2, జులై 2026, గురువారం

తోతాపురి మామిడి రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్


మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకానికి కేంద్ర ఆమోదం

2.16 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికి ధర వ్యత్యాస చెల్లింపు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం భారం

(…చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో )

తోతాపురి మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 2026–27 మామిడి మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (ఎంఐఎస్) కింద ధర వ్యత్యాస చెల్లింపు అమలుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లాలో ఒకటిన్నర లక్షల ఎకరాలలో మామిడి తోటలు ఉన్నాయి. ఈసారి సుమారుగా నాలుగు లక్షల టన్నుల దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా మామిడి పల్ప్ ఎగుమతులు ఆగిపోవడంతో జిల్లాలో మామిడికాయలను కొనుగోలు చేయడానికి గుజ్జు ఫ్యాక్టరీలు ఆసక్తి చూపడం లేదు. మామిడి దిగుబడి తగ్గినా కిలోకి నాలుగు నుంచి ఆరు రూపాయలు చెల్లిస్తున్నారు. రాంపులలో మూడు నుంచి నాలుగు రూపాయలు పలుకుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. మామిడి రైతులను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు సానుకూలంగా స్పందించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం దామాషాలో రైతులకు మద్దతు ధరను అందజేయనున్నాయి.


ఈ మేరకు జూలై 1న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలో ఈ సీజన్‌లో అంచనా వేసిన 8.65 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడి ఉత్పత్తిలో 25 శాతం, అంటే 2,16,250 మెట్రిక్ టన్నుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. రైతులకు కనీస ఆదాయం అందేలా క్వింటాల్‌కు రూ.1,747 మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర (ఎంఐపీ) నిర్ణయించింది. మామిడి విక్రయ ధరను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ నిర్ణయిస్తుంది. వ్యవసాయ, ఉద్యాన, సహకార శాఖల ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరకు, రైతు పొందిన విక్రయ ధరకు మధ్య ఉన్న తేడాలో గరిష్ఠంగా ఎంఐపీ విలువలో 25 శాతం వరకు ధర వ్యత్యాసాన్ని రైతులకు చెల్లించనున్నారు. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే రైతులు తమ తోతపురి మామిడిని రాష్ట్రంలోని నోటిఫై చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డుల (ఏపీఎంసీ మండీలు) ద్వారానే విక్రయించాల్సి ఉంటుంది. ఉత్తర్వులు జారీ అయిన తర్వాత తొలి లావాదేవీ నుంచి ఒక నెలపాటు ఈ పథకం అమల్లో ఉంటుంది. ధర వ్యత్యాస చెల్లింపుల వల్ల వచ్చే ఆర్థిక భారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెరో 50 శాతం చొప్పున భరిస్తాయి. ధరల నిర్ణయానికి రాష్ట్ర పోర్టల్‌లో నమోదయ్యే మార్కెట్ ధరలనే ప్రామాణికంగా తీసుకుంటారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సమకూర్చి, అనంతరం కేంద్రానికి లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. కేంద్రం పరిశీలన అనంతరం తన వాటాను రాష్ట్రానికి తిరిగి చెల్లిస్తుంది. రైతులకు చెల్లింపులు ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల ద్వారా నేరుగా (డీబీటీ) జమ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజూ మార్కెట్‌కు వచ్చిన మామిడి పరిమాణం, మోడల్ ధర వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖకు పంపాల్సి ఉంటుంది. అమలు పూర్తయిన తర్వాత పూర్తి లెక్కలు, సంబంధిత పత్రాలు సమర్పించిన అనంతరం మాత్రమే కేంద్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేయనుంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వేలాది తోతపురి మామిడి రైతులు ఈ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారు. ఇటీవల ధరలు తీవ్రంగా పడిపోవడంతో నష్టాలు చవిచూసిన రైతులకు ఈ పథకం ద్వారా కొంత మేర ఆర్థిక ఉపశమనం లభించే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *