31, జులై 2026, శుక్రవారం

ఉల్లాసంగా సాగిన నారా భువనేశ్వరి పర్యటన

అడుగడుగునా కుప్పం ప్రజల అపూర్వ ఆదరణ 

మెగా డిఎస్సిలో అవకతవకలు జరగలేదని స్పష్టీకరణ 

వైసిపి వాళ్ళు వక్తిగత హననానికి పాల్పడ్డారని ఆవేదన

తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి నాలుగు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన పర్యటన ప్రజల ఆదరణ, కార్యకర్తల ఉత్సాహం, మహిళల భాగస్వామ్యం మధ్య ఆహ్లాదకర వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. జూలై 27 నుంచి 30 వరకు రామకుప్పం, గుడుపల్లి, కుప్పం మండలాలతో పాటు పలు గ్రామాలు, తండాలు, ఆలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రి, హార్టికల్చర్ హబ్‌లను సందర్శిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించడం, మహిళలతో ముఖాముఖి, విద్యార్థులతో ఆత్మీయ సంభాషణలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, ఆలయ దర్శనాలు, మొక్కల నాటకం, సేవా కార్యక్రమాలతో ఆమె పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నాలుగు రోజుల పర్యటనలో మహిళా సాధికారత, యువతకు ఉపాధి, విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, సేవా కార్యక్రమాలు, కుప్పం అభివృద్ధి ప్రధానాంశాలుగా నిలిచాయి. ఈ పర్యటన షెడ్యూల్‌లో ప్రజలతో సమావేశాలు, మహిళలతో పరస్పర చర్చలు, విద్యార్థులతో కార్యక్రమాలు, ఆలయ దర్శనాలు, సేవా కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.  

పర్యటన ప్రారంభం నుంచే ప్రతి గ్రామంలో భువనేశ్వరికి మహిళలు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. నిజం గెలవాలి యాత్రలో చూపిన ప్రేమను జీవితాంతం మర్చిపోలేనని, కుప్పం ప్రజల ఆదరణ తమ కుటుంబానికి ఎంతో బలమని ఆమె పలుమార్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఆయన బిజీగా ఉండటంతో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తాను వచ్చానని వివరించారు. రామకుప్పం మండలంలోని ననియాల, పీఎంకే తండా, పండ్యాలమడుగు తదితర ప్రాంతాల్లో మహిళలతో సమావేశమై స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబనపై ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు. చేయలేను అనే భావనను విడిచిపెట్టి ధైర్యంగా ముందడుగు వేస్తే మహిళలు ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ద్వారా శిక్షణ పొంది ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కుప్పం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని, ఒకేసారి 30 పరిశ్రమలు తీసుకువచ్చి వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఎకో టూరిజం అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించి జింకల పార్కు, జంగిల్ హట్ రిసార్ట్, చిన్నారుల వినోద కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారని వివరించారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకువచ్చి దశాబ్దాల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని, ప్రస్తుతం వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని, చెరువులు నిండుతున్నాయని చెప్పారు. రెండో రోజు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో స్విమ్స్ ఆధ్వర్యంలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్‌ను ప్రారంభించి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. క్యాన్సర్‌పై ముందస్తు పరీక్షలు, అవగాహన ఎంతో అవసరమని, తలసేమియా బాధిత పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉచిత రక్తం అందిస్తోందని చెప్పారు. అనంతరం పీఈఎస్ వైద్య కళాశాలలో విద్యార్థులతో క్విజ్ కార్యక్రమంలో పాల్గొని క్రమశిక్షణ, పుస్తక పఠనం, తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడం వంటి విలువలను వివరించారు. జీవితంలో వైఫల్యాలు అంతిమం కాదని, నిరంతర కృషితోనే విజయాలు సాధ్యమవుతాయని యువతకు సూచించారు. గుడుపల్లి మండలంలో విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి వారితో ఫొటోలు దిగారు. అగరం వేణుగోపాలస్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ సుజల వాటర్ ట్యాంకును ప్రారంభించి గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని అందించారు. వసనాడులో మహిళలతో సమావేశమై రైతులు కొత్త పంట విధానాలు అవలంబించాలని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. జడ్పీ పాఠశాలలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించారు. పాఠశాలకు అవసరమైన మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్, ఇతర సౌకర్యాల కోసం తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. యామగానపల్లి ద్రౌపది అమ్మవారి ఆలయ సందర్శన సందర్భంగా చేసిన ప్రసంగం పర్యటనలో అత్యంత చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో తనపై జరిగిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ, నేను ఎలాంటి వ్యక్తినో నా భర్తకు, ప్రజలకు తెలుసు. నన్ను నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రాజకీయాలను సమాజం తిరస్కరించాలని పిలుపునిచ్చారు. మహాభారతంలోని ద్రౌపది ఘట్టాన్ని ప్రస్తావిస్తూ మహిళలను లక్ష్యంగా చేసుకునే రాజకీయ సంస్కృతి మారాలని వ్యాఖ్యానించారు. పర్యటన చివరి రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన "స్వయం ఉపాధికి చేయూత" కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి పరికరాలు అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌లో 29 ఏళ్లుగా ప్రజాసేవ చేయడం తన అదృష్టమని, ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని అన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ద్వారా వచ్చే లాభాలు తిరిగి మహిళలకే అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా సాయిబాబా, గంగమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మృతిచెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. శాంతిపురంలోని తన నివాసంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొత్తంగా నాలుగు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో సాగిన నారా భువనేశ్వరి పర్యటన ప్రజలతో ఆత్మీయ మమేకం, మహిళలకు ఆత్మవిశ్వాసం నింపే సందేశాలు, విద్యార్థులకు స్ఫూర్తిదాయక ప్రసంగాలు, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమంపై హామీలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కొనసాగింది. గ్రామాల్లో ప్రజలు, మహిళలు, కార్యకర్తలు ఆమెకు అపూర్వ స్వాగతం పలకగా, ప్రతి కార్యక్రమంలో విశేష స్పందన కనిపించింది. కుప్పం ప్రజలు చూపిన ప్రేమాభిమానాలకు జీవితాంతం రుణపడి ఉంటానని భువనేశ్వరి పర్యటన ముగింపు సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *