జిల్లాలో 'నల్లారి' మార్క్ రాజకీయం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుగులేని నేతగా ఎదుగుతున్నారు. తన అన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య మంత్రిగా, తండ్రి అమరనాద రెడ్డి మంత్రిగా పనిచేశారు. కాబట్టి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనువుగా ప్రత్యర్ధి వర్గ నేతలకు టికెట్టు రాకుండా అడ్డుపడుతున్నారు. తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. ఇందులోభాగంగా చాలా కాలంగా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసిన వారిని వ్యూహం ప్రకారం పక్కన పెడుతున్నారు. వారికి టిక్కెట్లు రాకపోవడంతో పార్టీకి దూరం అవుతున్నారు. వేరే పార్టీలోకి వెళుతున్నారు.
దీనివల్ల పార్టీని నమ్ముకున్న కొందరు నేతలు అవేదన, అనారోగ్యం పాలవుతున్నారు. కిషోర్ పదవి చేపట్టిన వెంటనే తన ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి ఎన్ అమరనాద రెడ్డి మరదలు అనీషా రెడ్డిని పుంగనూరు ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించారు. తన వర్గానికి చెందిన చల్లా రామచంద్రా రెడ్డికి ఇంచార్జి పదవి ఇప్పించారు. అమరనాద రెడ్డి మంత్రి పదవికి అడ్డు వస్తారని భావించి ఈ పని చేశారని అంటున్నారు. ఇటీవల తంబళ్లపల్లె ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ను తప్పించారు. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ ను పార్టీలోకి తిరిగి ఆహ్వానించినా, పార్టీలో జరుగుతున్న తతంగం చూసి రాజకీయాలు వద్దనుకున్నారు. దీంతో జయచంద్రా రెడ్డికి టికెట్టు ఇప్పించారు. ఆయన పెద్దిరెడ్డి కోవర్టు అని ప్రచారం జరుగుతోంది. బీసీ నేత శంకర్ ను తప్పించడంతో ఆయన పార్టీకి రాజీనామా లోచనలో ఉన్నారు.
మదనపల్లెలో ఇంచార్జి దొమ్మల పాటి రమేష్ ను కాదని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషా ను తెరపైకి తెచ్చారు. చిత్తూరు అభ్యర్ధిగా సి కె బాబు కాకుంటే జగన్ మోహన్ నాయుడుకు ఇమ్మని చెప్పినట్టు తెలిసింది. దీనితో అమరనాద రెడ్డి, పులివర్తి నాని, దొరబాబు వర్గాన్ని దెబ్బ తీసినట్టు అయ్యింది. నగరిలో గాలి భాను ప్రకాష్ కు టికెట్టు రావడంలో కూడా కిషోర్ పాత్ర ఉందని అంటున్నారు. తిరుపతిలో సుగుణమ్మను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఆమె ఎమ్మెల్యే అయితే బలిజ కోటాలో మంత్రి పదవికి అడ్డు వస్తుందని భావిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నానీని కాదని ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి లేదా డాలర్ దివాకర్ రెడ్డికి టికెట్టు ఇప్పించే పనిలో ఉన్నారని సమాచారం.
కడప జిల్లా రాయచోటి ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి రాం ప్రసాద్ రెడ్డికి టిక్కెట్టు కేటాయించారు. ఇందులో రమేష్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. దీనితో రమేష్ కుమార్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రాజంపేట ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును తప్పించి మరొకరికి టిక్కెట్టు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా బిజెపితో పొత్తు కుదిరితే తన అన్న, మాజీ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట పార్లమెంట్ టికెట్టు వద్దని అంటున్నట్టు తెలిసింది. బీజేపీ తరపున కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తే ముస్లింలు తనకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని భావిస్తున్నారు. పైగా కిరణ్ కుమార్ రెడ్డి కూడా తనకు వ్యతిరేకంగా పని చేస్తారని అనుమానిస్తున్నారు. బీజేపీతో పొత్తు ఉంటే ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి మదనపల్లి సీటును షాజహాన్ భాషాకు ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్లు సమాచారం.
దీనితో ఒక వర్గం నేతలు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. మరికొందరు పార్టీలో ఇమడలేక బయటకు పోలేక సతమతం అవుతున్నారు. కొందరు రాజకీయాలే వద్దనుకుంటున్నారు. కొందరు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి చర్యల కారణంగా పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆవేదన చెందుతున్నారు. రానున్న ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాలో గెలుపు అవకాశాలు సన్నగిల్లుతాయని ఆందోళన చెందుతున్నారు.