23, మార్చి 2024, శనివారం

జగన్ ఆదుకుంటారు - బాబు వాడుకుంటారు


జగన్ మోహన్ రెడ్డి నమ్మిన వారిని ఆదుకుంటారని, చంద్రబాబు వాడుకుని వదిలేస్తారని ఉమ్మడి జిల్లాలోని టీడీపీ నేతలు కొందరు అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు సంఘటనలు ఇందుకు తార్కాణంగా చెపుతున్నారు. మంత్రి ఆర్ కె రోజాకు నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నప్పటికీ టికెట్టు ఇచ్చారు. ఆమెకు టికెట్టు ఇస్తే ఓడిస్తామని ఒక వర్గం నాయకులు బహిరంగంగా ప్రకటించారు. అయినా ఆమెకు టికెట్టు ఇచ్చి, వ్యతిరేక వర్గాన్ని సర్దుబాటు చేస్తున్నారు. ఆమెను గెలిపించే బాధ్యత కీలక నేతలకు, అసమ్మతి నేతలకు అప్పగించారు. 


ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామిని ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి వర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయనకు టికెట్టు ఇస్తే పని చేయమని హెచ్చరించారు. అయినా ఆయన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్టు ఇచ్చారు. ఆమెను గెలిపించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అప్పగించారు. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి రంగంలోకి దిగి అసమ్మతి నేతలను కలిసి ఆమె  గెలుపుకు కృషి చేసేలా వప్పించారు. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన రెడ్డికి వ్యతిరేకత ఉన్నప్పటికీ టికెట్టు ఇచ్చారు. ఇలా జిల్లాలో తనను నమ్ముకున్న నేతలు, వారి వారసులకు టికెట్లు ఇచ్చి వారి గెలుపు బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అప్పగించారు. 

చంద్రబాబు తీరు దీనికి భిన్నంగా ఉంది. నిత్యం జిల్లా మంత్రులు, వైసిపి నేతలను విమర్శించే రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డికి మొండి చేయి చూపారు. ఆయన తన కుమారుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డికి నగరి లేదా చంద్రగిరి నియోజక వర్గం టికెట్టు కేటాయించామని కోరారు. 25 ఏళ్ళుగా టిడిపి గెలవని చంద్రగిరి కూడా అయనకు ఇవ్వకుండా తన సామాజిక వర్గానికి చెందిన పులివర్తి నానీకి ఇచ్చారు. అలాగే మరొక చురుకైన అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, తొలినుంచి పార్టీకి కష్టపడుతున్న ఆనగల్లు మునిరత్నంను పక్కన బెట్టి పూతలపట్టు టికెట్టు డాక్టర్ మురళీ మోహన్ కు ఇచ్చారు. తిరుపతిలో జర్నలిస్టుగా ఉన్న ఆయనకు కమ్మ సామాజిక వర్గం నాయకులు కొందరి మద్దతు ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. జీడీ నెల్లూరు టిక్కెట్టు తనకే అని గ్యాస్ రవికి చెప్పి, యువగళం పాదయాత్రలో కోటిన్నర ఖర్చు పెట్టించారు. చివరకు డబ్బు ఉందని క్రిస్టియన్ అయిన థామస్ కు దళితుల టిక్కెట్టును ధారాదత్తం చేశారు. 


తిరుపతి  ఇంచార్జి సుగుణమ్మ ఐదేళ్లు కష్టపడినా ఫలితం లేక పోయింది. ఆమెను పక్కన బెట్టి చిత్తూరు వైసిపి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు జనసేన టికెట్టు కేటాయించారు.  తంబళ్లపల్లె ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ నమ్మకాన్ని వమ్ము చేసి డబ్బు ఒకటే అర్హత అన్నట్టు బీసీ సీటును డి జయచంద్రా రెడ్డికి ఇచ్చారు. పార్టీని నమ్ముకున్న మదనపల్లి ఇంచార్జి దొమ్మలపాటి రమేష్ ను కాదని ఆఖరు నిమిషంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషా కు టికెట్టు ఇచ్చారు. 

పుంగనూరు నియోజక వర్గంలో గట్టి పట్టు వుండి, మంత్రి పెద్దిరెడ్డిని ధీటుగా ఎదుర్కొని, గట్టి పోటీ ఇచ్చిన అనిషా  రెడ్డిని తప్పించి చల్లా రామచంద్రా రెడ్డికి ఇంచార్జి బాధ్యత ఇచ్చారు. ఆయన ఓడిపోతారని తెలిసి టికెట్టు ఇచ్చారు. చంద్రబాబు, రామచంద్రా రెడ్డితో లాలూచీ పడి పుంగనూరు, తంబళ్లపల్లెలో ఊడిపోయే వారికి టికెట్లు ఇచ్చారని బొడే రామచంద్ర యాదవ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. చిత్తూరులో పలువురు నేతలను కాదని డబ్బున్న జగన్ మోహన్ నాయుడును బరిలో దింపారు. చిత్తూరు ఎంపిగా స్థానికులను కాదని ప్రసాద రావుకు టికెట్టు ఇచ్చారు. తిరుపతి ఎంపిగా రెండుసార్లు పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మికి ఎమ్మెల్యే టికెట్టు కూడా ఇవ్వలేదు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *