మునస్వామి థామస్ ఎలా అయ్యారు ?
గంగాధర నెల్లూరు నియోజక వర్గం టిడిపి అభ్యర్ధి డాక్టర్ వి ఎం థామస్ మతం, విద్యార్హతలు, నేరచరిత్ర పైన సమగ్ర విచారణ చేసి, థామస్ ఎన్నికల నామినేషన్ ను తిరస్కరించాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మిట్టపల్లి సతీష్ రెడ్డి కోరారు. ఈ మేరకు సతీష్ రెడ్డి చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పదో తరగతి టిసిలో ఇండియన్ హిందూ అధిద్రావిడ ఎస్ సి అని ఉందని, పాస్ పోర్టులో వి.ఎం. థామస్ ఎలా అయ్యారో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. థామస్ ఎం బి బిఎస్ చేయకున్నా, డాక్టర్ గా చెలామణి అవుతూ అమాయక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే చెన్నైలో థామస్ మీద నమోదు అయిన హత్యాయత్నం కేసు విషయం కూడా నిగ్గు తేల్చాలని మనవి చేశారు. ఎస్ సి అంటూ విద్యార్థి దశలో ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి, ఇప్పుడు థామస్ అంటూ క్రిస్టియన్ పేరు మీద చెలామణి అవుతున్న థామస్ మీద పోలీస్ కేసును నమోదు చేసి, ప్రాసిక్యూషన్ చేయాలన్నారు. థామస్ పేరులోనే క్రిస్టియానిటీ ఉందని, కావున అతని ఎస్ సి కుల ధ్రువీకరణ పత్రంను రద్దు చేయాలన్నారు. థామస్ నామినేషన్ ను తిరస్కరించి, ఎన్నికలలో అనర్హత వేటు వేయాలని సతీష్ రెడ్డి కోరారు.
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజక వర్గం టిడిపి అభ్యర్థి డాక్టర్ వడింగాడు మునస్వామి థామస్ ( డాక్టర్ వి ఎం థామస్) క్రైస్తవ మతస్థుడు. ఆది ద్రావిడ కులంలో పుట్టినప్పటికీ క్రైస్తవ మతం స్వీకరించిన ఆయనకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదన్నారు. మతం మారిన వారిని బీసీలుగా గుర్తించాలని చట్టం చెపుతున్నదని పేర్కొన్నారు. అయినా ఆయన తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ద పడుతున్నారాని, జిల్లా ఎన్నికల అధికారిగా ఎస్ సి లకు అన్యాయం జరగకుండా అడ్డుకోవాలన్నారు. ఆయన ఎంబీబీఎస్ చదవక పోయినా పి హెచ్ డి ని అడ్డుపెట్టుకుని డాక్టరుగా చలామణి అవుతు ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు.తను ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
అలాగే ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా పేర్కొన్నారు. 2017లో తన వద్ద డాక్టర్ గా పనిచేసి మానేసిన డాక్టర్ ఎస్ రమ్యను హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయని వివరించారు. ఆ కేసులో ఆయనతో పాటు ఆరుగురు అరెస్టు అయ్యారని, తరువాత ఆ కేసు ఏమయ్యిందో తెలియదన్నారు. ఈ విషయాన్ని కూడా నిగ్గు తేల్చాలని కోరారు. థామస్ మత మార్పిడి గూర్చి విచారణ చేయమని జై హింద్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అక్కిలిగుంట మధు 15.3.2024న చిత్తూరు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారన్నారు. కలెక్టర్ దీనిపై నివేదిక పంపమని కార్వేటినగరం తహశీల్దార్, ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి అదేశాలు జారీ చేశారని తెలిపారు. వారు సర్టిఫికెట్లను పరిశీలించి 1990-91 లో ఇంటర్ పూర్తి చేసిన ఆయన ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్ ప్రకారం ఆయన పేరు వి మునస్వామి అని, కులం ఆది ద్రావిడ (ఎస్సీ గా ధృవీకరించారని తెలిపారు. అయితే ఆయన పాస్ పోర్టు, గ్రామ సచివాలయం ఇచ్చిన సర్టిఫికేట్ లో వి. ఎం థామస్ అని ఉందని నివేదికలో పేర్కొన్నారు.
ఆయనకు గతంలో తహశీల్దార్ ఇచ్చిన పర్మనెంట్ కుల ధ్రువీకరణ పత్రంలో ఆది ద్రావిడ అని ఉందని తెలిపారు. అయితే వి మునస్వామి, వి ఎం థామస్ ఎలా అయ్యారు అన్న విషయం పై వివరణ ఇవ్వలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. సహజంగా పదవ తరగతి మార్కుల సర్టిఫికేట్ ను పుట్టిన తేదీకి, టిసిని కుల ధ్రువీకరణకు ప్రామాణికంగా చూస్తారన్నారు. ఇక్కడ ఆ ప్రస్తావన లేదు. కులం పై వివాదం వచ్చినపుడు గ్రామంలో నలుగురిని అడిగి పంచనామ చెయ్యాలి. అవి ఏవి చేయకుండా, టి సి, పాస్ పోర్టులో పేరు వేరు వేరుగా ఉన్నందుకు కారణం తెలపకుండా అధికారులు నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్నారని విచారణను తప్పుపట్టారు.
సహజంగా పాస్ పోర్టు మంజూరు సమయంలో ఒక అక్షరం తప్పు ఉన్నా అధికారులు ఆమోదించరు. మునస్వామి పక్కన థామస్ అన్న పదం కలవడానికి సరైన ఆధారం చూపకుండా సమ్మతించరు. పేరు మార్చుకోవాలి అంటే గెజిట్ నోటిఫికేషన్ ఉండాలి. మతం మార్చుకుని ఉంటే సంబంధిత ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. కాబట్టి పాస్ పోర్టు సమయంలో మత మార్పిడి ధృవీకరణ పత్రం, గెజిట్ నోటిఫికేషన్ సమర్పించి ఉంటారు. పాస్ పోర్టు కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకుంటే ఆ విషయం తెలుస్తుందని వివరించారు. అలా కాకుండా తూ తూ మంత్రంగా ఇవేదికలు ఇవ్వడం తగదని, సంబంధిత తహశీల్దార్ మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎం ఎస్ సి, పి హెచ్ డి చేసిన వి ఎం థామస్ తనను తాను డాక్టరుగా చెప్పుకోవడం కూడా చీటింగ్ చేయడంగా గుర్తించాలన్నారు. ఆయన చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్, చైర్మన్ గా ఉన్నారు. ఆయన కేంద్రంలో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (ఐ వి ఎఫ్) పద్దతి ద్వారా సంతాన సాఫల్యానికి తోడ్పడుతుంటారు. అందులో ఆయన ఒక టెక్నీషియన్ మాత్రమేనని అయితే డాక్టర్ గా చలామణి అవుతూ, ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయన గతంలో తన వద్ద పనిచేసి మానేసిన మహిళా డాక్టర్ ఎస్ రమ్యపై హత్యా ప్రయత్నం కేసులో నిందితునిగా ఉన్నారు. 2017లో ఆయన మరి కొందరితో కలిసి బురకాలు వేసుకుని కత్తితో పొడిచారని ఆరోపణలు ఉన్నాయి. వీటి మీద విచారణ జరిపించాలని కోరారు.
ఆయన కార్వేటినగరం మండలం అల్లా గుంట గ్రామంలో 28.06.74 లో జన్మించారు. అప్పటికే ఆయన తల్లి తండ్రులు క్రైస్తవ మతం స్వీకరించారు. అయినా రిజర్వేషన్ కోసం ఆయన ఆది ద్రావిడ కులానికి చెందిన వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఆయన 12 ఏళ్ళ బాప్టిస్ట్ అయ్యారని ఆయన తల్లి చెప్పింది. తమ కుటుంబ సభ్యులు అందరూ క్రైస్తవులమని ఆమె చెప్పింది. ఇటీవల పాలసముద్రంలో మాట్లాడుతూ తాను క్రైస్తవ మతస్తుడునని, తన భార్య రెడ్డి కులానికి చెందిన వ్యక్తని చెప్పారు. అలాగే ఆయన తల్లి కూడా తాము క్రైస్తవులమని చెపుతున్నది. ఆయన నిత్యం చర్చిలో ప్రార్థనలు చేస్తుంటారు. ఇప్పటి వరకు ఒక సారి కూడా తిరుమలకు వెళ్లి దేవుని దర్శించ లేదన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం వెదకాలి. సమగ్రంగా దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాలి. ఎస్సీల అభివృద్ది కోసం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్ దుర్వినియోగం కాకుండా కాపాడాలి.
1.ఇంటర్ సర్టిఫికేట్ లో వి. మునస్వామి అని ఉన్న పేరు, పాస్ పోర్టులో వి. ఎం. థామస్ గా ఎలా మారింది.
2.ఆయన జన్మ స్థలం అల్లాగుంటని టి సి లోనూ, చెన్నై అని పాస్ పోర్టులోనూ పేర్కొన్నారు. ఇందులో ఏది నిజమో నిగ్గు తేల్చాలి.
3. ఆయన వైద్యశాస్త్రం చదివారా లేక డాక్టరేట్ పొందిన వ్యక్తా అన్నది తేల్చాలి.
4. వైద్య శాస్త్రం చదవకుండా కృత్రిమ గర్భధారణ చికిత్స చేయడం చట్ట సమ్మతమా, కాదా తెలపాలి.
5. ఆయనపై ఉన్న హత్యా ప్రయత్నం కేసు ఏమయ్యింది. విచారణ కొనసాగుతున్నదా లేక కేసు కొట్టి వేశారా వెల్లడించాలి.
కావున దయచేసి సమగ్ర విచారణ చేసి నిజా నిజాలను నిగ్గు తేల్చాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి నేత సతీష్ రెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు.