24, జులై 2026, శుక్రవారం

22-ఏ నిషేధిత భూముల జాబితాపై సమగ్ర మార్గదర్శకాలు


భూ యజమానికి ముందుగా నోటీసు.. విచారణ

 అనంతరమే నిషేధిత జాబితాలో చేర్పు.. 

రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.444 జారీ

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: భూముల నమోదుకు సంబంధించిన వివాదాలకు తెరదించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిషేధిత భూముల జాబితా నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ జీవో ఎంఎస్ నెం.444ను ఈ నెల 22వ తేదీన జారీ చేసింది. రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని 22-ఏ సెక్షన్ కింద నిషేధిత భూముల జాబితా నిర్వహణకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను ఇందులో పొందుపరిచింది. ఇప్పటివరకు అమలులో ఉన్న వివిధ ప్రభుత్వ ఉత్తర్వులు, శాఖాపరమైన ఆదేశాలు, ప్రభుత్వ మెమోలు, ఉన్నత న్యాయస్థాన తీర్పులను సమన్వయం చేసి ఒకే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ భూములు, దేవాదాయ సంస్థల భూములు, మత, ధార్మిక సంస్థల ఆస్తులు, వక్ఫ్ బోర్డు భూములు, భూ పరిమితి చట్టం కింద ప్రభుత్వానికి సంక్రమించిన మిగులు భూములు, ప్రభుత్వం నిషేధితంగా ప్రకటించిన ఇతర భూములను 22-ఏ జాబితాలో చేర్చే విధానాన్ని ఈ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ భూములు అక్రమంగా అమ్మకాలు, కొనుగోళ్లు, నమోదు కాకుండా ఉండేందుకు ఈ చట్టం అమల్లో ఉందని ప్రభుత్వం వివరించింది. ఇకపై ఏ భూమినైనా నిషేధిత భూముల జాబితాలో చేర్చే ముందు సంబంధిత భూ యజమానికి తప్పనిసరిగా నోటీసు ఇవ్వాలని జీవోలో స్పష్టం చేశారు. అనంతరం ఆయన లేదా ఆమె నుంచి అభ్యంతరాలు, వివరణలు స్వీకరించి పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాలి. విచారణలో లభించిన ఆధారాల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ లేకుండా భూములను నిషేధిత జాబితాలో చేర్చరాదని ఆదేశించారు. దీంతో సహజ న్యాయం సూత్రాలు అమలవుతాయని ప్రభుత్వం పేర్కొంది. నిషేధిత భూముల జాబితాలో భూములను చేర్చడం లేదా తొలగించడం వంటి అంశాల్లో రెవెన్యూ అధికారుల బాధ్యతలను కూడా ఈ జీవోలో స్పష్టంగా నిర్దేశించారు. తహసీల్దార్ల స్థాయిలో కాకుండా రెవెన్యూ విభాగ అధికారి లేదా ఉప కలెక్టర్ స్థాయిలో తుది నిర్ణయం తీసుకునే విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో సంయుక్త కలెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత భూముల వివరాలను ఒకే విధంగా నమోదు చేసేలా ఏకీకృత డిజిటల్ సమాచార భాండాగారాన్ని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో ఒకే విధమైన విధానాన్ని అనుసరించడం ద్వారా భూముల నమోదులో తలెత్తుతున్న భిన్నాభిప్రాయాలు, గందరగోళానికి చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. గతంలో పొరపాటున నిషేధిత జాబితాలో చేరిన వ్యక్తిగత భూములను పునఃసమీక్షించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి, అర్హత ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని జీవోలో పేర్కొన్నారు. దీనివల్ల అనేక మంది భూ యజమానులకు ఉపశమనం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ జీవో అమలుతో భూముల నమోదులో పారదర్శకత పెరగడంతో పాటు, ప్రజలకు న్యాయం జరిగేలా వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అలాగే రెవెన్యూ శాఖ, నమోదుల శాఖల మధ్య సమన్వయం మెరుగుపడి, భూ లావాదేవీలు వేగవంతంగా, వివాదరహితంగా జరిగే అవకాశాలు పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *