9, జులై 2026, గురువారం

చిత్తూరు జిల్లా తోతాపురి రైతుకు కేంద్రం అండ...

ఐదేళ్ల సంక్షోభానికి శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు

 తోతాపురి మామిడి ధరల పతనంపై కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

 కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలతో ఐసీఏఆర్ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు

 డాక్టర్ టి. దామోదరన్ నేతృత్వంలో పది రోజుల్లో చిత్తూరు జిల్లాలో క్షేత్రస్థాయి అధ్యయనం

 సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులు, ధరల వ్యవస్థపై సమగ్ర పరిశీలన

 ఐదేళ్లుగా వరుస నష్టాలతో తీవ్ర సంక్షోభంలో తోతాపురి రైతులు

 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2.80 లక్షల ఎకరాల్లో మామిడి సాగు... 90 శాతం తోతాపురి రకమే

 ఒకప్పుడు టన్నుకు రూ. 30,000 పలికిన తోతాపురి... ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో రూ. 4,000కే పరిమితం

 రైతులకు గిట్టుబాటు ధర, ఎగుమతుల విస్తరణ, ప్రాసెసింగ్ రంగ బలోపేతంపై కేంద్రానికి కీలక సిఫార్సులు చేయనున్న కమిటీ

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

 చిత్తూరు జిల్లా తోతాపురి మామిడి రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పరిణామం ఎట్టకేలకు చోటుచేసుకుంది. గత ఐదేళ్లుగా వరుసగా ధరల పతనం, పెరిగిన సాగు వ్యయం, ప్రకృతి వైపరీత్యాలు, ఎగుమతుల మందగమనం, ప్రాసెసింగ్ పరిశ్రమల కొనుగోళ్లలో తగ్గుదల, మధ్యవర్తుల ఆధిపత్యం వంటి సమస్యలతో తీవ్రంగా నష్టపోతున్న తోతాపురి రైతులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రైతుల ఆదాయాన్ని కాపాడడం, తోతాపురి మామిడి ధరలను స్థిరీకరించడం, సాగు నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు మొత్తం విలువ వ్యవస్థను అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారాలు సూచించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా నిర్ణయించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా తోతాపురి మామిడి రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. పెట్టుబడులు పెరిగినా పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని, కోత ఖర్చు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఆవేదనను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న కేంద్ర మంత్రి వెంటనే శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని ఐసీఏఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో లక్నోలోని ఐసీఏఆర్–సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ కార్యాలయం డాక్టర్ టి. దామోదరన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో డాక్టర్ ఎం. శంకరన్, డాక్టర్ హెచ్.ఎస్. సింగ్, డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఉద్యానవన శాఖ ప్రతినిధి సభ్యులుగా ఉన్నారు. రాబోయే పది రోజుల్లో ఈ బృందం ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు తోతాపురి సాగు అధికంగా ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి రైతులు, మామిడి గుజ్జు పరిశ్రమలు, ఎగుమతిదారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఉద్యానవన శాఖ అధికారులు, ఇతర వాటాదారులతో సమావేశమై వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనుంది.

దేశంలోనే తోతాపురి మామిడి సాగుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. జిల్లాలో సుమారు 2.80 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుండగా, అందులో దాదాపు 90 శాతం తోతాపురి రకమే ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 7.50 లక్షల టన్నుల ఉత్పత్తి లభిస్తోంది. రాష్ట్రంలోని మామిడి గుజ్జు పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకులో అత్యధిక భాగం చిత్తూరు నుంచే వెళ్తోంది. సాధారణ పరిస్థితుల్లో ఈ రంగం ద్వారా రూ.1,000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుండగా వేలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు, రవాణా రంగం, ప్యాకింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ పరిశ్రమలు ఈ పంటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అయితే గత ఐదేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒక సంవత్సరం అకాల వర్షాలు, మరోసారి తీవ్ర ఎండలు, పుష్పదశలో వాతావరణ మార్పులు, పురుగులు, శిలీంధ్ర వ్యాధులు దిగుబడిని దెబ్బతీశాయి. ఇదే సమయంలో ఎరువులు, పురుగుమందులు, కూలీల వేతనాలు, రవాణా, విద్యుత్, నీటి ఖర్చులు భారీగా పెరిగాయి. రైతు పెట్టుబడి ఏటా పెరుగుతుండగా పంటకు లభించే ధర మాత్రం క్రమంగా తగ్గిపోయింది. ముఖ్యంగా 2022 తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, యూరప్, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులు మందగించడం, మామిడి గుజ్జు పరిశ్రమల్లో నిల్వలు పెరగడం, కొనుగోళ్లు తగ్గడం వల్ల తోతాపురి రైతు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాడు. ఒకప్పుడు టన్నుకు రూ.18,000 నుంచి రూ. 30,000 వరకు పలికిన తోతాపురి ధర ఈ సీజన్‌లో కొన్ని ప్రాంతాల్లో రూ. 4,000 వరకు పడిపోయింది. అంటే కిలోకు రూ. 4 మాత్రమే దక్కింది. కోతకు అయ్యే ఖర్చు కూడా రాకపోవడంతో రైతులు పండ్లను చెట్లపైనే వదిలేయడం, ట్రాక్టర్లలో తీసుకొచ్చి రోడ్ల పక్కన పారబోయడం వంటి ఘటనలు పలమనేరు, బైరెడ్డిపల్లి, బంగారుపాళ్యం, పూతలపట్టు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో కనిపించాయి. అనేక మంది రైతులు బ్యాంకు రుణాలతో పాటు ప్రైవేటు అప్పుల భారం మోయలేక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరు కొత్తగా తోటలు వేయడానికే వెనుకంజ వేస్తుండగా, మరికొందరు ఉన్న మామిడి తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ధరల పతనానికి గల అసలు కారణాలను గుర్తించడమే కాకుండా రైతుల పెట్టుబడి వ్యయం, దిగుబడులు, ఆదాయాలు, ప్రాసెసింగ్ పరిశ్రమల సామర్థ్యం, దేశీయ మార్కెట్ పరిస్థితులు, ఎగుమతుల అవకాశాలు, డిమాండ్ సరఫరా సమీకరణాలు, విలువ వ్యవస్థలోని లోపాలు, మార్కెట్ విస్తరణ అవకాశాలను కూడా ఐసీఏఆర్ కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా తీసుకోవాల్సిన చర్యలు, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రోత్సాహం, ప్రాసెసింగ్ పరిశ్రమల ఆధునీకరణ, ఎగుమతుల పెంపు, శీతల గిడ్డంగుల ఏర్పాటు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం, మార్కెటింగ్ సంస్కరణలు, దీర్ఘకాలిక విధానపరమైన చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనుంది.

ఈ నివేదిక ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణ రూపొందించి తోతాపురి మామిడి రంగానికి దీర్ఘకాలిక రక్షణ కల్పించే అవకాశం ఉంది. రైతులకు గిట్టుబాటు ధరలు అందించే విధానం, ధరల స్థిరీకరణ వ్యవస్థ, ఎగుమతుల విస్తరణ, ప్రాసెసింగ్ పరిశ్రమల సామర్థ్యాల పెంపు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. తోతాపురి మామిడి సాగుదారుల ఆదాయాన్ని, వారి జీవనోపాధిని రక్షించడమే కేంద్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ రంగాన్ని బలోపేతం చేస్తాం. విలువ జోడింపు, ఎగుమతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా రైతులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఐదేళ్లుగా వెంటాడుతున్న సంక్షోభానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. గిట్టుబాటు ధర, పారదర్శక కొనుగోలు విధానం, బలమైన ఎగుమతి వ్యవస్థ, ప్రభుత్వ రక్షణ, పరిశ్రమలతో సమన్వయం అమల్లోకి వస్తే తోతాపురి మామిడి రంగానికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. చిత్తూరు రైతు భవిష్యత్తును మాత్రమే కాకుండా దేశంలోని తోతాపురి మామిడి రంగ దిశను నిర్ణయించే కీలక అధ్యయనంగా ఈ కమిటీ నివేదిక నిలవనుందని వ్యవసాయ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *