థామస్ కు మీడియా గ్రహణం ! కృపాలక్ష్మికి మిథున్ అనుగ్రహం !
గంగాధర నెల్లూరు నియోజక వర్గం టిడిపి అభ్యర్థి థామస్ పై మీడియా మిత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి అభ్యర్థి కృపాలక్ష్మికి రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి అనుగ్రహం ఉంది. నియోజకవర్గ కేంద్రంలోని పాత్రికేయులు థామస్ వైఖరి పట్ల మండిపడుతున్నారు. ఆయన కార్యక్రమాలను బహిష్కరించారు. శనివారం థామస్ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పర్యటించినా ఎవరూ కవర్ చేయలేదు.
వైసిపికి కంచుకోట లాంటి జి డి నెల్లూరు నియోజక వర్గంలో ఈ సారి ఎలాగైనా గెలవాలని చంద్రబాబు నాయుడు పట్టుదలతో ఉన్నారు. అక్కడ ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నందున వైసిపికి అనుకూలంగా ఉంటుంది. అయితే బాగా డబ్బు ఖర్చు పెడితే ఎస్సీ, బిసి, పేద వర్గాలను ఆకట్టుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో సంతాన సాఫల్య కేంద్రం నడుపుతున్న డాక్టర్ థామస్ కు టిడిపి టికెట్టు ఇచ్చారు. చంద్రబాబు భావించినట్టు థామస్ డబ్బు ఖర్చు పెడుతున్నారు. దళితుల చావులు, కర్మ క్రియలకు వెళ్ళి అక్కడ చేయి చాచిన వారికి రెండు వందల చొప్పున ఇస్తున్నారు. అలాగే పలువురికి బట్టలు, నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. అయితే ఆయన కొన్ని సందర్బాలలో అహంకార పూరితంగా ప్రవర్తించి కీలక వ్యక్తులను దూరం చేసుకుంటున్నారు.
ఇటీవల జి డి నెల్లూరులో రా కదలి రా సభ జరిగిన సందర్భంగా మీడియా వారిని పట్టించుకోలేదు. ఆవిషయం మరుసటి దినం జరిగిన ఒక కార్యక్రమంలో విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించారు. ఆ సందర్భంలో ఆయన చాలా దురుసుగా మాట్లాడారు. నా గురించి మీరు ఎం అనుకుంటున్నారు. నా బ్యాక్ గ్రాండ్ తెలుసా ? నేనేమి కావాలని రాజకీయాల్లోకి రాలేదు. చంద్రబాబు రమ్మంటేనే వచ్చాను. నా సంపాదన, పేరు ప్రఖ్యాతులు మీకు తెలుసా అంటూ విలేకరుల మీద రెచ్చిపోయారు. తోటి విలేకరులు నచ్చచెప్పినా, వెనక్కి తగ్గలేదు. దీంతో జీడీ నెల్లూరు విలేకరులు థామస్ వార్తలను బహిష్కరించారు. దీనికి తోడు పార్టీలోని కొందరు సీనియర్లు ఆయనకు దూరంగా ఉన్నారు. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు.
ఇదిలా ఉండగా వైసిపి అభ్యర్థిగా మూడవ సారి ప్రకటించిన కృపాలక్ష్మీకి రాజంపేట ఎంపి రెడ్డివారి మిథున్ రెడ్డి అనుగ్రహం ఉందని తెలిసింది. ఆమె తండ్రి, ఊప ముఖ్య మంత్రి నారాయణ స్వామి పట్ల ఒక వర్గం వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. ఆయనకు టికెట్టు ఇస్తే పనిచేయమని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్ ఆమెకు టికెట్టు ఇచ్చారు. అయితే ఆమె పట్ల ద్వితీయ శ్రేణి నాయకులు అంత సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి మాట్లాడి సానుకూలంగా పనిచేయడానికి ఒప్పించారు. అలాగే విజయానంద రెడ్డి ఇతర నాయకులతో మాట్లాడి ఎలాగైనా ఆమెను గెలిపించాలని సూచించారు. తానే స్వయంగా జి డి నెల్లూరు బాధ్యతలు తీసుకుంటానని ఆమెకు భరోసా ఇచ్చారు. టిడిపి అభ్యర్థికి రెట్టింపు ఖర్చు పెట్టడానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ వారంలో నియోజక వర్గంలో పర్యటించడానికి సిద్దంగా ఉన్నారు. దీనితో కృపాలక్ష్మీకి దూరంగా ఉన్నవారు దగ్గరౌతున్నారు.