9, మార్చి 2024, శనివారం

కుల్లంపల్లిలో వైభవంగా వీరభద్రస్వామి అగ్నిగుండ ప్రవేశం


చిత్తూరు జిల్లా,  ఐరాల మండలం, కుల్లంపల్లిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి అగ్నిగుండ ప్రవేశం శనివారం ఉదయం అత్యంత వైభవంగా జరిగింది. వళ్లు గగుర్పాటు చెందే విధంగా భక్తులు వీరభద్ర స్వామిని భుజాల మీద మోస్తూ   మండుతున్న అగ్నిగుండంలో ప్రవేశించి సురక్షితంగా బయటికి వచ్చారు. ఆ ప్రాంగణం అంతా హర హర మహాదేవ, శంభో శంకర, హా  వీరభద్రా అంటూ నినాదాలతో  మర్మోగింది. శ్రీ వీరభద్రస్వామి భక్తులు అత్యంత పవిత్రంగా ఉపవాసం ఉండి, శివా దీక్షతో అగ్నిగుండ ప్రవేశం చేశారు.


భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ఆరవ తేదీ బుధవారం ప్రారంభమయ్యాయి.  దిగువ కామినాయన పల్లి గ్రామస్తులు రాత్రి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పగలు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, రాత్రి స్వామిని గ్రామంలో ఊరేగించారు. గురువారం ఉదయం శివపార్వతుల కల్యాణోత్సవం పుల్లూరు గ్రామానికి చెందిన ముత్తిరేవుల గోవింద రెడ్డి కుటుంబ సభ్యులచే  వైభవంగా జరిగింది. రాత్రి వీరభద్ర స్వామికి, భద్రకాళి అమ్మవారికి కళ్యాణోత్సవం పుత్రమద్దికి చెందిన శేధార సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులచే  వైభవంగా జరిగింది. 8వ తేదీ శుక్రవారం రాత్రి పుత్రమద్ది, కుల్లంపల్లి, మిట్టూరు, గురవణంపల్లి,  పెండ్లిగుండ్లపల్లి, పరసరెడ్డిపల్లి, కురప్పల్లి గ్రామస్తులచే పాలాభిషేకం, దక్షయజ్ఞ ధ్వంసం కార్యక్రమం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి చిత్తూరు కట్టెల దొడ్డికి చెందిన నారాయణ రెడ్డి కుమారులు పుష్పాలంకరణ చేశారు. అలాగే కుల్లంపల్లికి చెందిన వాసుదేవ రెడ్డి దంపతులు స్వామికి పుష్పాలు అర్పించారు. శుక్రవారం రాత్రి పాదుకలకు భక్తిశ్రద్ధలతో పూజలు ఆలయ పూజారి బుడగుంట్ల సుబ్రహ్మణ్యం, అలక్స్ ధర్మకర్త పర్రి విశ్వనాధం నిర్వహించారు. అనంతరం అగ్ని గుండాన్ని వెలిగించే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహకులు, రిటైర్డ్ డిప్యూటీ తాసిల్దార్ పుత్రమద్దికి చెందిన జయచంద్రారెడ్డి, వైసిపి ఐరాల మండల అధ్యక్షుడు బుజ్జి రెడ్డి, గుడిపాల మండలం బొమ్మసముద్రం  జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బండారు శరత్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాటి గంగాధర్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. ముందుగా పుత్రమద్ది నుంచి కార్యనిర్వాహకులు జయచంద్రారెడ్డిని మేళాతాళాలతో, మంగళ వాయిద్యాలతో, బాణ సంచాల పేలుస్తూ  సాదరంగా వీరభద్ర స్వామి గుడికి తీసుకొని వచ్చారు. వారు కుటుంబ సమేతంగా స్వామి వారికి పూజాద్రవ్యాలను సమర్పించారు.


శనివారం ఉదయం ఐదు గంటలకు వళ్లు గగుర్పాటు పట్టే విధంగా వీరభద్ర స్వామి అగ్నిగుండ ప్రవేశం జరిగింది. శివమాల ధరించిన భక్తులు స్వామి వారిని అధికారిక నంది వాహనం మీద అగ్ని గుండానికి తీసుకువెళ్లారు. ఆలయం నుంచి బయలుదేరిన స్వామివారికి గ్రామస్తులు కర్పూర నీరాజనాల సమర్పించారు. భక్తిశ్రద్ధలతో స్వామి వెంట పరుగులు తీశారు. మహోగ్ర రూపంలో, గాలి వేగంతో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దక్షయజ్ఞ ధ్వంసం కార్యక్రమానికి బయలుదేరారు. దక్షయజ్ఞ ధ్వంసం కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శివ భక్తులు, పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాలను పురోహితులు బండారు భరత్ కుమార్ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి మిట్టూరుకు చెందిన జయరామ రెడ్డి గారిచే ప్రవచన కార్యక్రమం జరిగింది. పుత్రమద్ది హరిజన వాడకు చెందిన భక్తులు కోలాటాలతో భక్తులను ఆకట్టుకున్నారు. గ్రహ నిరారణ, సంతాన ప్రాప్తి, భూత, ప్రేత నివారణ కార్యక్రమాలను  నిర్వహించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *