ఎల్‌నినో ప్రభావంతో వేరుశనగకు భారీ దెబ్బ.. 7.5 శాతం మాత్రమే సాగు
ప్రత్యామ్నాయంగా ఉలవలు, ఉద్దుల సాగుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ
15,380 హెక్టార్లలో ఉలవలు, 800 హెక్టార్లలో ఉద్దులు సాగుకు ప్రణాళిక
3,845 క్వింటాళ్ల ఉలవలు, 160 క్వింటాళ్ల ఉద్దులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
ఎల్‌నినో ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట అయిన వేరుశనగ సాగు దాదాపు నిలిచిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతుండగా, పరిస్థితిని సమీక్షించిన వ్యవసాయ శాఖ వేరుశనగ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉలవలు, ఉద్దుల సాగును ప్రోత్సహించే ప్రణాళికను సిద్ధం చేసింది. రైతులకు అవసరమైన విత్తనాల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జిల్లాలో 15,380 హెక్టార్లలో ఉలవలు 800 హెక్టార్లలో ఉద్దులు సాగు చేయాలని ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించారు. ఇందుకు 3,845 క్వింటాళ్ల ఉలవలు, 160 క్వింటాళ్ల ఉద్దులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి ప్రతిపాదనలు పంపారు.
జిల్లా వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం జిల్లాలో మొత్తం 44,267 హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 10,524 హెక్టార్లలో మాత్రమే సాగు నమోదైంది. అంటే లక్ష్యంలో 23.8 శాతం మాత్రమే సాగు జరిగింది. వర్షాభావం కారణంగా అన్ని రకాల పంటల సాగు వెనుకబడినా, అత్యధిక ప్రభావం వేరుశనగపైనే పడింది. జిల్లాలో 21,903 హెక్టార్లలో వేరుశనగ సాగు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు కేవలం 1,646 హెక్టార్లలో మాత్రమే సాగైంది. అంటే కేవలం 7.5 శాతం మాత్రమే. సాధారణంగా జూలై మధ్య నాటికి వేరుశనగ విత్తనాలు పూర్తవుతాయి. ప్రస్తుతం ఆ గడువు కూడా ముగియడంతో ఇకపై వేరుశనగ విత్తినా ఆశించిన దిగుబడి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో వేలాది మంది రైతులు వేరుశనగ సాగును వదిలేసే పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ సాగు దెబ్బతినడంతో రైతులు పూర్తిగా నష్టపోకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించింది. జిల్లాలో 15,380 హెక్టార్లలో ఉలవలు, 800 హెక్టార్లలో ఉద్దులు సాగు చేయాలని ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు 384.5 క్వింటాళ్ల ఉలవల విత్తనాలు, 160 క్వింటాళ్ల ఉద్దుల విత్తనాలు అవసరమని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు. ఆగస్టు 15లోపు ఈ ప్రత్యామ్నాయ పంటలను విత్తితే రైతులకు కొంతమేర ప్రయోజనం
ఈ ఉంటుందని, ఆ తర్వాత విత్తిన పంట చేతికి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని ఆయన వివరించారు.
వరి సాగు కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. 9,068 హెక్టార్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 850.40 హెక్టార్లలో మాత్రమే సాగు నమోదైంది. ఇది 9.4 శాతం మాత్రమే. నారుమడులు 133.50 హెక్టార్లలో సిద్ధమైనప్పటికీ వర్షాలు లేక నాట్లు ఆలస్యమవుతున్నాయి. చిరుధాన్యాల సాగు కూడా తీవ్రంగా ప్రభావితమైంది. 3,113 హెక్టార్ల లక్ష్యానికి గాను 490 హెక్టార్లలో మాత్రమే సాగైంది. మొక్కజొన్న 38.2 శాతం, సజ్జలు 18.6 శాతం, రాగులు 9.6 శాతం, జొన్నలు అత్యల్పంగా సాగయ్యాయి. సామలు, కొర్రలు, అరికెలు, వరగు వంటి పంటలు దాదాపు సాగుకే నోచుకోలేదు. పప్పుధాన్యాల పరిస్థితి కూడా నిరాశాజనకంగానే ఉంది. 3,609 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా కేవలం 101 హెక్టార్లలో మాత్రమే సాగు నమోదైంది. కందులు, పెసర్లు, మినుములు, ఉలవలు, అలసందల సాగు కూడా లక్ష్యానికి చాలా తక్కువగా ఉంది. నూనెగింజల పంటలు మొత్తం 21,910 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 1,704 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. ఇందులో ప్రధానంగా వేరుశనగే ఉంది. నువ్వులు, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పంటలు దాదాపు సాగు కాలేదు. మరోవైపు చెరకు మాత్రం 6,559 హెక్టార్ల లక్ష్యానికి గాను 4,013.2 హెక్టార్లలో సాగై 61.2 శాతంతో కొంత ఊరటనిచ్చే పరిస్థితిలో ఉంది.
జిల్లాలో ప్రస్తుతం రైతులందరి ఆశలు వర్షాలపైనే నిలిచాయి. అయితే వేరుశనగ సాగుకు అనువైన సమయం దాటిపోవడంతో ఆ పంటపై ఆధారపడిన రైతులను ఆదుకోవడానికి ఉలవలు, ఉద్దుల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించడం ఇప్పుడు ఖరీఫ్ సీజన్‌లో అత్యంత కీలక పరిణామంగా మారింది. సమయానికి విత్తనాలు అందించి ప్రత్యామ్నాయ పంటల సాగును విజయవంతం చేయగలిగితేనే రైతులకు కొంతమేర నష్టం తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.

