తల్లికి వందనం పథకానికి రూ.10,120.78 కోట్లతో అనుమతి
67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
42.70 లక్షల మంది తల్లులు, సంరక్షకులకు ఆర్థిక సాయం
జూలై 22న తొలి విడత నగదు జమ
ఆగస్టు 30న అదనపు అర్హులకు చెల్లింపులు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకాన్ని 2026–27 విద్యా సంవత్సరానికి కొనసాగిస్త రూ.10,120.78 కోట్ల పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జీవో ఎంఎస్ నెం.16ను గురువారం విడుదల చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులు, 42,70,802 మంది అర్హులైన తల్లులు లేదా సంరక్షకులు ప్రయోజనం పొందనున్నారు.
ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా, అర్హత ఉంటే ప్రతి విద్యార్థికి ఈ సాయం వర్తిస్తుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం విద్యార్థుల నమోదు పెంచడం, మధ్యలో చదువు మానివేయకుండా నిరోధించడం, తల్లులను పిల్లల విద్యలో మరింత భాగస్వాములను చేయడం, నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రతి విద్యార్థికి మంజూరు చేసే రూ.15,000లో రూ.2,000ను మూలంలోనే మినహాయించి, పాఠశాలలు, జూనియర్ కళాశాలల నిర్వహణ, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధి తదితర విద్యా అవసరాల కోసం వినియోగించనున్నారు. దీనికి సంబంధించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్‌ఓపీ) పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా జారీ చేయనుంది. ప్రస్తుతం ధృవీకరణ పూర్తయిన 64,76,590 మంది విద్యార్థులకు జూలై 22న తొలి విడతగా ఆర్థిక సాయం వారి ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అదే రోజున అర్హులు, అనర్హుల జాబితాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. జూలై 22 నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించి, ఆగస్టు 4 నుంచి 10 వరకు వాటిని పరిశీలించి అర్హుల తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఇక ఆగస్టు 25 వరకు మొదటి తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్‌లో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఆగస్టు 30న అదనపు అర్హుల జాబితా విడుదల చేసి, అదే రోజు వారికి కూడా ఆర్థిక సాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే, ఆర్టీఈ చట్టం-2009లోని సెక్షన్ 12(1)(సి) కింద ప్రైవేట్ పాఠశాలల్లో చేరిన 1,04,046 మంది విద్యార్థుల విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును సంబంధిత మొత్తంలో నుంచి మినహాయించి మిగిలిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తారు. కేంద్ర ప్రాయోజిత ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధిత శాఖల ద్వారా స్కాలర్‌షిప్‌లు అందజేసి, మిగిలిన మొత్తాన్ని తల్లికి వందనం పథకం కింద విడుదల చేయాలని జీవోలో పేర్కొన్నారు. పథకం అమలులో పారదర్శకత కోసం ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ, సమగ్ర శిక్ష, స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు శాఖ, సంబంధిత సంక్షేమ శాఖల కార్పొరేషన్లు, జిల్లా కలెక్టర్లు పరస్పర సమన్వయంతో పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

