నిండు జీవితానికి రెండు చుక్కలు..
నిండు జీవితానికి రెండు చుక్కలు..
పోలియో అంతం మన పంతం
నేడే పోలియో ఆదివారం
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని అందించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లాలో ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్య, ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది. ఇప్పటికే సాధారణ టీకాల కార్యక్రమంలో పోలియో టీకాలు తీసుకున్న చిన్నారులకు కూడా ఈ చుక్కలు తప్పనిసరిగా వేయించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
భారతదేశంలో పోలియో నిర్మూలన లక్ష్యంగా 1995 సంవత్సరం నుంచి జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. అప్పట్లో వేలాది మంది చిన్నారులు పోలియో బారిన పడి జీవితాంతం శాశ్వత వైకల్యానికి గురయ్యేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో నిరంతరం చేపట్టిన పోలియో కార్యక్రమాల ఫలితంగా 2011లో దేశంలో చివరి పోలియో కేసు నమోదైంది. అనంతరం 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది. అయినప్పటికీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పోలియో వైరస్ ఇంకా కొనసాగుతుండటంతో భారతదేశంలో ప్రతి చిన్నారికి రోగనిరోధక శక్తి కొనసాగేందుకు ప్రతి ఏడాది పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 18,05,016 మంది జనాభా ఉండగా, 0 నుంచి 5 సంవత్సరాల లోపు 1,65,203 మంది చిన్నారులను అధికారులు గుర్తించారు. ఈ చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా 2,421 పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేస్తారు. ఆదివారం బూత్‌కు రాలేకపోయిన చిన్నారులకు ఈ నెల 29, 30 తేదీల్లో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. చుక్కలు వేసిన తర్వాత సంబంధిత ఇంటి తలుపుపై ప్రత్యేక గుర్తు వేస్తారు. ఒక్క చిన్నారి కూడా మిగలకుండా ప్రతి ఇంటిని సందర్శించేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని ఇటుక బట్టీలు, సంచార జాతులు, మురికివాడలు, వలస కార్మికులు నివసించే ప్రాంతాలు, నిర్మాణ ప్రదేశాలు, కోళ్ల ఫారాలు, వ్యవసాయ క్షేత్రాల వద్ద నివసించే కుటుంబాలు వంటి 104 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ నివసించే చిన్నారులకు ప్రత్యేక బృందాలు వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నాయి. ఇందుకోసం 119 రూట్ బృందాలు, ఒక మొబైల్ బృందం, 61 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం కార్యక్రమంలో 7,546 మంది అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొంటున్నారు. పోలియో వైరస్ ప్రధానంగా చిన్నపిల్లలపై దాడి చేసి చేతులు, కాళ్లు పనిచేయకుండా శాశ్వత వైకల్యానికి గురిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ కండరాలపై ప్రభావం చూపి ప్రాణాపాయం కూడా కలిగిస్తుంది. దీనికి శాశ్వత చికిత్స లేకపోవడంతో నివారణ ఒక్కటే మార్గం. పల్స్ పోలియో రోజున ఇచ్చే రెండు చుక్కలు పిల్లల్లో రోగనిరోధక శక్తిని మరింత పెంచి వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి. ఇప్పటికే సాధారణ టీకాలు తీసుకున్న పిల్లలకు కూడా ఈ రెండు చుక్కలు తప్పనిసరిగా వేయించాలి. పోలియో చుక్కలు వేయించకపోతే పిల్లలు వైరస్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఒకసారి పోలియో సోకితే జీవితాంతం వికలాంగులుగా మారే అవకాశం ఉంది. అందుకే ఒక్క చిన్నారిని కూడా వదలకుండా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బూత్‌లకు తీసుకువెళ్లి పోలియో చుక్కలు వేయించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులతో పాటు ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ పెద్దలు కూడా ప్రజల్లో అవగాహన కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి చిన్నారికి రెండు చుక్కలు వేయించినప్పుడే పోలియో వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమానికి ముందు శనివారం చిత్తూరులో గాంధీ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం చేపట్టి నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో అంతం మన పంతం, పోలియో ఆదివారం విజయవంతం చేద్దాం అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఇన్‌చార్జి డెమో రాజేంద్రప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి, జిల్లా రోగనిరోధక టీకాల అధికారి డాక్టర్ హనుమంతరావు, జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్, జిల్లా సమన్వయ వైద్యాధికారి డాక్టర్ పద్మాంజలి దేవి, సూపరింటెండెంట్ డాక్టర్ ఉషశ్రీ, వివిధ కార్యక్రమాల అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

