మామిడి రైతు కన్నీరు... ఆందోళన బాటలో రైతన్న
మామిడి రైతు కన్నీరు... ఆందోళన బాటలో రైతన్న
ధరల కోత.. టోకెన్ల అవ్యవస్థ..
రోజుల తరబడి ట్రాక్టర్లతో నిరీక్షణ
గంగాధర నెల్లూరు, గుడిపాలలో రైతుల ఆందోళనలు..
ఫ్యాక్టరీలపై ఎమ్మెల్యే హెచ్చరిక
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ఒకవైపు ప్రభుత్వం సూచించిన ధరలు అమలు కాకపోవడం, మరోవైపు మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద టోకెన్ల అవ్యవస్థ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ట్రాక్టర్లలోనే మామిడి లోడ్లతో ఫ్యాక్టరీల ఎదుట వేచి ఉండాల్సి వస్తుండగా, అప్పటికే కాయలు మాగిపోవడంతో బరువు తగ్గి రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు.
గంగాధర నెల్లూరు, గుడిపాల, బంగారుపాళ్యం ప్రాంతాల్లోని పలు ఫ్యాక్టరీల ఎదుట వందలాది ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. ముందస్తు టోకెన్ల విధానం లేకపోవడంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో రైతులు రావడం వల్ల లోడ్లను ఖాళీ చేయడానికి నాలుగు నుంచి ఐదు రోజులు పడుతోంది. ఒక ట్రాక్టర్ మామిడి రవాణాకు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు ఖర్చవుతుండగా, వేచి ఉండేందుకు రోజుకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈలోపు మామిడి కాయలు కుళ్లిపోవడంతో రైతులు రెండింతల నష్టాన్ని భరిస్తున్నారు. దీనికి భిన్నంగా ఐరాల, తవణంపల్లి, పూతలపట్టు ప్రాంతాల్లోని కొన్ని ఫ్యాక్టరీలు రోజువారీ టోకెన్లను పరిమిత సంఖ్యలో జారీ చేస్తుండటంతో రైతులు ఒకటి లేదా రెండు రోజుల్లోనే లోడ్లను ఖాళీ చేసుకుని వెళ్తున్నారు. ఇదే విధానాన్ని అన్ని ఫ్యాక్టరీల్లో అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. శనివారం గంగాధర నెల్లూరులోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ తోతాపురి మామిడికి కిలో రూ.5 మాత్రమే చెల్లిస్తామని బోర్డు ఏర్పాటు చేయడంతో రైతుల ఆగ్రహం చెలరేగింది. వందలాది మంది రైతులు ఫ్యాక్టరీ ఎదుట ధర్నాకు దిగడంతో పాటు చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మామిడి రైతు సంఘ నాయకుడు హరిబాబు చౌదరి నాలుగు రోజులుగా నిలిపివేయడంతో సగానికి పైగా కుళ్లిపోయిన రెండు ట్రాక్టర్ల మామిడిని ఫ్యాక్టరీ గేటు ఎదుటే పారబోసి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులు ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గుడిపాల మండలం 189 కొత్తపల్లి సమీపంలోని తాసా జ్యూస్ ఫ్యాక్టరీ కూడా తోతాపురి కొనుగోళ్లను నిలిపివేసి కిలోకు రూ.4 మాత్రమే చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సూచించిన విధంగా కనీసం రూ.6 చెల్లిస్తూ కొనుగోళ్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద ఎమ్మార్వోలు, ఎంపీడీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించినప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. టోకెన్ల జారీ, కొనుగోళ్ల నిర్వహణపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ బంగారుపాళ్యం మండలంలోని సన్ గోల్డ్ మామిడి గుజ్జు పరిశ్రమను ఆకస్మికంగా తనిఖీ చేశారు. టోకెన్ల పేరుతో అక్రమాలు జరిగితే, రైతులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫ్యాక్టరీ యాజమాన్యాలను హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస ధర రైతులకు తప్పనిసరిగా అందేలా చూడాలని స్పష్టం చేశారు. జిల్లాలో వేలాది మంది రైతులు తోతాపురి మామిడి సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలో ధరల కోత, కొనుగోళ్లలో జాప్యం, టోకెన్ల అవ్యవస్థ రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. అన్ని ఫ్యాక్టరీల్లో పారదర్శక టోకెన్ విధానాన్ని అమలు చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

