దద్దరిల్లిన జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం
ఎమ్మెల్యేలు జడ్పీటీసీల మధ్య తీవ్ర వాగ్వివాదం..
కలెక్టర్ జోక్యంతో సద్దుమణిగిన ఉద్రిక్తత
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై జడ్పీ చైర్మన్ తీవ్ర అసంతృప్తి
వేరుశనగ విత్తనాలపై అద్భుతమైన సభ్యులు
చిత్తూరు, జూలై 25 (ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరు జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం శనివారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. అరుపులు, కేకలు వాగ్వివాదాలతో సమావేశం దద్దరిల్లింది. ఒక్కసారిగా జడ్పిటిసి సభ్యులు ఎమ్మెల్యేలను చుట్టుముట్టారు. సవాల్లో ప్రతి సవాళ్లతో సమావేశం రసాబసగా మారింది. పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, పలువురు జడ్పీటీసీ సభ్యుల మధ్య సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలపై తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జోక్యం చేసుకుని సభ్యులను శాంతింపజేశారు. అనంతరం సమావేశం యథావిధిగా కొనసాగింది.
చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని ఎన్టీఆర్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు, తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై చర్చ సందర్భంగా నగరి మండలం బీఎన్‌ఆర్‌పేటలో విలేజ్ హెల్త్ క్లినిక్‌ను స్మశానం సమీపంలో నిర్మిస్తున్నారని, ప్రజలకు అనువైన ప్రదేశంలో భవనం నిర్మించాలని ఒక సభ్యుడు కోరారు. దీనిపై స్పందించిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గత ప్రభుత్వం సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ప్రజల సౌకర్యాన్ని పక్కనపెట్టి ఇష్టానుసారంగా నిర్మించిందని విమర్శించారు. అవసరమైతే ఈ నిర్మాణాలపై కమిటీ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు సిద్ధమని, కమిటీకి అధ్యక్షుడిగా ఉండి నివేదిక అందిచాలని సవాల్ విసిరారు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలని సభ్యులకు సూచించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పలువురు జడ్పీటీసీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన సీటు వద్దకు వెళ్లడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని, వాటిని రాజకీయ కోణంలో విమర్శించడం సరికాదని సభ్యులు వాదించారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగి సమావేశం కొంతసేపు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జోక్యం చేసుకుని సభ్యులను శాంతింపజేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 118 విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి సుమారు రూ.15 కోట్లు మంజూరయ్యాయని, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, ఏడు భవనాలను ప్రారంభించామని తెలిపారు. ప్రజలకు అవసరమైన చోటే మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ప్రజా తీర్పుతో మళ్లీ ప్రజాప్రతినిధులు ఎన్నికై జిల్లా పరిషత్‌లో అడుగుపెట్టాలని వ్యాఖ్యానించారు. సమావేశం ప్రారంభంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల నిధుల విడుదలలో జాప్యం చేస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం చివరి విడత నిధులతో పాటు 16వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులు కూడా విడుదల కాలేదన్నారు. స్థానిక సంస్థల నిధులను ఇతర ప్రాంతాల అభివృద్ధి పనులకు మళ్లించడం సరికాదని, జిల్లా పరిషత్ పరిధిలో ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పనులను ప్రారంభం కాలేదనే కారణంతో రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం సమంజసం కాదన్నారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రారంభమైన పనులను సక్రమంగా నమోదు చేసి రద్దు కాకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు వేరుశనగ విత్తనాల సరఫరాలో తీవ్ర లోపాలు ఉన్నాయని, పంపిణీ చేసిన విత్తనాలు నాసిరకంగా ఉండడంతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా విత్తనాల్లో నాణ్యత లోపించిందని పేర్కొన్నారు. దీనిపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి స్పందిస్తూ ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత విత్తనాల సరఫరాను నిలిపివేశామని, రైతుల నుంచి పూర్తి వివరాలు అందితే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన, విద్య, వైద్య ఆరోగ్య, గ్రామీణ తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం, విద్యుత్, పంచాయతీరాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి నిర్వహణ సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సమావేశం చివర్లో పలు అభివృద్ధి పనులపై తీర్మానాలను ఆమోదించారు.

