21, జులై 2026, మంగళవారం

మామిడి, అరటి, కోకో రైతులకు స్వర్ణయుగం..

చిత్తూరుకు అంతర్జాతీయ ఫుడ్ హబ్ గుర్తింపు..! 
గంగాధర నెల్లూరులో రూ.100 కోట్ల యూఏఈ ప్రాసెసింగ్ యూనిట్
25 దేశాలకు ఎగుమతులు.. వేలాది మందికి ఉపాధి

చిత్తూరు, జూలై 22: ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి చెందిన చిత్తూరు జిల్లా ఇప్పుడు అంతర్జాతీయ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఆరు నెలల్లోనే కార్యరూపం దాల్చింది. ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (APEDB), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఫుడ్ క్లస్టర్ మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా యూఏఈకి చెందిన ప్రముఖ సంస్థ ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో రూ.100 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది జిల్లాలో తొలి అంతర్జాతీయ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌గా నిలవనుండడం విశేషం.

ఈ యూనిట్ ద్వారా చిత్తూరు జిల్లాలో పండే మామిడి, అరటి, కోకోతో పాటు టమాటా, బొప్పాయి, జామ, ఇతర ఉద్యాన పంటలను శుద్ధి చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో విలువ ఆధారిత ఉత్పత్తులుగా తయారు చేసి ప్రపంచంలోని 25 దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఇప్పటివరకు ధరలు లేక రైతులు రోడ్లపై పారబోసిన మామిడి, టమాటా వంటి పంటలకు ఇక స్థిరమైన మార్కెట్ లభించే అవకాశం ఏర్పడుతోంది. రైతుల నుంచి నేరుగా పంటలను కొనుగోలు చేయడం వల్ల మధ్యవర్తుల పాత్ర తగ్గి, రైతులకు మెరుగైన ధరలు అందే పరిస్థితి ఏర్పడనుంది.

ప్రస్తుతం చిత్తూరు జిల్లా దేశంలోనే మామిడి పల్ప్ తయారీలో కీలక కేంద్రంగా ఉన్నప్పటికీ, తాజా పెట్టుబడితో అంతర్జాతీయ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా మరింత ఎదిగే అవకాశం కనిపిస్తోంది. మామిడి పల్ప్, జ్యూస్, ప్యూరీ, స్క్వాష్, జామ్, జెల్లీ, డ్రై ఫ్రూట్ ఉత్పత్తులు, ఫ్రోజన్ ఫుడ్స్, కోకో ఆధారిత చాక్లెట్ ఉత్పత్తులు వంటి అనేక విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి మార్గం సుగమం కానుంది. దీంతో చిత్తూరులో మరిన్ని అనుబంధ పరిశ్రమలు ఏర్పడే అవకాశాలు కూడా మెరుగవుతున్నాయి.

ఈ ప్రాజెక్టు ప్రభావంతో కోల్డ్ స్టోరేజ్‌లు, గిడ్డంగులు, ప్యాకేజింగ్ యూనిట్లు, ఎగుమతి సంస్థలు, లాజిస్టిక్స్ కేంద్రాలు, నాణ్యత పరీక్ష ప్రయోగశాలలు, రవాణా రంగం వంటి అనేక అనుబంధ రంగాలు అభివృద్ధి చెందనున్నాయి. స్థానికంగా వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మహిళలకు గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే అవకాశముంది.

రైతులకు కూడా ఈ ప్రాజెక్టు గణనీయమైన మేలు చేయనుంది. పంటలకు స్థిరమైన మార్కెట్ లభించడం, ఒప్పంద వ్యవసాయానికి అవకాశాలు పెరగడం, ఎగుమతి నాణ్యత పంటలు సాగు చేస్తే అధిక ధరలు దక్కడం, పంట వృథా తగ్గడం, ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ లభించడం వంటి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా తోటాపురి మామిడి ధరల పతనంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఈ పరిశ్రమ కొత్త ఆశలు కలిగిస్తోంది.

సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానంతో పెట్టుబడులను వేగంగా ఆకర్షిస్తున్నామని తెలిపారు. రూ.1 లక్ష కోట్ల అంచనాతో రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని, రిలయన్స్ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కృష్ణా–గోదావరి డెల్టా నీటి వనరులు, 200కు పైగా ఉద్యాన క్లస్టర్లు, బలమైన రోడ్డు, రైలు, పోర్టు అనుసంధానం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

గంగాధర నెల్లూరులో ఏర్పాటు కానున్న ఈ అంతర్జాతీయ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో చిత్తూరు జిల్లా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు రానుంది. రైతుల ఆదాయం పెరగడం, విదేశీ మార్కెట్లు అందుబాటులోకి రావడం, పరిశ్రమలు విస్తరించడం, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా చిత్తూరు జిల్లా దేశంలోనే అత్యంత కీలక ఉద్యాన ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రంగా అవతరించే దిశగా మరో ముందడుగు పడిందని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *