2, జులై 2026, గురువారం

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో చిత్తూరు జిల్లా విలవిల...


వాన జాడ లేక ముందుకు సాగని ఖరీఫ్‌ పంటలు

ఎండిపోతున్న చెరువులు.. దిక్కుతోచని రైతన్న

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

చిత్తూరు జిల్లాపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా పడింది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జిల్లా అంతటా కరువు ఛాయలు అలుముకున్నాయి. మండుతున్న ఎండలు, ఎండిపోతున్న చెరువులు, బీటలు వారిన పొలాలు, పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే నెల రోజులు ఆలస్యమైనా వర్షాలు లేకపోవడంతో రైతులు విత్తనాలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. జూన్ నెలలో జిల్లాకు సాధారణంగా 79.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, వాస్తవంగా కేవలం 52.7 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కంటే 33.8 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం లోటు తీవ్ర స్థాయికి చేరడంతో వ్యవసాయ కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

జిల్లాలోని 28 మండలాల్లో కేవలం బైరెడ్డిపల్లి, శాంతిపురం మండలాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. నిండ్ర, విజయపురం, కార్వేటినగరం, పెనుమూరు, రామకుప్పం, పాలసముద్రం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 20 మండలాల్లో తక్కువ లేదా అత్యల్ప వర్షపాతం నమోదవడంతో కరువు పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ముఖ్యంగా పూతలపట్టు, ఐరాల, పెద్దపంజాణి, గంగవరం, తవణంపల్లి, శ్రీరంగరాజపురం, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, యాదమరి వంటి మండలాల్లో వర్షాభావం తీవ్రంగా కనిపిస్తోంది. వర్షాభావం కారణంగా జిల్లాలో ఖరీఫ్ సాగు ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. 44,267 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 7,374 హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది. ప్రధాన ఆహార పంటల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 9,068 హెక్టార్లలో వరి సాగు లక్ష్యంగా ఉండగా ఇప్పటివరకు కేవలం 562 హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది. 21,903 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉండగా కేవలం 923 హెక్టార్లలో మాత్రమే విత్తనాలు పడ్డాయి. 1,779 హెక్టార్లలో కందులు సాగు లక్ష్యంగా ఉండగా 48 హెక్టార్లకే పరిమితమైంది. 1,495 హెక్టార్లలో సాగు కావాల్సిన ఉలవల పంట ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. 6,559 హెక్టార్లలో చెరకు సాగు లక్ష్యంగా ఉండగా 3,938 హెక్టార్లలో మాత్రమే సాగైంది. వర్షాలు లేక పొలాలు ఎండిపోవడంతో రైతులు విత్తనాలు వేయడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులు పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదో అన్న ఆందోళనలో ఉన్నారు. బోర్లు ఎండిపోవడం, భూగర్భ జలాలు క్షీణించడం వల్ల సాగునీటి సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. చెరువులు, కుంటలు నీరులేక వెలవెలబోతుండటంతో పశువులకు తాగునీరు అందించడం కూడా రైతులకు భారంగా మారింది. పశుగ్రాసం కొరతతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతుల చూపులు ఆకాశంపైనే నిలుస్తున్నాయి. ఒక మంచి వాన పడితేనే పొలాల్లో దుక్కులు మొదలవుతాయని, లేకపోతే ఈ ఏడాది ఖరీఫ్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గత రెండు సీజన్లలో నష్టాలను చవిచూసిన రైతులకు ఈసారి కూడా వర్షాలు దూరమవడంతో అప్పుల భారం మరింత పెరిగే పరిస్థితి నెలకొంది. వ్యవసాయ నిపుణులు మాత్రం జూలై మొదటి, రెండో వారాల్లో విస్తృత వర్షాలు కురిస్తేనే ఖరీఫ్ సీజన్ కొంతవరకు గాడిలో పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అప్పటి వరకు రైతులు ఆతురపడి విత్తనాలు వేయకుండా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా రైతన్నకు వర్షమే జీవనాధారం. మేఘాలు కరుణిస్తేనే పంటలు పచ్చబడతాయి. లేకపోతే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కరువు కోరల్లో చిక్కుకుని వేలాది రైతు కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *