2,11,776 మంది విద్యార్థులకు లబ్ధి..
1,31,332 మంది తల్లుల ఖాతాల్లో రూ.275.31 కోట్ల జమ
బుధ, గురు, శుక్ర వారాల్లో దశలవారీగా నిధుల జమ..
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద చిత్తూరు జిల్లాలో బుధవారం నిధుల విడుదల ప్రారంభమైంది. జిల్లాలోని 2,11,776 మంది విద్యార్థులకు సంబంధించిన 1,31,332 మంది తల్లులు లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.275.31 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. తొలి విడతగా బుధవారం నుంచి నగదు జమ ప్రక్రియ ప్రారంభం కాగా, మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లో గురువారం, శుక్రవారం కూడా దశలవారీగా నిధులు జమ కానున్నాయి. విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు అర్హులుగా ఉన్నా ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, నివాస పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికీ ఈ సాయం అందిస్తున్నారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం రూ.15 వేల మంజూరు చేస్తోంది. ఇందులో రూ.13 వేలను తల్లి లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుండగా, రూ.2 వేలను ఆయా పాఠశాలల నిర్వహణ, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేటాయిస్తోంది. ఈ విధానం ద్వారా ఒకవైపు విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రాథమిక సదుపాయాల మెరుగుదలకు కూడా తోడ్పాటు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే ప్రదర్శించారు. తమ పేరు జాబితాలో ఉందో లేదో ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హత ఉన్నప్పటికీ పేరు జాబితాలో లేకపోతే వెంటనే సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయంలో అవసరమైన ధ్రువపత్రాలతో అభ్యంతరం నమోదు చేసుకోవాలని తెలిపారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం అర్హులుగా తేలిన వారిని తదుపరి విడతలో పథకం పరిధిలోకి తీసుకువచ్చి నిధులు జమ చేస్తామని వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో ఈ పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థుల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. విద్యా ఖర్చుల భారం తగ్గడంతో పాటు విద్యార్థులు నిరంతరంగా పాఠశాలలకు హాజరయ్యేలా ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. బుధ, గురువారాల్లో మొత్తం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ పూర్తికానుండగా, ఖాతాల్లో నగదు జమ వివరాలను లబ్ధిదారులు సంబంధిత బ్యాంకులు లేదా అధికారిక సేవల ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.

