చంద్రగిరి టీడీపీ టిక్కెట్టు బిసికి కేటాయించాలి
టికెట్టు అడిగితే చంపేస్తానంటున్న నాని !
బిసి నేత రుద్రగోపి సంచలన ఆరోపణ
చంద్రగిరి టిక్కెట్టును బీసీలు ఎవరు అడిగినా, వారిని చంపేస్తానని టీడీపీ చంద్రగిరి ఇంచార్జి పులి వర్తి నాని బెదిరిస్తున్నారని, ఆ పార్టీ బిసి నేత రుద్రగోపి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ నాని వ్యవహార శైలిని ఎండగట్టారు. చిత్తూరు, కడప, నెల్లూరు ఉమ్మడి జిల్లాలలో టిడిపి ఒక స్థానం కూడా బీసీలకు కేటాయించలేదని అవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గం సర్పంచ్ బడి సుధా యాదవ్ కు కేటాయిస్తే మంచిదని తాను సోషియల్ మీడియాలో పోస్టు పెట్టానని తెలిపారు. నియోజక వర్గంలో 1,37,772 మంది బిసిలు ఉన్నందున బిసి అభ్యర్థికి టికెట్టు ఇస్తే గెలుస్తామని చెప్పారు. అయితే టికెట్టు ఆశిస్తున్న నాని తనకు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు. స్కూటర్ లో పోతూ ఉంటే వెనక ట్రిప్పర్ గుద్దిస్తానని బెదిరించారని తెలిపారు. అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన రూరల్ మండల అధ్యక్షుడు తనను భూతులు తిట్టారని చెప్పారు. చంద్రగిరిలో 25 ఏళ్ళుగా టిడిపి గెలవలేదని తెలిపారు. తిరిగి నానికి టికెట్టు ఇస్తే ఓటమి తప్పదన్నారు. నాని బీసీలను చిన్న చూపు చూస్తున్నారని, ఒక మండల కమిటీలో కూడా తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదని అవేదన వ్యక్తం చేశారు.
చంద్రగిరిలో ఓడి పోతే చంద్రబాబు, లోకేష్ పరువు పోతుందని అన్నారు. నాని నాటకాలను, ప్రజలు నమ్మారని, ఆయన పెట్రోలు పోసుకున్న, ఆత్మహత్య చేసుకుంటానని బెడిరించినా ప్రయోజనం లేదన్నారు. బీసీలకు టికెట్టు ఇవ్వకుండా బిసి డిక్లరేషన్ తో లాభం ఏమిటని ప్రశ్నించారు. పేరుకు బీసీల పార్టీ అని చెప్పుకుంటే సరిపోదని, రాజ్యాధికారం కల్పించాలని డిమాండ్ చేశారు. తాను నానీని నమ్మి చాలా నష్ట పోయానని చెప్పారు. మంగళంలో తన ఇల్లు కబ్జాకు గురైందని తెలిపారు. తాను భార్యా పిల్లతో తలదాచుకోవలసి వస్తున్నదని చెప్పారు. చంద్రబాబు తన బాధను అర్దం చేసుకోవాలని రుద్రగోపి కోరారు.