కుప్పంలో పారిశ్రామిక విప్లవం..
కుప్పంలో పారిశ్రామిక విప్లవం..
రూ.1,002 కోట్లతో రెండు మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
1,480 మందికి ప్రత్యక్ష ఉపాధి
చిత్తూరు,ఆంధ్రప్రభ బ్యూరో : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించిన కుప్పం నియోజకవర్గం పారిశ్రామిక అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కుప్పాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వరుసగా భారీ పరిశ్రమలను ఆకర్షిస్తోంది. తాజాగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో కుప్పం ప్రాంతానికి సంబంధించి రెండు భారీ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఆమోదం లభించింది. గుడిపల్లె మండలం బీసంతంలో రూ.216 కోట్లతో అత్యాధునిక చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, కుప్పంలో రూ.786.15 కోట్లతో ప్రపంచ స్థాయి డెయిరీ న్యూట్రీషన్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం రూ.1,002.15 కోట్ల పెట్టుబడులు కుప్పం ప్రాంతానికి రానున్నాయి. ఈ రెండు పరిశ్రమల ద్వారా 1,480 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించడమే కాకుండా వేలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, వేగవంతమైన అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రత్యేక ప్రోత్సాహకాల కారణంగా దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితమవుతున్నాయి. అందులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పారిశ్రామిక పెట్టుబడులు వరుసగా వస్తున్నాయి. ప్రతి కుప్పం పర్యటనలో కొత్త పరిశ్రమలకు శంకుస్థాపనలు, ఒప్పందాలు, పెట్టుబడుల ప్రకటనలు చేస్తూ ఈ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశంలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గుడిపల్లె మండలం బీసంతంలో న్యూట్రి ఫీడ్స్ అండ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.216 కోట్లతో అత్యాధునిక చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 480 మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. చిత్తూరు జిల్లాలో పౌల్ట్రీ రంగానికి ఇది కీలక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. కోళ్ల పెంపక రైతులకు నేరుగా మార్కెట్ లభించడం, ఉత్పత్తులకు మెరుగైన ధరలు దక్కడం, రవాణా వ్యయాలు తగ్గడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవకాశాలు పెరగడం వంటి ప్రయోజనాలు ఈ యూనిట్ ద్వారా కలగనున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ–2024–29 కింద రూ.83.49 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహకాలను మంజూరు చేసింది. మూలధన సబ్సిడీ, విద్యుత్ రాయితీలు, ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్, ఉపాధి సబ్సిడీ వంటి ప్రోత్సాహకాలను ఐదేళ్ల కాలంలో దశలవారీగా అందించనుంది. దీంతో పెట్టుబడిదారులకు ప్రోత్సాహం లభించడంతో పాటు రాష్ట్రంలో మరిన్ని ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు కావడానికి అవకాశం ఏర్పడనుంది. మరోవైపు కుప్పంలో రూ.786.15 కోట్ల భారీ పెట్టుబడితో ఏసీఈ ఇంటర్నెషనల్ లిమిటెడ్ ప్రపంచ స్థాయి డెయిరీ న్యూట్రీషన్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఉత్తరప్రదేశ్‌లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన ఈ సంస్థ ప్రస్తుతం రోజుకు 5 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తోంది. ఇప్పుడు అదే అత్యాధునిక సాంకేతికతను కుప్పానికి తీసుకురానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా, పాల సేకరణ, రవాణా, ప్యాకేజింగ్, పంపిణీ, అనుబంధ సేవల ద్వారా మరెందరో ఉపాధి పొందే అవకాశం ఉంది. ఈ ప్లాంట్‌లో శిశు పోషకాహార ఉత్పత్తులు, స్పోర్ట్స్ న్యూట్రీషన్, మెడికల్ న్యూట్రీషన్ ఉత్పత్తులు, వే ప్రొటీన్, పాల పొడి, నెయ్యి, బటర్ ఫ్యాట్, ప్రత్యేక పోషకాహార మిశ్రమాలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో కూడిన అధిక విలువ కలిగిన ఉత్పత్తులను తయారు చేయనున్నారు. ప్రపంచ ఆహార, పోషకాహార కంపెనీలకు అవసరమైన ప్రత్యేక న్యూట్రీషన్ ఇంగ్రిడియెంట్స్‌ను కూడా ఇక్కడే తయారు చేసి సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్న ఈ సంస్థ భవిష్యత్తులో దక్షిణాసియా, ఆఫ్రికా, అమెరికా దేశాలకు తన మార్కెట్‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమ ఇప్పటికే బలంగా ఉండటం, పెద్ద ఎత్తున పాల ఉత్పత్తి జరగడం, వ్యవసాయ ఆధారిత ముడి పదార్థాలు సమృద్ధిగా లభించడం, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు సమీపంలో ఉండటం, జాతీయ రహదారులు, రైల్వే, పోర్టులకు అనుసంధానం ఉండటం వంటి అంశాలు ఈ ప్రాంతాన్ని పరిశ్రమలకు అనువైన కేంద్రంగా మార్చాయి. ఈ నేపథ్యంలోనే సంస్థలు కుప్పాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే స్థానిక రైతులకు స్థిరమైన మార్కెట్ ఏర్పడుతుంది. పౌల్ట్రీ రైతులకు చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, పాల ఉత్పత్తిదారులకు డెయిరీ న్యూట్రీషన్ ప్లాంట్ ద్వారా నేరుగా లాభం చేకూరనుంది. అదే సమయంలో కోల్డ్ స్టోరేజీలు, రవాణా, ప్యాకేజింగ్, గిడ్డంగులు, ఫీడ్ తయారీ, లాజిస్టిక్స్ వంటి అనుబంధ రంగాల్లో కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా ఈ రెండు మెగా ప్రాజెక్టులు ఊతమివ్వనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉపాధి కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో చేపడుతున్న చర్యలు క్రమంగా ఫలితాలిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు ప్రకటించబడగా, తాజాగా ఆహార ప్రాసెసింగ్ రంగంలో రూ.1,002.15 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించడం ద్వారా కుప్పం దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు న్యూట్రీషన్ తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశాలు మరింత బలపడ్డాయి. ఈ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత స్థానిక ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవడంతో పాటు, చిత్తూరు జిల్లా పారిశ్రామిక ప్రగతిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

