20, జులై 2026, సోమవారం

చిత్తూరు సరిహద్దుల నుంచి కోట్ల రూపాయల ఇసుక దందా..


పూనేపల్లి డంప్ వద్ద బట్టబయలైన మాఫియా!

వైసీపీ నేతల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు..

 తమిళనాడు, కర్ణాటకకు యథేచ్ఛగా ఇసుక తరలింపుపై తీవ్ర ఆరోపణలు


(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

 చిత్తూరు జిల్లా నుంచి పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మాఫియా వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. గంగాధర నెల్లూరు మండలం గారంపల్లి గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు గత కొన్ని నెలలుగా భారీ స్థాయిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పూనేపల్లి రైస్‌మిల్ వెనుక భారీ మొత్తంలో ఇసుకను డంప్ చేసి, అక్కడి నుంచి 16 టైర్ల లారీలలో పట్టపగలే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖల పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుక మాఫియా యథేచ్ఛగా వ్యవహరిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ గంగాధర నెల్లూరు ఇన్‌చార్జి విజయానందరెడ్డి తన అనుచరులతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని అక్రమ ఇసుక లోడింగ్‌ను ప్రత్యక్షంగా గుర్తించినట్లు సమాచారం. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని లారీలు, ఇసుక నిల్వలను పరిశీలించారు. అక్రమ రవాణాకు సంబంధించిన ఆధారాలను వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు చూపించినట్లు తెలిసింది. ఘటన సమయంలో ఇసుక రవాణాలో పాల్గొన్న వ్యక్తి విజయానందరెడ్డిని వేడుకుంటూ కనిపించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జిల్లాలో రాజకీయ చర్చకు దారితీసింది. చిత్తూరు జిల్లా భౌగోళిక పరిస్థితులు ఇసుక మాఫియాకు అనుకూలంగా మారాయని స్థానికులు చెబుతున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండటంతో ఇక్కడి పాలారు, బాహుదా, అరణియారు, కుశస్థలి తదితర నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలించడం సులభంగా మారిందని అంటున్నారు. ముందుగా గ్రామాల సమీపంలో లేదా రైస్‌మిల్లులు, ఖాళీ స్థలాల్లో ఇసుకను డంప్ చేసి, ఆ తర్వాత రాత్రివేళలతో పాటు ఇటీవల పగటి పూట కూడా భారీ లారీల్లో సరిహద్దులు దాటిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెన్నై, చెంగల్పట్టు, వేలూరు, ధర్మపురి, సేలం, బెంగళూరు ప్రాంతాల్లో నిర్మాణ రంగానికి ఇసుకకు భారీ డిమాండ్ ఉండటంతో చిత్తూరు జిల్లా అక్రమ రవాణాదారులకు ప్రధాన కేంద్రంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. స్థానికంగా తక్కువ ధరకు లభించే ఇసుకను సరిహద్దు దాటించిన తర్వాత నాలుగు నుంచి ఐదు రెట్లు అధిక ధరలకు విక్రయించడం ద్వారా కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నట్లు సమాచారం. అందుకే అక్రమ రవాణాలో పాల్గొనే ముఠాలు జరిమానాలు పడినా వెనక్కి తగ్గకుండా అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక మాఫియా అక్రమ రవాణా కోసం పలు కొత్త మార్గాలను కూడా అనుసరిస్తోందని సమాచారం. ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులను తప్పించేందుకు గ్రామీణ రహదారులు, అటవీ మార్గాలను వినియోగించడం, ముందుగా డంప్ యార్డులు ఏర్పాటు చేయడం, ఒకే అనుమతిని పలుమార్లు వినియోగించడం, కొన్నిచోట్ల నకిలీ పత్రాలతో రవాణా నిర్వహించడం వంటి పద్ధతులు అమలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తనిఖీలకు బయలుదేరిన సమాచారం ముందుగానే అందుకునేలా ప్రత్యేక సమాచార వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నదీ గర్భాల్లో విచక్షణారహితంగా ఇసుక తవ్వడంతో భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోతోంది. గంగాధర నెల్లూరు, ఐరాల, బంగారుపాళ్యం, తవణంపల్లె తదితర మండలాల్లో బోర్లు ఎండిపోవడం, వ్యవసాయానికి నీటి కొరత ఏర్పడటం వంటి సమస్యలు తీవ్రతరం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధిక లోడుతో వెళ్లే లారీల కారణంగా గ్రామీణ రహదారులు పూర్తిగా ధ్వంసమవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూనేపల్లి వద్ద భారీగా ఇసుక నిల్వలు ఏర్పాటు చేసి బహిరంగంగానే లారీల్లో తరలిస్తున్నా సంబంధిత శాఖలకు ఎలా తెలియలేదన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య సమన్వయ లోపమా, లేక రాజకీయ అండదండలతోనే ఈ అక్రమ రవాణా కొనసాగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి ఇసుక ఎక్కడి నుంచి తవ్వారు, ఎంత మేరకు అక్రమంగా తరలించారు, ఇందులో ఎవరి ప్రమేయం ఉంది, ప్రభుత్వానికి ఎంత మేర ఆదాయ నష్టం వాటిల్లింది, అధికారుల నిర్లక్ష్యం ఉందా లేదా అనే అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సాగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, సరిహద్దు ప్రాంతాల్లో 24 గంటల నిఘా, చెక్‌పోస్టుల బలోపేతం, డంప్ యార్డులపై నిరంతర తనిఖీలు నిర్వహించినప్పుడే ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు..

కొసమెరుపు

పూనే పల్లి దగ్గర అక్రమ ఇసుక డంపులను వైసీపీ నాయకులు కనుగొని పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ విషయమై పోలీసులు ఎటువంటి కేసును నమోదు చేయలేదు. ఇసుక డంపుల విషయం మైనింగ్ అధికారులకు సమాచారం అందజేశామని, ఆ విషయమై వారు చర్యలు తీసుకుంటారని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ విషయమై వైసీపీ నేత విద్యానంద రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి, మైనింగ్ విభాగానికి స్వాధీనం చేయాల్సి ఉందని అయితే పోలీసులు ఇటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసుల వైఖరిని ఆయన తప్పుపట్టారు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *