షైనింగ్ స్టార్ అవార్డుల్లో ప్రైవేటు కళాశాల విద్యార్థులదే హవా..
చతికిలబడిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు
నేడే చిత్తూరులో షైనింగ్ స్టార్ అవార్డుల ప్రదానం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న షైనింగ్ స్టార్స్ అవార్డ్స్–2026 కార్యక్రమానికి చిత్తూరు జిల్లా నుంచి ఎంపికైన ఇంటర్మీడియట్ విద్యార్థుల జాబితా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా వ్యవస్థల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరోసారి స్పష్టంగా బయటపెట్టింది. జిల్లాలో మొత్తం 34 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు షైనింగ్ స్టార్ అవార్డులకు ఎంపిక కాగా, వారిలో 25 మంది ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులు, 7 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు, 2 మంది కేజీబీవీ వొకేషనల్ కళాశాలల విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది.
ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఈసారి కూడా అవార్డుల జాబితాలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాయి. శ్రీ చైతన్య, శ్రీ వివేకానంద, పీఎస్‌ఎన్‌ఎస్ శ్రీ వివేకానంద, మదర్ థెరిస్సా, మాధవి, శ్రీ వాణి, శ్రీ విద్యావికాస్, సాయి శ్రీ చైతన్య, శ్రీ సూర్య, విజయం తదితర ప్రైవేటు కళాశాలల విద్యార్థులు అత్యధికంగా అవార్డులు సాధించారు. బీపీసీ, సీఈసీ, ఎంఈసీ, ఎంపీసీ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రైవేటు కళాశాలలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి కేవలం బి. విఘ్నేష్ (ప్రభుత్వ జూనియర్ కళాశాల, నరసింగరాయునిపేట), వెంకటేష్ కలావతి (ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, నగరి), డి. గంగా శ్రీ (పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, చిత్తూరు), కొమ్ములు వైష్ణవి, చీమనపల్లి జగదీష్ (టీకేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల, పలమనేరు), పి. ధనలక్ష్మి (ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల, చిత్తూరు), ఎన్. షహతాజ్ బాను (ప్రభుత్వ జూనియర్ కళాశాల, బంగారుపాళ్యం) మాత్రమే అవార్డులు దక్కించుకున్నారు. కేజీబీవీ వొకేషనల్ కళాశాలల నుంచి రామచంద్ర రెడ్డి సంధ్య (శాంతిపురం), ముడే మధు ప్రియ (కుప్పం) అవార్డులు సాధించి ప్రభుత్వ వ్యవస్థకు కొంత ఊరటనిచ్చారు.
ఈ గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రతిభను వెలికితీయడంలో వెనుకబడుతున్నాయనే అభిప్రాయం విద్యావర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనికి ఒక్క కారణం కాకుండా అనేక నిర్మాణాత్మక సమస్యలు దారితీస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చాలా సంవత్సరాలుగా రెగ్యులర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అనేక కళాశాలలు కాంట్రాక్ట్ లేదా గెస్ట్ లెక్చరర్లపైనే ఆధారపడుతున్నాయి. ఉద్యోగ భద్రత, తగిన వేతనాల సమస్యల కారణంగా బోధనలో స్థిరత్వం దెబ్బతింటోంది. కొన్ని చోట్ల సబ్జెక్టులకు పూర్తి స్థాయిలో బోధన కూడా జరగడం లేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. బోధనతో పాటు ఎన్నికల విధులు, సర్వేలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, పరిపాలనా నివేదికల తయారీ వంటి బోధనేతర పనులు లెక్చరర్లపై అధికంగా ఉండటంతో విద్యార్థులకు అవసరమైన వ్యక్తిగత శ్రద్ధ తగ్గుతోంది. ఇదే సమయంలో అనేక ప్రభుత్వ కళాశాలల్లో భవనాలు, ప్రయోగశాలలు, ఆధునిక పరికరాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కూడా తగిన స్థాయిలో లేకపోవడం విద్యా నాణ్యతపై ప్రభావం చూపుతోంది. మరోవైపు కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక కోచింగ్, పరీక్షల ఆధారిత శిక్షణ, వారానికో పరీక్ష, ప్రత్యేక అధ్యయన ప్రణాళికలతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. ఎంసెట్, నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కూడా ఇంటర్మీడియట్ నుంచే లక్ష్యబద్ధమైన శిక్షణ అందిస్తున్నాయి. ఈ తరహా సమగ్ర వ్యవస్థ ప్రభుత్వ కళాశాలల్లో చాలా చోట్ల అందుబాటులో లేకపోవడం ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గు చూపడానికి కారణమవుతోంది. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారే కావడం, తల్లిదండ్రుల నుంచి విద్యాపరమైన మార్గనిర్దేశం పరిమితంగా ఉండటం, హాజరు, అకడమిక్ పర్యవేక్షణ, తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించే వ్యవస్థ అన్ని చోట్ల సమర్థంగా లేకపోవడం కూడా ఫలితాలపై ప్రభావం చూపుతున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించాలంటే ఖాళీ లెక్చరర్ పోస్టులను అత్యవసరంగా భర్తీ చేయడం, బోధనేతర బాధ్యతలను తగ్గించడం, మౌలిక వసతులను ఆధునికీకరించడం, పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందించడం, విద్యార్థుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ చేపట్టడం వంటి చర్యలు అత్యవసరమని విద్యావర్గాలు సూచిస్తున్నాయి. షైనింగ్ స్టార్ అవార్డుల జాబితా కేవలం ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించడమే కాకుండా, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాల్సిన అవసరాన్ని కూడా స్పష్టంగా గుర్తు చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

