నేటి నుంచి జిల్లాలో ఇంటింటికి తెలుగుదేశం
45 రోజుల పాటు ఇంటింటికీ టీడీపీ శ్రేణులు
ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలకు వివరాలు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. వరుసగా 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, జిల్లా, మండల, గ్రామ, వార్డు స్థాయి నాయకులు, బూత్ కన్వీనర్లు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు విస్తృతంగా పాల్గొననున్నారు. అలాగే కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించనున్నారు.
మొదట ఈ కార్యక్రమాన్ని జూన్ చివరి వారంలో ప్రారంభించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతున్నందున దానికి ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తికావడంతో సోమవారం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు, తల్లికి వందనం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, మహిళా సాధికారత కార్యక్రమాలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మెగా డీఎస్సీ, రైతులకు అందిస్తున్న సాయం, సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రత్యేక కరపత్రాల ద్వారా ప్రజలకు వివరిస్తారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా రూపొందించిన సమాచార పుస్తకాలు, కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, మంజూరైన నిధులు, కొనసాగుతున్న ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను అందులో పొందుపరిచారు. గతంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరలేదనే అభిప్రాయంతో ఈసారి నేరుగా ప్రజల వద్దకే వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించాలని పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వ విజయాలను వివరించడమే కాకుండా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం కూడా ఈ కార్యక్రమంలో కీలక అంశంగా ఉండనుంది. గ్రామాలు, పట్టణాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్, సంక్షేమ పథకాల అమలు, ఇతర స్థానిక సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని నమోదు చేయనున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ప్రజల సూచనలు, అభిప్రాయాలను సేకరించి భవిష్యత్తు కార్యాచరణలో వినియోగించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు వాస్తవాలను ప్రజల ముందుంచడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వ పాలనతో పోల్చితే కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ చర్యలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచే దిశగా కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకోవడం, ప్రభుత్వ పనితీరును వివరించడం, స్థానిక సమస్యలను నమోదు చేయడం ద్వారా ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపడంతో పాటు కూటమి ప్రభుత్వానికి ప్రజా మద్దతును మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోంది.

