జిల్లాలో తగ్గిపోతున్న వేరుశనగ పంట విస్తీర్ణం
ఒకప్పుడు లక్షల హెక్టార్లలో సాగైన వేరుశనగ..
ఐదేళ్లుగా క్రమంగా తగ్గుతున్న సాగు విస్తీర్ణం...
ఇప్పుడు వందల హెక్టార్లకే పరిమితం
ఈ ఏడాది 21,903 హెక్టార్లకు గానూ కేవలం 923 హెక్టార్లు సాగు
సూపర్ ఎల్‌నినో' ప్రభావంతో కుదేలైన ఖరీఫ్..
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచిన వేరుశనగ పంట నేడు మనుగడ కోసం పోరాడుతోంది. అనంతపురం తర్వాత రాష్ట్రంలోనే అత్యధికంగా వేరుశనగ సాగు చేసిన జిల్లాగా పేరొందిన చిత్తూరు ప్రస్తుతం ఆ వైభవాన్ని కోల్పోతోంది. ప్రకృతి వైపరీత్యాలు, వరుస కరవులు, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత, పెరిగిన సాగు వ్యయం, గిట్టుబాటు ధరల లేమి వంటి అనేక కారణాలు కలిసి రైతులను వేరుశనగ సాగుకు దూరం చేస్తున్నాయి. ఈ ఏడాది 'సూపర్ ఎల్‌నినో' ప్రభావంతో జూన్ నెల గడిచినా, జూలై తొలి వారం ముగిసినా ఆశించిన వర్షాలు కురవకపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వ్యవసాయ శాఖ నిర్దేశించిన లక్ష్యాలు కాగితాలకే పరిమితమవుతుండగా, పొలాలు బీడుగా మారుతున్నాయి.
గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో వేరుశనగ సాగు ఏ స్థాయిలో క్షీణించిందో స్పష్టంగా తెలుస్తోంది. 2021-22 ఖరీఫ్‌లో సకాలంలో రుతుపవనాలు రావడంతో జిల్లాలో దాదాపు 1,33,000 హెక్టార్లలో వేరుశనగ సాగు జరిగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండడం, వర్షాలు అనుకూలంగా కురవడం వల్ల మంచి దిగుబడులు కూడా వచ్చాయి. ఆ తర్వాతి ఏడాది 2022-23లో వర్షాలు సాధారణంగానే కురిసినా, కొంతమంది రైతులు వాణిజ్య పంటల వైపు మళ్లడంతో సాగు విస్తీర్ణం 1,25,000 హెక్టార్లకు తగ్గింది. 2023-24లో వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ముందస్తు వర్షాలు లేకపోవడం, నేలలో తేమ తగ్గిపోవడం, పశ్చిమ మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రాంతాల రైతులు ఉద్యాన పంటలు, కూరగాయల సాగు వైపు మొగ్గు చూపారు. దీంతో సాగు విస్తీర్ణం 1,18,000 హెక్టార్లకు పడిపోయింది. 2024-25లో జిల్లా పునర్విభజన ప్రభావంతో పాటు తీవ్రమైన వర్షాభావం, పెరిగిన పెట్టుబడి వ్యయం రైతులను మరింత వెనక్కి నెట్టింది. ఫలితంగా సాగు 1,12,000 హెక్టార్లకే పరిమితమైంది. గత ఏడాది ఖరీఫ్ అయితే జిల్లాలో వేరుశనగ చరిత్రలోనే అత్యంత దుర్భరమైన సీజన్‌గా నిలిచింది. జూన్ నుంచి ఆగస్టు వరకు సరైన వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ శాఖ నిర్దేశించిన సుమారు 35,000 హెక్టార్ల లక్ష్యంలో కనీసం 10 శాతం కూడా సాగు కాలేదు. జూలై చివర్లో వర్షాల ఆశతో వేసిన విత్తనాలు కూడా ఎండిపోయాయి. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలు మిగిలిన కొద్దిపాటి పంటను కూడా దెబ్బతీయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది పరిస్థితి గత ఏడాదికంటే కూడా మరింత ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ శాఖ ఈ ఖరీఫ్‌లో 21,903 హెక్టార్లలో వేరుశనగ సాగు లక్ష్యంగా పెట్టుకోగా, జూలై తొలి వారం నాటికి కేవలం 923 హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది. అంటే లక్ష్యంలో ఐదు శాతం కూడా పూర్తి కాలేదు. వర్షాలు పడతాయో లేదో తెలియని పరిస్థితిలో రైతులు విత్తనాలను నిల్వ ఉంచుకుని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన విత్తనాలు మొలకశక్తిని కోల్పోతాయేమోనన్న ఆందోళన కూడా వారిలో కనిపిస్తోంది. వేరుశనగ సాగు తగ్గిపోవడానికి కేవలం వర్షాభావమే కారణం కాదు. వరుసగా కరవులు రావడం, సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాల అనిశ్చితి పెరగడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, బోర్లు విఫలమవడం, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగాయి. గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి అనేక సమస్యలు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లిస్తున్నాయి. ముఖ్యంగా టమోటా, కూరగాయలు, మామిడి వంటి ఉద్యాన పంటలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.
వేరుశనగతో పాటు సాగయ్యే అంతర పంటల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. 1,779 హెక్టార్లలో సాగు కావాల్సిన కందులు కేవలం 48 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. 1,495 హెక్టార్లలో సాగు కావాల్సిన ఉలవలు ఇప్పటివరకు ఒక్క హెక్టార్‌లో కూడా వేయలేదు. పారుదల కింద సాగయ్యే చెరకు పంట కూడా 6,559 హెక్టార్ల లక్ష్యానికి గానూ 3,938 హెక్టార్లకే పరిమితమైంది. నీటి కొరత కారణంగా చెరకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ ఉత్పత్తి తగ్గిపోవడం ప్రభావం ఇప్పుడు మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలోని నూనె మిల్లులకు స్థానికంగా ముడిసరుకు అందకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వేరుశనగను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వేరుశనగ నూనెతో పాటు ఇతర వంటనూనెల ధరలు కూడా భారీగా పెరిగి సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోంది. ఒకవైపు రైతు పంట సాగు చేయలేక నష్టపోతుంటే, మరోవైపు వినియోగదారుడు అధిక ధరలకు నూనె కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ నిపుణులు మాత్రం ప్రభుత్వం వెంటనే స్పందించాలని సూచిస్తున్నారు. జూలై మధ్య నాటికీ వర్షాలు లేకపోతే తక్కువ కాలంలో పండే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీపై అందించాలని సూచిస్తున్నారు. అలాగే సాగు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ పనిదినాలు కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు ప్రధాన వాణిజ్య పంటగా పేరొందిన వేరుశనగ భవిష్యత్తులో కేవలం జ్ఞాపకంగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

