ధిక్కారమా? రాజీనా? రాజీనామానా? తిరుపతి టీడీపీ నేతల సంఘర్షణ
తిరుపతిలో పరిస్థితులు సర్వం వైసిపి మయం అన్నట్టు ఉన్నాయి. తిరుపతి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఓటర్లు మనసును చంపుకుని జనసేన, బీజేపీ లకు ఓట్లు వేయవలసి వస్తున్నది. మొదటి సారిగా టీడీపీ గుర్తు లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక ముందే వైసీపీ నుండి వచ్చిన అభ్యర్థులకు ఓట్లు వేయాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు ఏ పార్టీ కారణంగా అష్టకష్టాలు పడ్డారో, ఏ పార్టీ కారణంగా కేసులు పెట్టించుకొని జైలు పాలు అయ్యారో, ఆ పార్టీ నుండి వచ్చిన వారికే మద్దతు ఇచ్చి, వారిని గెలిపించుకోవలసిన పరిస్థితి. ఏ పార్టీకి వ్యతిరేకంగా ఇన్నాళ్లు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, బంద్ లు చేశారో ఆ పార్టీలో ఉండిన నాయకులను గెలిపించాలని ప్రచారం చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి స్థానిక టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. పని చేయకుంటే, తమను రాజకీయంగా ఆదరించి, ఎదుగుదలకు, గుర్తింపు రావడానికి కారణమైన పార్టీని దిక్కరించాలి. లేకుంటే, మనసు చంపుకొని వైసీపీ నుండి వచ్చిన వారికి పనిచేయాలి. తిరుపతి టీడీపీ నేతలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. ధిక్కారమా, రాజీనా తేల్చుకోలేక సతమతం అవుతున్నారు. రాజీ పడలేక కొందరు రాజీనామాల గురించి కూడా ఆలోచిస్తున్నారు.
పొత్తులో భాగంగా తిరుపతి లోక్ సభ స్థానం బిజెపికి కేటాయించారు. ఆ పార్టీ అధిష్టానం ఎవరూ దిక్కులేనట్టు వైసిపి తరిమి వేసిన గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాదరావుకు టికెట్టు ఇచ్చారు. ఇక్కడ ఆ పార్టీ టికెట్టు మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభకు ఇస్తారని ప్రచారం జరిగింది. రెండేళ్ల క్రితం జరిగి ఉప ఎన్నికలో ఆమె పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆమె బదులు ఆమె కుమార్తె నీహారికకు ఇస్తారని ప్రచారం జరిగింది. అలాగే డాక్టర్ శ్రీహరిరావు, ముని సుబ్రమణ్య టికెట్టు కోసం ప్రయత్నం చేశారు. అయితే అందరిని కాదని బాజాపా అనూహ్యంగా వరప్రసాద్ రావును బరిలోకి దింపారు. దీనితో స్థానిక టిడిపితో పాటు, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
అలాగే జనసేనకు కేటాయించిన తిరుపతి అసెంబ్లీ టికెట్టు చిత్తూరు వైసిపి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును వరించింది. ఆయనకు వైసిపి చిత్తూరు స్థానం ఇవ్వక పోవడంతో జనసేనలో చేరి టికెట్టు తెచ్చుకున్నారు. దీనితో టిడిపి ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తిరుపతిలో నాయకుడే లేనట్టు చిత్తూరు వైసిపి నేతను దిగుమతి చేసుకోవడం ఏమిటని నిలదీస్తున్నారు. జనసేన పార్టీలో తొలినుంచి పనిచేస్తున్న డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ కు టికెట్టు ఇచ్చి ఉంటే అభ్యంతరం లేదంటున్నారు. టిడిపికి చెందిన సుగుణమ్మ లేదా మరొక స్థానిక నాయకునికి జనసేన టికెట్టు ఇచ్చి ఉంటే గెలుపు అవకాశం ఉందన్న వాదన ఉంది. అలా కాకుండా లోక్ సభ, అసెంబ్లీ స్థానాలలో వైసిపి ఎమ్మెల్యేలు కూటమి అభ్యర్థులు కావడంతో ప్రజలు సహించలేక పోతున్నారు. ఈ రెండు నియోజక వర్గాలలో ఒరిజినల్ వైసిపి వర్సెస్ డూప్లికేట్ వైసిపి నేతల మధ్య పోటీ నెలకొన్నది. దీనితో ఒరిజినల్ అభ్యర్థులు గెలిచినా నష్టం లేదన్న అభిప్రాయం బలపడుతున్నది. ఇప్పుడు తిరుపతిలో నెలకొన్న విచిత్ర పరిస్తితి రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది.
ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం టిడిపి కీలక నాయకులు కొందరు జె బి శ్రీనివాస్ నివాసంలో సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో మనసును చంపుకుని పని చేయాలా లేక స్వతంత్ర అభ్యర్థిని పోటీ పెట్టాలా అన్న అంశం చర్చించారు. రెండు వైపులా వాదనలు జరిగిన తరువాత నిర్ణయం వాయిదా వేశారని తెలిసింది. ఏది ఏమైనా ఇక్కడి పరిస్థితులు పరిశీలిస్తే ఉమ్మడి అభ్యర్థులకు గడ్డు పరిస్థితులు తప్పవని పరిశీలకులు భావిస్తున్నారు.