వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్న శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని రాజకీయ నాయకులు వారసత్వ పరంపరను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం ఇప్పుతున్నారు. వారసత్వ రాజకీయాలను కట్టడి చేయాలని పిలుపునిస్తున్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయి. వారసత్వ పాలన వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు ఒక వేదిక మీదికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ పార్టీలు సూచనప్రాయంగా ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకొని వెళ్ళినట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి రెండు పర్యాయాలు మాత్రం వేరే అభ్యర్థులు పోటీ చేశారు. ఏడు పర్యాయాలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కుటుంబ సభ్యులు మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో అద్దూరి దశరథ రామిరెడ్డి టిడిపి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో సత్రవాడ మునిరామయ్య టిడిపి అభ్యర్థిగా గెలుపొందినా, సాంకేతిక కేరణ కారణాలతో 1988లో కాంగ్రెస్ పార్టీకి చెందిన చెంచు రెడ్డిని ఎమ్మెల్యేగా ప్రకటించారు. 19989లో మొట్టమొదటిసారి గోపాలకృష్ణారెడ్డి టిడిపి అభ్యర్థిగా శ్రీకాళహస్తిలో పోటీ చేశారు. వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. మంత్రి అయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎస్ సి వి నాయుడు గెలుపొందగా, తిరిగి 2009, 2014 ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టిడిపి తరఫున గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు సుధీర్ రెడ్డికి టిడిపి టికెట్ ఇచ్చినా, ఆయన మధుసూదన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో సుధీర్ రెడ్డికే టిడిపి టికెట్ ను ఇచ్చారు. 35 సంవత్సరాలుగా ఓకే కుటుంబానికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు కేటాయిస్తుండటంతో వివిధ పార్టీల రాజకీయ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీని కూడా వీడారు. 35 సంవత్సరాలుగా ఓకే కుటుంబాన్ని ఆదరిస్తే మిగిలిన వారి సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ఎవరికైనా ఎమ్మెల్యే కావాలని ఉంటుందని, తమ అశలు, ఆశయాలను గోపాలకృష్ణారెడ్డి కుటుంబం తొక్కేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనైనా తమకు అవకాశం కనిపించాల్సిందిగా కోరుతున్నారు.
రానున్న ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించింది. అయినా తెలుగుదేశం పార్టీలో నాయకులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 35 సంవత్సరాలుగా ఓకే కుటుంబానికి టికెట్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఉన్న మిగిలిన నాయకుల పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు. బుధవారం శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యేలు ఎస్ సి వి నాయుడు, సత్రవాడ మునిరామయ్యలు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అభ్యర్థి విషయంలో ఒకసారి పునరాలోచించాల్సిందిగా కోరారు. తన సీనియార్టీ, వయసు, ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పరిగణలోకి తీసుకొని పున పరిశీలన చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ముని రామయ్య తో పాటు తమ అనుచర వర్గానికి న్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన హామీ లభించాలని, ప్రస్తుతం జరుగుతున్న అరాచక దోపిడీ పాలనలు భవిష్యత్తులో రాకూడదనిదే తమ అభిమతమని ఎస్ సి వి నాయుడు అన్నారు. తనను ప్రస్తుత అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి కలిసినప్పుడు కూడా తాను స్పష్టంగా చెప్పానని, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి తనకు తన వర్గానికి న్యాయం చేసేలా హామీ పొందాల్సి ఉందని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయం అందరికీ శిరోధార్యం అని అయితే తాను మరోసారి శ్రీకాళహస్తి అభ్యర్థిత్వం పై చంద్రబాబునాయుడు పునః పరిశీలన చేసి, మరోసారి సర్వే చేసి అభ్యర్థిని ఖరారు చేయాలని కోరుతున్నామన్నారు. శ్రీకాళహస్తి సత్యవేడు, తిరుపతి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ప్రకటనపై పార్టీ నాయకులు కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తి నెలకుందని, స్థానిక పరిస్థితులు గందరగోళంగా మారాయిని, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని టిడిపి అధినేత పార్టీలో గెలుపు అవకాశాలు ఎక్కువగా వారికి టికెట్లు ఇచ్చే విధంగా పునః పరిశీలన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
జనసేన తరఫున టికెట్టు ని ఆశించిన కోటా వినిత కూడా బొజ్జల కుటుంబానికి టిక్కెట్టు ఇవ్వడం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. టిక్కెట్టు వచ్చిన రోజు ఆమె నివాసం ముందు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకోవడం మింగుడుపడటం లేదు. ఆమె కూటమితో కలిసి పని చేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆమె పేస్ బుక్ లో ఇలా అన్నారు. నా తుది శ్వాస వరకు నా ప్రయాణం కళ్యాణ్ తోనే , శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలతోనే.. నేను రాజకీయాల్లోకి ఇష్టపడి రాలేదు !! పవన్ కళ్యాణ్ కోరిక మేరకు వచ్చా!! వచ్చాక ప్రజల కష్టాలు ,కన్నీళ్లు చూసి! రాజకీయం కచ్చితంగా మారాలి మార్చి తీరాలనుకున్నా.. రాజకీయం ఒక వర్గంకో, ఒక కులంకో, ఒక కుటుంబానికో పరిమితం కాకూడదు .. ఈ వారసత్వ రాజకీయాలు పోవాలి, పోగొట్టాలి అని వచ్చి నిలబడ్డాం. ఈ పాత వారసత్వ రాజకీయాలను మారుద్దాం అనుకున్నాం !! కానీ ఇప్పుడు మా నియోజకవర్గంలో మళ్లీ అదే జరుగుతుంటే చాలా బాధగా ఉంది. అధినేత పిలుపు కోసం ఎదురుచూస్తా.. అంటూ వివరించారు.
మరో మిత్రపక్షమైన బిజెపి టికెట్ ని ఆశించిన కోలా ఆనంద్ తన వంతు ప్రయత్నాలు ఇంకా చేస్తున్నారు. ఢిల్లీలో మకాం పెట్టి శ్రీకాళహస్తి టికెట్ ను ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి అగ్ర నాయకులు నరేంద్ర మోడీ, అమిత్ షా, వెంకయ్య నాయుడుల చేత సిఫార్సు చేస్తున్నారు. టికెట్టు తనకే వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన ఇంటింటి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈ రెండు వర్గాలు ఒకటిగా కలిసి పనిచేసే పరిస్థితులు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీలోని వర్గాలు కూడా సుదీర్ ను వ్యతిరేకిస్తున్నాయి. అలాగే జనసేన అభ్యర్థికి అసలు మింగుడు పడడం లేదు. బిజెపి వాళ్లు కలిసి రావడం లేదు. ఇలా కూటమి పార్టీలు మూడుముక్కలాట ఆడుతున్నాయి. వీరి మధ్య సయోధ్య కుదరడానికి రాష్ట్రస్థాయి నాయకులు కూడా ఇప్పటివరకు ఏమి ప్రయత్నాలు చేయలేదు. తెలుగుదేశం పార్టీలోని ఎస్సీవీ నాయుడు ఎలాంటి హామీ అధిష్టానం ఇవ్వనందున ఎన్నికలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అలాగే జనసేన నేత వినుత కూడా అధిష్టానం తనకు ఏమి హామీ ఇస్తుందోనని వేచి చూస్తున్నారు. బిజెపి అభ్యర్థి అయితే తనకే టికెట్ వస్తుందని, తన ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ధీమాగా ఉన్నారు. బిజెపి అభ్యర్థి కోలా ఆనంద కు టికెట్ వస్తే టిడిపి, జనసేనలు కూడా కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొజ్జల కుటుంబానికి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.