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థికి టిడిపి టికెట్టు ఇస్తే గెలుస్తారని భావిస్తున్నారు. దీనికి తోడు పార్ల మెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజక వర్గాలలో కుప్పం, చిత్తూరు, నగరి కమ్మ వారికి పలమనేరు రెడ్డికి ఇచ్చారు. పూతలపట్టు, జి డి నెల్లూరు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. కాబట్టి చంద్రగిరి రెడ్డికి ఇస్తారని అంటున్నారు. అయితే బిసి అభ్యర్థికి ఇవ్వాలని కొందరు పట్టు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2019 నుంచి కోట్లు ఖర్చు పెట్టి పార్టీని భుజాలపై మోస్తున్న తనకు టికెట్టు ఇవ్వాలని పులివర్తి నాని పట్టు పడుతున్నారు. ఒక వేళ రెడ్డికి ఇవ్వాలని భావిస్తే తన భార్య సుధారెడ్డి ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్రామా నాయుడు మనుమడు ఇందుశేఖర్ కూడా చంద్రగిరి టిక్కెట్టును ఆశిస్తున్నారు.
కాగా యువ పారిశ్రామిక వేత్త డాలర్ దివాకర్ రెడ్డి టికెట్టు తనకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. మార్పు తప్పదు అంటూ నియోజక వర్గం మొత్తం పోస్టర్లు అంటించారు. తాను 100 కోట్లు ఖర్చు పెడతానని అంటున్నారు. ఇప్పటికే పార్టీకి నిధులు కూడా ఇచ్చారని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. కాగా దివాకర్ రెడ్డి చెవిరెడ్డి వదిలిన బాణం అని, ఆయన వద్ద అంత డబ్బు లేదని సైకం జయచంద్రా రెడ్డి చంద్రబాబును కలసి ఫిర్యాదు చేశారని వార్తలు వచ్చాయి. తనకు టికెట్టు ఇస్తే గెలిచి చూపిస్తానని చెప్పారని అంటున్నారు. రోజుకు ఒక పార్టీ మారే జయచంద్రా రెడ్డి మాటలకు విలువ లేదని, ఆయన నానితో కుమ్మక్కై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దివాకర్ రెడ్డి వర్గం అంటున్నారు.
కాగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి తాను కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డానని, తన కుమారుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డికి టికెట్టు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. యువకుడు, విద్యావంతుడు, మంచి పేరున్న హర్షవర్ధన్ రెడ్డిని ప్రజలు ఆదరిస్తారని అంటున్నారు. కాగా బిసి సామాజిక వర్గానికి చెందిన బడి సుధా యాదవ్ కూడా టికెట్టు ఆశిస్తున్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా సిద్దంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రగిరి టిడిపి టికెట్టు వ్యవహారం ఆసక్తికరంగా తయారు అయ్యింది.