కుప్పం అభివృద్ధికి మూల కేంద్రంగా కడ
ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ఐఏఎస్ అధికారి నియామకం
కుప్పం అభివృద్ధికి పది సూత్రాలు ప్రతిపాదించిన సీఎం
ప్రతివారం కుప్పంలో పర్యటిస్తున్న జిల్లా కలెక్టర్
సాకారం అవుతున్న స్వర్ణ కుప్పం కల
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
ఒకప్పుడు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా గుర్తింపు పొందిన కుప్పంను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా కుప్పం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (కడ)ను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా నియమించారు. ప్రస్తుతం వికాస్ మర్మత్ కడ పిఓ గా పనిచేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అన్ని శాఖల పనులను ఒకే వేదికపై సమన్వయం చేస్తూ కుప్పం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కేవలం అభివృద్ధి పనుల అమలుకే పరిమితం కాకుండా, ప్రతి శాఖ పనితీరును పర్యవేక్షించడం, సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడం, ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించడం వంటి బాధ్యతలను కూడా కడ నిర్వహిస్తోంది.
కుప్పం నియోజకవర్గాన్ని స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పది సూత్రాల కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందేలా సంక్షేమ కార్యక్రమాలు, గృహ వసతి, పారిశుధ్యం, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ వంటి అన్ని రంగాలను ఈ ప్రణాళికలో చేర్చారు. ప్రతి కుటుంబం స్వర్ణ కుప్పం లక్ష్యంతో ఇప్పటివరకు 3,547 గృహ మరుగుదొడ్లు నిర్మించగా, 3,895 కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు చేశారు. 1,629 గ్యాస్ కనెక్షన్లు అందించడంతో పాటు 300 స్వయం సహాయక బృందాలను బ్యాంకులతో అనుసంధానం చేసి 52 బృందాల ఆడిట్లు పూర్తి చేశారు. ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం ఇస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 24.84 లక్షల వేతన ఉపాధి కల్పించారు. 4,179 మంది మహిళలకు స్త్రీనిధి ద్వారా మద్దతు అందించగా, 3,014 మంది లబ్ధిదారులను బ్యాంకులతో అనుసంధానం చేశారు. ఉన్నతి స్వయం ఉపాధి పథకం కింద 299 మందికి సహాయం అందించడంతో పాటు వంద స్వయం సహాయక బృందాలను డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్ వేదికలతో అనుసంధానం చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను పెంచే చర్యలు చేపట్టారు. విద్య, నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యం కల్పించారు. పాఠశాల మానేసే వారి శాతం 18 శాతం తగ్గగా, 210 గ్రామాల్లో 2,664 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 12 నైపుణ్య కేంద్రాలు పనిచేస్తుండగా, హరిత నైపుణ్యాలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నారు. ప్రతి వ్యక్తి పుట్టుక నుంచి జీవనోపాధి వరకు సాధికారత సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాగునీటి భద్రత కోసం నివాస ప్రాంతాలన్నింటిలో 100 శాతం జీఐఎస్ ఆధారిత నీటి మ్యాపింగ్ పూర్తి చేశారు. గ్రామ పంచాయతీల్లో 372 జీవ కాలుష్య పరీక్షలు నిర్వహించడంతో పాటు 837 నీటి నాణ్యత, సంరక్షణ కార్యక్రమాలు చేపట్టారు. 52 శిక్షణ కార్యక్రమాల ద్వారా నీటి నిర్వహణపై అవగాహన కల్పించారు. ఏడు మండలాల్లో నీటి, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు 6,474 క్వింటాళ్ల విత్తనాలు, 70 మెట్రిక్ టన్నులకు పైగా సూక్ష్మపోషకాలు, 435 లీటర్ల జీవ ఎరువు, 106 వ్యవసాయ యాంత్రీకరణ యూనిట్లు పంపిణీ చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు పారదర్శక ధరలకు అందుబాటులో ఉంచుతున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా 45 కిలోమీటర్లకు పైగా సిమెంట్ కాంక్రీట్ రోడ్లు నిర్మించగా, 157 కిలోమీటర్ల రహదారులను పునరుద్ధరించారు. 56.4 కిలోమీటర్ల మేర గుంతలను పూర్తిగా పూడ్చి, 26.7 కిలోమీటర్ల బ్లాక్‌టాప్ రోడ్లను పునరుద్ధరించారు. రైతు భరోసా కేంద్రాలను సేకరణ కేంద్రాలుగా ఉపయోగించి రైతుల రవాణా వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుకు ప్రాధాన్యం ఇస్తూ 7,546 గృహాలను సౌరశక్తితో అనుసంధానం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ భవనాల్లో శక్తి సామర్థ్య ఆడిట్లు నిర్వహిస్తుండగా, 35 ప్రభుత్వ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకురావాలనే లక్ష్యంతో పరిశోధన, నాణ్యత నియంత్రణ, ట్రేసబిలిటీ, క్యూ ఆర్ కోడ్ వ్యవస్థలను ప్రవేశపెడుతున్నారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ 674 లక్ష్యాల్లో 475 ఇన్‌లైన్ క్లోరినేషన్ యూనిట్లు ఏర్పాటు చేశారు. 6,500 మొక్కలు నాటడంతో పాటు నెట్ జీరో వేస్ట్ షెడ్ల నిర్మాణం చేపట్టారు. క్లాప్ మిత్రుల ద్వారా గ్రామాల్లో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. అదే విధంగా ఏఐ, ఐఓటీ ఆధారిత సాంకేతికతను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు సమీకృత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, 25 వార్డుల్లో స్మార్ట్ వీధి దీపాలు, ఐఓటీ ఆధారిత డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసే కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
ఈ పది సూత్రాల అమలులో కడ కీలక పాత్ర పోషిస్తోంది. అన్ని శాఖల అధికారులను ఒకే వేదికపై సమన్వయం చేస్తూ లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయించే బాధ్యతను కడ నిర్వహిస్తోంది. ఇందుకోసం నియమించిన ఐఏఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రతి శాఖ పనులను నిరంతరం సమీక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రతి వారం కుప్పం నియోజకవర్గాన్ని సందర్శిస్తూ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా కుప్పం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు, ప్రత్యేక ఐఏఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నియామకం, ముఖ్యమంత్రి ప్రతిపాదించిన పది సూత్రాల కార్యాచరణ, జిల్లా కలెక్టర్ వారానికోసారి నిర్వహిస్తున్న సమీక్షలు, అన్ని శాఖల సమన్వయంతో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కుప్పంను స్వర్ణ కుప్పంగా, దేశానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులుగా మారుతున్నాయి.

