పూతలపట్టులో 88 ఎకరాల్లో భారీ ఎంఎస్‌ఎంఈ పార్కు..
చిత్తూరు పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు
మామిడి, టమోటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
రూ. 100 కోట్ల వరకు పెట్టుబడుల అంచనా
5000 మంది వరకు ఉపాధి అవకాశాలు
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట పోటుకనుమ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 88 ఎకరాల భూమిని గుర్తించి కేటాయించింది. దీంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. స్థానిక యువతకు ఉపాధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా ఈ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఎంఎస్‌ఎంఈ పార్కులలో ఇది కీలక ప్రాజెక్టుగా నిలవనుంది. ఈ పార్కులో స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా మామిడి, టమోటా తదితర పంటల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ పరిశ్రమలు, ప్లాస్టిక్ మౌల్డింగ్ యూనిట్లు, కార్టన్ తయారీ కేంద్రాలు, ఇంజనీరింగ్, ఫ్యాబ్రికేషన్, ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పర్యావరణహిత పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా బయో-సీఎన్‌జీ ప్రాజెక్టుల ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి. రూ.100 కోట్ల వరకు ప్రైవేటు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా సుమారుగా 5000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వ, డీకేటీ భూములను గుర్తించి భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ అయ్యాయి. భూమిని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా చదును చేయడం, సరిహద్దులు నిర్ణయించడం వంటి పనులు కొనసాగుతున్నాయి. తిరుపతి చిత్తూరు జాతీయ రహదారి నుంచి పి.కొత్తకోటకు కొత్త లింక్ రోడ్డును పూర్తి చేయడంతో పార్కుకు రవాణా అనుసంధానం చేశారు. ఈ పార్కు అభివృద్ధికి అవసరమైన అంతర్గత రహదారులు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కోసం రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ప్రభుత్వ పెట్టుబడి పెట్టనున్నారు. అనంతరం పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసే యూనిట్ల ద్వారా మరో రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ప్రైవేటు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పారిశ్రామిక పార్కు ద్వారా స్థానిక యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, ఇంజనీరింగ్ తదితర యూనిట్లలో సుమారు 1,500 నుంచి 2,500 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. రవాణా, ముడిసరుకు సరఫరా, హోటళ్లు, చిన్న వ్యాపారాలు వంటి అనుబంధ రంగాల్లో మరో 2,000 మందికి పైగా పరోక్ష ఉపాధి లభించనుంది. పార్కులో ప్లాట్ల కేటాయింపును ఏపీఐఐసీ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో చేపట్టనుంది. పారిశ్రామికవేత్తలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ప్రాజెక్టు నివేదిక, ఆర్థిక వివరాలతో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం నిర్ణీత గడువులోపు ప్లాట్ల కేటాయింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక అభివృద్ధి పాలసీ–4.0 ప్రకారం ఈ పార్కులో పరిశ్రమలు స్థాపించే వారికి 15 శాతం నుంచి 35 శాతం వరకు పెట్టుబడి సబ్సిడీ, భూములపై 100 శాతం స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్, తొలి ఐదేళ్లపాటు విద్యుత్ రాయితీ, ఐదేళ్లపాటు ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్ వంటి ప్రోత్సాహకాలు లభించనున్నాయి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలకు అదనపు రాయితీలు, ప్రాధాన్యత కూడా కల్పించనున్నారు. పారిశ్రామిక పార్కు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చిత్తూరు జిల్లాలో తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు పెరిగి రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు లభించనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, పెట్టుబడులు, పారిశ్రామికీకరణకు ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.

