ఆరు దశాబ్దాల కంగుంది భూ వివాదానికి తెర
130 దేవాలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
322 మంది రైతులకు డీకేటీ పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
కుప్పం, జూలై 4 (ఆంధ్రప్రభ) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో చేపట్టనున్న 130 దేవాలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కంగుందిలో నిర్వహించిన డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన రైతులకు పట్టాలు అందజేశారు. ఉదయం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కంగుంది గ్రామానికి చేరుకోగా గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో చేపట్టనున్న 130 దేవాలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కంగుండిలో నిర్వహించిన డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన రైతులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆరు దశాబ్దాలుగా న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుని వేలాది మంది రైతులను ఆందోళనకు గురిచేసిన కంగుండి భూముల సమస్యకు కూటమి ప్రభుత్వం చట్టబద్ధ పరిష్కారం చూపిందన్నారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతులకు భూమిపై చట్టబద్ధ హక్కు కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు భద్రత, గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. కంగుంది భూములపై 1960ల నుంచే న్యాయ వివాదాలు కొనసాగుతున్నాయి. కంగుండి సంస్థానానికి చెందిన కె.జె. రామప్పనాయుడు రయిత్వారీ పట్టాల కోసం దరఖాస్తు చేయగా, అనంతరం పలువురు వ్యక్తులు, అటవీ శాఖ, ప్రభుత్వం వివిధ దశల్లో అప్పీలు, రిట్ పిటిషన్లు దాఖలు చేశాయి. జిల్లా న్యాయస్థానం, ఎస్టేట్స్ అబాలిషన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సెటిల్‌మెంట్ అధికారులు, భూ పరిపాలన శాఖ కమిషనర్ స్థాయిల్లో విచారణలు సాగాయి. చివరకు ప్రభుత్వ భూములపై సాగు చేస్తున్న అర్హులైన పేదలకు డీకేటీ పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామసభలు నిర్వహించి స్థానిక ప్రజల అభిప్రాయాలు సేకరించారు. సర్వే బృందాలు భూములపై ప్రత్యక్ష పరిశీలన నిర్వహించి సాగు కాలం, ఆక్రమణ స్థితి, అర్హతలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి. అనంతరం ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్. నం.391 ద్వారా 529.34 ఎకరాల ప్రభుత్వ భూమి వర్గీకరణను అడవి పోరంబోకు నుంచి అసెస్డ్ వేస్ట్ డ్రైగా మార్చేందుకు అనుమతి ఇచ్చింది. బీఎస్‌వో–15 నిబంధనల ప్రకారం అర్హులైన సాగుదారులకు డీకేటీ పట్టాలు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు రికార్డుల్లో అవసరమైన మార్పులు పూర్తి చేసి అర్హుల జాబితాను సిద్ధం చేశారు. తుది పరిశీలన అనంతరం మొత్తం 460.19 ఎకరాల భూమిని అర్హులైన రైతులకు కేటాయించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి 322 మంది రైతులకు డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. వీరిలో 253 మంది బీసీ, 10 మంది ఓసీ, 13 మంది ఎస్సీ, 46 మంది ఎస్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు. భూముల వివరాల ప్రకారం కుప్పం మండలంలోని కంగుండి రిజర్వు అటవీ ప్రాంతంలో 441.86 ఎకరాలు, రామకుప్పం మండలంలోని జోవుకుప్పల్లిలో 18.33 ఎకరాలు అర్హులైన సాగుదారులకు కేటాయించారు. అర్హతల పరిశీలనలో 18 మంది అనర్హులుగా తేలగా, 38.61 ఎకరాలను వారికి కేటాయించలేదు. మరో 30.53 ఎకరాలను సామూహిక అవసరాల కోసం కేటాయించారు. అనర్హులుగా తేలిన వారిలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, ఐదు ఎకరాలకు పైగా భూమి కలిగిన కుటుంబాలు, రాష్ట్రానికి చెందని వ్యక్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భూముల వివాదానికి తెరపడడంతో దశాబ్దాలుగా సాగు చేస్తున్న వందలాది రైతు కుటుంబాలకు భూమిపై శాశ్వత హక్కు లభించిందని, ఇది కుప్పం ప్రాంత చరిత్రలో కీలక ఘట్టంగా నిలుస్తుందని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆర్టీసీ ఉపాధ్యక్షుడు మునిరత్నం, జిల్లా ఇన్చార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దర్గమల్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

