రైతులకు నాసిరకం వేరుశనగ విత్తనాల పంపిణీ
ప్రభుత్వం ఇచ్చిన వేరుశనగలో 20 శాతం కూడా విత్తనాలు లేదని విమర్శలు
9 మండలాలకు మాత్రమే వేరుశెనగ విత్తనాలు సరఫరా
విత్తనాలు నాసిరకం అని తేలడంతో మిగిలిన మండలాలకు సరఫరా నిలుపుదల
సరఫరా చేసిన విత్తనాలు మొలకెత్తడం సందేహమే
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతాంగానికి నాసిరకం వేరుశనగ విత్తనాల సరఫరా మరో పెద్ద దెబ్బగా మారింది. వర్షాలు లేక సాగు పనులు ముందుకు సాగక రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ప్రభుత్వం సరఫరా చేసిన వేరుశనగ విత్తనాలు కూడా నాసిరకంగా ఉండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా ఆశించిన స్థాయిలో వేరుశనగ సాగు జరగకపోవడంతో ఈ ఏడాది విత్తడానికి రైతుల వద్ద నిల్వ విత్తనాలు లేకపోయాయి. దీంతో ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు అందిస్తుందనే ఆశతో ఎదురుచూసిన రైతులకు చివరకు నిరాశే మిగిలింది.
ఈ ఖరీఫ్ సీజన్‌కు చిత్తూరు జిల్లాకు మొత్తం 67,794 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా, ఇప్పటివరకు 31,582 క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి. ఈ విత్తనాలను కుప్పం, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం, బైరెడ్డిపల్లి, వీ.కోట, పలమనేరు, ఎస్.ఆర్.పురం, వేదురుకుప్పం మండలాలకు సరఫరా చేశారు. అయితే రైతుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో విత్తనాల నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ అంశం ప్రధాన చర్చగా మారింది. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ, సాధారణంగా 60 శాతం విత్తనాలు ఉండాలని, ప్రభుత్వం సరఫరా చేసిన కాయలలో 20 శాతం కూడా విత్తనాలు లేవని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు జడ్పీటీసీ సభ్యులు కూడా ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాల్లో రాళ్లు, రెప్పలు ఎక్కువగా ఉండటంతో పాటు నాసిరకం గింజలను రైతులకు అంటగట్టారని ఆరోపించారు. ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు ఇవ్వకపోతే రైతులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి స్పందిస్తూ విత్తనాల నాణ్యతపై రైతుల నుంచి ఫిర్యాదులు అందిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే తదుపరి విత్తనాల సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు కేవలం తొమ్మిది మండలాలకు మాత్రమే విత్తనాలు పంపిణీ చేశామని, మిగిలిన మండలాలకు సరఫరా చేయలేదన్నారు. ఇదే సమయంలో వేరుశనగ విత్తే గడువు కూడా ముగుస్తుండటంతో రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించినట్లు వివరించారు. అయితే రైతులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వర్షాలు కురవక పంటలు ఆలస్యమవుతుండగా, మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలు కూడా మొలకెత్తకపోవడంతో రెండింతల నష్టాన్ని ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. అప్పులు చేసి, ఆశలతో సాగుకు సిద్ధమైన తమను ప్రభుత్వం పూర్తిగా నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే నాసిరకం విత్తనాలు సరఫరా చేస్తే ఇక తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నాసిరకం విత్తనాల సరఫరాపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించడంతో పాటు నాణ్యమైన విత్తనాలను అత్యవసరంగా సరఫరా చేయాలని రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రైతు నష్టాన్ని కేవలం గణాంకాలుగా కాకుండా వారి జీవనాధారంగా ప్రభుత్వం గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లావ్యాప్తంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

